ETV Bharat / state

Godavari Floods ఎన్నాళ్ళీ వెతలు..! వరదగోదారితో బిక్కుబిక్కుమంటున్న కోనసీమ వాసులు..!

author img

By

Published : Jul 30, 2023, 8:03 PM IST

Godavari Floods
గోదావరి వరదలు

Godavari Floods: గోదావరికి వరద ప్రవాహంతో కోనసీమ ప్రజలను కష్టాలు వీడటం లేదు. అనేక లంక గ్రామాల ప్రజలు పడవలపైనే రాకపోకలు సాగిస్తూ.. గట్లపైనే జీవిస్తున్నారు. ఇక నోరులేని జీవాలు ఆకలితో అలమటిస్తున్నాయి.

Godavari Floods: గోదావరి వరద ప్రవాహానికి లంక గ్రామాలు అల్లాడుతున్నాయి. భారీగా వరద వస్తుండటంతో.. ఇప్పటికీ లంక గ్రామాలు నీటిలోనే మగ్గుతున్నాయి. వరద ప్రవాహం పెరుగుతుండటంతో.. ధవళేశ్వరం నుంచి 16 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేశారు. వరద చుట్టుముట్టడంతో పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. సాయంత్రానికి మరింత వరద పెరిగే అవకాశం ఉంది.

వరదలో లంక భూములు.. గ్రాసం కొరతతో అల్లాడుతున్న పశువులు: లంక గ్రామాల ప్రజలకు మెట్ట భూములు.. పాడిపశువులే జీవనాధారం.. కుటుంబం ఎంత ఆర్థికంగా ఎదిగినా ఇంటి ముందు పాడి పశువులు ఉండవలసిందే.. వీటికి ప్రధానంగా పశుగ్రాసం మెట్ట భూముల నుంచే అందిస్తుంటారు. వరదల కారణంగా లంక భూములన్నీ నీట మునగడంతో గడిచిన నాలుగు రోజులుగా పశువులకు గ్రాసం లేక అల్లాడిపోతున్నాయి. లంక గ్రామాల్లో ఎండుగడ్డి వాడేది చాలా తక్కువ. నిత్యం పచ్చగా ఉండే పంట పొలాల నుంచి తెచ్చిన మేతను పశువులకు అందించడంతో అధిక పాల దిగుబడి వస్తుంది.. దీంతో వారి కుటుంబ జీవనం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతుంటుంది.

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని మూడు మండలాల్లో 1100 వరకు పాడి పశువులు ఉన్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు గుర్తించారు. వరదలకు నెల రోజులు ముందే సీజనల్ వ్యాధులు రాకుండా వ్యాక్సినేషన్ కూడా చేశారు. ప్రస్తుతం వరదలకు పశువులన్నీ లంక భూముల నుంచి ఏటిగట్లకు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముంపు ప్రాంతాలుగా గుర్తించబడిన 7 సెంటర్లలో మొబైల్ వ్యాన్ ద్వారా బూస్టర్ దోస్ వ్యాక్సిన్ అందిస్తున్నామని.. 300 మెట్రిక్ టన్నుల పశుగ్రాసం కోసం ప్రభుత్వానికి నివేదిక పంపామని అన్నారు. ఒకటి రెండు రోజుల్లో పశుగ్రాసం చేరిన వెంటనే రైతులకు అందజేస్తామని పశు వైద్యాధికారి తెలిపారు.

భోజనాలేవి..: కోనసీమ జిల్లాలో వరద ఉద్ధృతి భారీగా పెరుగుతుడడంతో లంకగ్రామాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంకలో ప్రజల ప్రయాణాల నిమిత్తం 15 పడవలు ఏర్పాటు చేయగా.. పడవ వారికి భోజనాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారు. ఉదయం నుంచి కనీసం అల్పాహారం కూడా ఇవ్వలేదని వాపోయారు. మధ్యాహ్నం భోజనాలు కూడా సరఫరా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదని తెలిపారు.

అంత్యక్రియలకు ఇబ్బంది పడుతున్న లంక గ్రామాల ప్రజలు: కోనసీమ జిల్లాలో కాజ్వేలు, లంక గ్రామాలు నీటమునిగాయి. ముక్తేశ్వరంలోని ఎదురు బిడియం కాజ్వే వద్ద ఉన్న శ్మశాన వాటిక వరద నీటిలో మునిగిపోవడంతో.. లంక గ్రామాల్లో చనిపోయిన వ్యక్తులకు దహనకాండాలు చేసేందుకు చోటు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం తొగరపాయ వద్ద శ్మశాన వాటిక వరదలో మునిగిపోవడంతో రోడ్డుపైనే అంతక్రియలు నిర్వహిస్తున్నారు.

వరద ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ ఎమ్మెల్యే పర్యటన: కోనసీమ జిల్లా అయినవిల్లి లంక, వీరవెల్లిపాలెం గ్రామాల్లో కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పర్యటించారు. పునరావాస కేంద్రాలు, ఇతర సౌకర్యాలకు సంబంధించిన వివరాలను వరద బాధితులను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ట్రాక్టర్‌పై తిరిగారు. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎదురు బిడియం కాజ్‌వే నిర్మించాలని సీపీఐ నాయకుడు మచ్చ నాగయ్య రోడ్డపై బైఠాయించారు. ఎమ్మెల్యే, కలెక్టర్ పర్యటనకు వస్తున్నారని తెలిసి ఎర్రజెండాతో ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి తరలించారు.

మరింత పెరిగే అవకాశం: భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం నెమ్మదించినప్పటికీ ధవళేశ్వరం బ్యారేజ్​కి దిగువున ఉన్న కోనసీమలో వరద వస్తూనే ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ఈరోజు ఉదయం 11 గంటలకు.. 16 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని సముద్రంలో విడిచిపెట్టారు. ఈ కారణంగా లోతట్టు లంక గ్రామాలను వరద చుట్టు ముడుతోంది. వరద చుట్టుముట్టడంతో పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి మరింత వరద పెరిగే అవకాశం ఉంది.

బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న కోనసీమ వాసులు.. పడవలపైనే రాకపోకలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.