ETV Bharat / state

గోదావరి తీరంలో ఒట్టిపోయిన ఉద్యానం.. రైతులకు రూ.350 కోట్లపైనే నష్టం

author img

By

Published : Jul 21, 2022, 5:18 AM IST

గోదావరి తీరంలో ఉద్యానం ఒట్టిపోయింది. పెట్టుబడి హారతి కర్పూరమైంది. వ్యవసాయ పంటలకూ తీరని నష్టం వాటిల్లింది. వరద తాకిడికి పంటలు కుళ్లిపోయి, దుర్గంధం వెదజల్లుతున్నాయి.

గోదావరి
గోదావరి

గోదావరి తీరంలో ఉద్యానం ఒట్టిపోయింది. పెట్టుబడి హారతి కర్పూరమైంది. వ్యవసాయ పంటలకూ తీరని నష్టం వాటిల్లింది. వరద తాకిడికి పంటలు కుళ్లిపోయి, దుర్గంధం వెదజల్లుతున్నాయి. గెల దశలో ఉన్న అరటి, కాయదశలో ఉన్న బొప్పాయి, కూరగాయలు అన్నీ వారంపాటు నీటిలోనే నానాయి. కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో ఉద్యాన నష్టం అధికంగా ఉంది. అధికారిక అంచనా మేరకే 20వేల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయి.

వాస్తవంగా లక్ష ఎకరాల వరకు ఉంటుందని అంచనా. ఎకరానికి సగటున రూ.35వేల లెక్కన చూసినా.. రూ.350 కోట్ల మేర రైతులకు పెట్టుబడి నష్టం వాటిల్లింది. ఏ రైతును పలకరించినా.. రూ.లక్షల్లో నష్టపోయామన్న ఆవేదనే. జులైలో వచ్చిన గోదారమ్మ మొత్తం ఊడ్చేసింది. మళ్లీ పంట వేసినా.. ఆగస్టులో వరదొస్తే తట్టుకునేదెలా? అనే ప్రశ్నలే వినిపిస్తున్నాయి. ఇంకోసారి పెట్టుబడి పెట్టే స్తోమత కూడా లేదని పలువురు రైతులు వాపోతున్నారు.

అరటిపై ఒక్కో రైతు రూ.50వేల పైనే పెట్టుబడి పెట్టారు. బొప్పాయి, కూరగాయ పంటలతోపాటు ఇతర పంటలకూ కనీసం రూ.30వేలపైనే ఖర్చుపెట్టారు. ఆగస్టులో వరద వచ్చేలోగా పంట చేతికొస్తుందనే ధైర్యంలో ఉన్నారు. ఇంతలోనే అనూహ్యంగా వరద చుట్టుముట్టడంతో.. పంటలన్నీ నీటిపాలయ్యాయి. నాలుగైదు రకాల పంటలు వేస్తే.. సగటున పెట్టుబడి రూ.1-4 లక్షల వరకు ఉంది. ఇప్పుడు పైసా కూడా వచ్చే అవకాశం లేదు. ‘ఎకరం పొలాన్ని కౌలుకు తీసుకుని అరటి వేశా. రూ.70వేలకు పైగా పెట్టుబడి పెట్టా. పంట చేతికి వచ్చేలోపే గోదారొచ్చింది. రెండెకరాలు సొంత పొలంలో నువ్వులు వేశాను. అదీ పోయింది’ అని కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలానికి చెందిన గడ్డం అప్పారావు ఆవేదన వెలిబుచ్చారు. ‘అరటి, బొప్పాయి, నువ్వులు వేశా. మూడింటిమీద అప్పుచేసి మరీ రూ.లక్ష పెట్టుబడి పెట్టా. ఏమీ చేతికి రాదు’ అని కోనసీమ జిల్లా ముమ్మిడివరం కమిలికి చెందిన గుర్రాల సుబ్బారావు పేర్కొన్నారు.

..

మళ్లీ పెట్టుబడి పెట్టలేం: వరదనీరు ఇప్పుడిప్పుడే బయటకు పోతోంది. కుళ్లిపోయిన మొక్కలు బయటపడుతున్నాయి. వరద పారిన పొలాల్లోకి చేరిన చెట్టు, చేమ తొలగించి బాగుచేసి.. ఇప్పుడు మళ్లీ పంటలు వేయాలన్నా ఎకరానికి రూ.10వేలకు పైగా ఖర్చవుతుంది. మళ్లీ ఆగస్టులో వరదలు వస్తే ఎలాగనే ఆందోళన రైతుల్ని వెంటాడుతోంది. ‘ఎకరం అరటి వేశా.. సుమారు రూ.70వేలు పెట్టుబడి అయింది. నెలలో గెలలు చేతికొచ్చేవి. గోదారి ముంచెత్తడంతో మొత్తం కుళ్లిపోయింది. నువ్వు ఎకరం వేస్తే అదీ పోయింది. వరదలు తగ్గినా.. మళ్లీ వేయాలంటే రూ.70వేలు పెట్టుబడి అవుతుంది. కూలిపని చేసుకుని కూడబెట్టుకోవాల్సిందే’ అని కొత్తలంక రైతు ఏడుకొండలు పేర్కొన్నారు. ‘అరటికి రూ.60వేలు పెడితే మొత్తం పోయింది. ఆగస్టులో గోదావరి చూసి.. ఇంక అప్పుడు వేద్దామనుకుంటున్నా’ అని పిల్లంక శివారు కొత్తలంక రైతు చెన్నారావు చెప్పారు.

..

కడియం మండలం వేమగిరితోటకు చెందిన బోరయ్యకు.. రోజుకు కనకాంబరంపై రూ.3-4వేలు, పదికిలోల పచ్చిమిర్చికి రూ.1,500, జామకాయల ద్వారా రూ.200 వచ్చేవి. పంటలను వరద ముంచేయడంతో.. ఇప్పుడు కుళ్లిపోయిన మొక్కలు బయటపడుతున్నాయి. ‘కనకాంబరంపై ఎకరాకు రూ.లక్ష పైనే పెట్టుబడి పెట్టాం. మొత్తం పోయింది’ అని ఆయన వాపోయారు. ‘చేను బాగుచేసుకుని నాటితే ఆరు నెలలకు వస్తుంది. నారు కొనడానికే రూ.40వేలు అవుతుంది. అప్పుడు మళ్లీ గోదారమ్మ వస్తే.. మొత్తం నష్టమే’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

..

ముమ్మిడివరం మండలం కమిలికి చెందిన సుబ్బారావు.. రెండెకరాల్లో నువ్వు వేశారు. 20 రోజుల్లో కోతకొచ్చేది. ‘ఈసారి ఎకరాకు 20 బస్తాలు వస్తాయనుకున్నాం. బస్తా ధర రూ.8-9వేలు ఉంది. వరద ముంచేయడంతో మొత్తం నీటిలోకి చేరింది’ అని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. 80 సెంట్లలో పెట్టిన కూరగాయలూ వరదపాలయ్యాయని వాపోయారు.

ఇవీ చదవండి: సవాళ్ల లంకకు సారథిగా రణిల్.. ద్వీపదేశం గట్టెక్కేనా?

రామాయపట్నం పోర్టుతో మెరుగైన ఉద్యోగావకాశాలు: సీఎం జగన్

అభిమానులకు షాక్​ ఇచ్చిన ప్రముఖ సింగర్​.. అవన్నీ 'డిలీట్'​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.