'అసమానతలు తొలగేలా, ఆర్థిక వ్యవస్థ గాడిన పడేలా' - తెలుగుదేశం, జనసేన మినీ మేనిఫెస్టో
Published: Nov 13, 2023, 7:27 PM

Telugu Desam Janasena Mini Manifesto: తెలుగుదేశం - జనసేన పార్టీలు ఉమ్మడి మినీ మేనిఫెస్టో ప్రకటించాయి. ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం జరిగింది. సమావేశం అనంతరం తెలుగుదేశం - జనసేన పార్టీలు ఉమ్మడిగా మినీ మేనిఫెస్టో ప్రకటించాయి.
తెలుగుదేశం సూపర్ 6 పథకాలకు తోడు జనసేన ప్రతిపాదించిన 5అంశాలు సహా మొత్తం 11 అంశాలను ఇందులో పొందిపరిచారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా అంకుర సంస్థల ఏర్పాటుకు 10లక్షల రూపాయల వరకూ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించాయి. ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు, అమరావతి రాజధాని గా కొనసాగింపుపై నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం వంటి జనసేన ప్రతిపాదిత అంశాలు కొత్తగా మినీ మేనిఫెస్టోలో చేర్చారు. అసమానతలు తొలిగి ఆర్ధిక వ్యవస్థ బాగుపడేలా ప్రణాళికలు చేస్తున్నామని నేతలు వెల్లడించారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు తీసుకుని పూర్తి స్థాయి మేనిఫెస్టోలో చేర్చుతామన్నారు. తెలుగుదేశం - జనసేన మేనిఫెస్టో అంటే తప్పనిసరిగా అమలవుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. ఉపాధి పథకాలు ద్వారా యువతకు నమ్మకం కలిగించి ధైర్యం చెప్పే అంశాలను ప్రతిపాదించామన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన కూటమి ఘన విజయం సాధిస్తుందని తేల్చిచెప్పారు.