ETV Bharat / state

రామాయపట్నం పోర్టుతో మెరుగైన ఉద్యోగావకాశాలు: సీఎం జగన్

author img

By

Published : Jul 20, 2022, 3:08 PM IST

Updated : Jul 20, 2022, 3:22 PM IST

రామయపట్నం పోర్టుతో మెరుగైన ఉద్యోగావకాశాలు
రామయపట్నం పోర్టుతో మెరుగైన ఉద్యోగావకాశాలు

రామాయపట్నం పోర్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు పెరుగుతాయని సీఎం జగన్‌ అన్నారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం మొండివారిపాలెంలో పోర్టు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన సీఎం..రాష్ట్రంలో ఉన్న ఆరు పోర్టులకు తోడు మరో నాలుగు ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలోనే మిగిలిన వాటికీ భూమి పూజ చేస్తామని చెప్పారు.

రామాయపట్నం పోర్టుతో మెరుగైన ఉద్యోగావకాశాలు

రామాయపట్నం పోర్టు పనులకు ముఖ్యమంత్రి జగన్‌ శంకుస్థాపన చేశారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం మొండివారిపాలెంలో పోర్టుకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. సముద్రంలో డ్రెడ్జింగ్ పనుల ప్రారంభించి, పైలాన్ ఆవిష్కరించారు. ఆ తర్వాత సముద్రుడికి సీఎం పట్టువస్త్రాలు సమర్పించారు. 3 వేల 736.14 కోట్లతో చేపడుతున్న తొలిదశ పనులు.. 36 నెలల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీ మారిటైం బోర్డు కింద రామాయపట్నం పోర్టు డెవలప్​మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టు నిర్మించనుంది. కార్గో, బొగ్గు, కంటైనర్ల కోసం తొలిదశలో నాలుగు బెర్తులు నిర్మిస్తారు.

ఈ పోర్ట్ ద్వారా ఏడాదికి 25 మిలియన్ టన్నుల ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో దశలో 138.54 మిలియన్ టన్నులకు విస్తరణ, మొత్తంగా 15 బెర్తులు నిర్మిస్తారు. రాష్ట్రంలోని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు జిల్లాలతోపాటు... తెలంగాణలోని నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు, హైదరాబాద్ నగరానికి పారిశ్రామిక, వాణిజ్య, రవాణా సేవల్లో రామాయపట్నం పోర్టు కీలకం కానుంది. పోర్టు నిర్మాణం పూర్తయితే తెలంగాణ, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలు ప్రాంతాలకు వాణిజ్య, వ్యాపార, రవాణా సేవలు అందనున్నాయి. రామాయపట్నంతోపాటు మచిలీపట్నం, భావనపాడు పోర్టులు పూర్తిచేయడమే లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.

"పోర్టు వల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ఈ ప్రాంతం రూపురేఖలు కూడా మారుతాయి. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం తెచ్చాం. పోర్టు వల్ల ఆర్థిక కార్యకలాపాలు మరింతగా పెరుగుతాయి.రామాయపట్నం పోర్టుతో ఎంతో ప్రయోజనం ఉంటుంది. 6 పోర్టులకు తోడు మరో 4 పోర్టులు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో 9 ఫిషింగ్‌ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయి. త్వరలోనే మిగిలిన పోర్టులకు భూమిపూజ చేసుకుంటాం. ప్రతి 50 కి.మీ. దూరంలో హార్బర్‌ లేదా పోర్టు వచ్చే పరిస్థితి. లక్షమంది మత్స్యకార కుటుంబాలకు ఉద్యోగావకాశాలు వస్తాయి. ఒక్కో పోర్టులో సుమారు 4 వేలమందికి ఉద్యోగావకాశాలు వస్తాయి. పరోక్షంగా లక్షల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయి. పోర్టుకు సహకరించిన గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలుపుతున్నా." - జగన్, ముఖ్యమంత్రి

ఇవీ చూడండి

Last Updated :Jul 20, 2022, 3:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.