ETV Bharat / state

Why AP does not Needs Jagan: ఇన్ని ఘోరాలు చేసి.. మళ్లీ ఓటు ఎలా అడుగుతావు జగనన్నా..?

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 9, 2023, 7:17 AM IST

Updated : Oct 9, 2023, 12:29 PM IST

Why AP does not Needs Jagan: రాష్ట్రంలో అధికార వైసీపీ చేపట్టిన కొత్త కార్యక్రమం.. ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’? ‘ఎందుకు ఆంధ్రప్రదేశ్‌కు జగనే కావాలి’ అంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించింది. అయితే నాలుగున్నరేళ్లుగా రాష్ట్రానికి.. ముఖ్యమంత్రి జగన్, ఆయన పార్టీ పరివారం చేస్తున్న అక్రమాలు, అరాచకాలు, అన్యాయాలు, వాగ్దానభంగాలు, వంచనలు సామాన్యుల్లో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రానికి మీరు కావాలా? మీకు రాష్ట్రం కావాలా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అంతేకాదు హామీలు విస్మరించి వంచించినందుకా? వనరుల దోపిడీకి మరో ఛాన్స్‌ ఇవ్వాలా? అని ప్రజలు నిలదీస్తున్నారు. వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమంపై సామాన్యుడి ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి జగన్‌ కానీ, వైసీపీ నేతలు కానీ సమాధానం చెప్పగలరా..?

Why AP does not Needs Jagan
Why AP does not Needs Jagan

Why AP does not Needs Jagan: ఇన్ని ఘోరాలు చేసి.. మళ్లీ ఓటు ఎలా అడుగుతావు జగనన్నా..?

Why AP does not Needs Jagan: ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖలో రైల్వేజోన్, కడపలో స్టీల్‌ప్లాంట్‌ వంటి రాష్ట్ర విభజన హామీల సాధనలో విఫలమైనందున రాష్ట్రానికి మీరే కావాలా జగన్‌? లేదంటే అధికారంలోకి వచ్చిన వారానికే సీపీఎస్‌ రద్దు చేస్తామంటూ ఉద్యోగులను నమ్మించి నాలుగేళ్ల తర్వాత జీపీఎస్‌ అంటూ మాటమార్చినందుకా? మధ్యంతర భృతి కన్నా ఫిట్‌మెంట్‌ను తగ్గించి అత్తెసరు పీఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులకు కానుకగా ఇచ్చినందుకా? లేక 2.60 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని నిరుద్యోగ యువతను నమ్మించి నట్టేట ముంచినందుకా? సీబీఎస్‌ఈ, ఇంటర్నేషనల్‌ సిలబస్, టోఫెల్‌ అంటూ అశాస్త్రీయ విధానాలతో పాఠశాల విద్యను గందరగోళంలోకి నెట్టినందుకా? దళిత, గిరిజనులపై దాడులు, అకృత్యాలు పెరిగినందుకా? అసలెందుకు మళ్లీ మీకు అధికారం ఇవ్వాలి జగన్‌.

2021 జూన్‌కే పోలవరం (Polavaram Project) నుంచి నీళ్లిస్తామని ఓసారి, 2022 ఖరీఫ్‌ కల్లా అని రెండోసారి చెప్పిన జగన్‌.. తాజాగా ఆ గడువును 2025 జులైకి మార్చినందుకా? మళ్లీ మీకు అధికారం ఇవ్వాలా..? లేదంటే డయాఫ్రం వాల్, గైడ్‌బండ్ (Polavaram Guide Bund), ఎగువ కాఫర్‌ డ్యాంలలో నీటి లీకేజీ వంటి అనేక సమస్యలకు ప్రాజెక్టును ఆలవాలంగా చేసినందుకా? పోలవరానికి సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదం సాధించనందుకా? అసలు మీకు మళ్లీ ఎందుకు అధికారం ఇవ్వాలి..? అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే ఐదు ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టులను ఏడాదిలోగా పూర్తి చేస్తామన్నారు. ఆ సంఖ్యను 28కి పెంచారు. వాటిలో ఒక్కటీ పూర్తి చేయనందుకా జగన్‌? మీకు మళ్లీ ఎందుకు అధికారం ఇవ్వాలి (Why AP Needs YS Jagan)..?

Polavaram Project ఏపీ జీవనాడిపై అడుగడుగునా నిర్లక్ష్యం..! పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం.. కేంద్రం విసుర్లు!

ఏపీని అప్పుల (AP Debts) కుప్పగా మార్చి, ప్రజలపై 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా రుణభారాన్ని మోపినందుకా? మళ్లీ మీకు అధికారం ఇవ్వాలా..? వేల కోట్ల రూపాయల బిల్లులు బకాయిలు పెట్టి.. ఏపీ అంటేనే కాంట్రాక్టర్లు ముఖం చాటేసేలా చేసినందుకా? అప్పు తెస్తేకానీ ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు ఇవ్వలేని స్థితికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దిగజార్చినందుకు మళ్లీ మీకు అధికారం అప్పగించలా..? ఒకటో తారీఖున జీతమొస్తే చాలానుకునే స్థితిలోకి ఉద్యోగులను మీరు నెట్టేయలేదా? డీఏ 2వేల కోట్లు, ఆర్జిత సెలవులవి 12 వందల కోట్ల రూపాయల బకాయిల చెల్లింపును వాయిదాలు వేస్తున్నది మీరే కదా జగన్‌.. పీఆర్సీ, డీఏ బకాయిలను నాలుగేళ్లలో 16 విడతల్లో చెల్లిస్తామంటూ భారాన్ని వచ్చే ప్రభుత్వాలపై మోపుతున్నందుకా? మళ్లీ మీరే రావాలా..? ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పి, కొద్దిమందికే వర్తింపజేస్తున్నందుకా? చిరుద్యోగుల జీతాలు నామమాత్రంగా పెంచి, వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలను దూరం చేసింది మీరే కదా జగన్‌..?

టీడీపీ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటినీ సమీక్షిస్తామంటూ పెట్టుబడిదారులను బెదిరించి బయటకు పంపారు కదా! 70 వేల కోట్ల రూపాయలతో విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్న అదానీ సంస్థ, 21 వేల కోట్ల రూపాయలకే ఎందుకు పరిమితమైంది? అమరరాజా బ్యాటరీస్‌పై ఎంతగా రాజకీయ కక్ష సాధించారు? ఆ సంస్థ ఏపీలో ప్రాజెక్టు విస్తరణను కాదని, తెలంగాణలో 9 వేల500 కోట్లు పెట్టుబడులు పెడుతోంది కదా? కియా అనుబంధ యూనిట్లు రాకుండా చేసింది మీరే కదా ? లులూ సంస్థను విశాఖ నుంచి కోయంబత్తూరు, హైదరాబాద్‌కు తరిమేయలేదా? విశాఖలో పెట్టుబడుల సదస్సులో 13.12లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పిన మీరు.. వాటిలో కొన్నైనా రాబట్టారా?

YSRCP Government Continuously Runs with Debts: అప్పులు లేనిదే సాగని పాలన.. వైసీపీ ప్రభుత్వ అసమర్థ విధానాలతో రాష్ట్రంపై రుణాల మోత

ఏటా 12 వేల 500 చొప్పున నాలుగేళ్లలో 50 వేల రూపాయల రైతు భరోసా కింద ఇస్తామని చెప్పిన జగన్‌.. ఏటా 7 వేల 500 చొప్పునే ఇస్తున్నందుకా? మిమ్మల్ని మళ్లీ గెలిపించాలా..? రైతులకు వ్యక్తిగత యంత్ర పరికరాల పంపిణీ కింద టీడీపీ హయాంలో 700 కోట్ల రాయితీలివ్వగా, ఇప్పుడా పంపిణీకి మంగళం పాడినందుకా? మళ్లీ ఎన్నుకోవాలా..? టార్పాలిన్లు, స్ప్రేయర్లూ ఇవ్వలేని ప్రభుత్వాన్ని రైతన్న ఎలా నమ్మాలి? ఉచిత సూక్ష్మపోషకాల పంపిణీకి పాతరేసి, సూక్ష్మసేద్యానికి మూడేళ్లూ ముసుగేసి, నాలుగో ఏడాదిలోనూ మొక్కుబడిగా అమలు చేస్తున్నందుకా?.లేక కౌలు రైతులను కులాల వారీగా విభజించి కొన్ని వర్గాలకే రైతు భరోసా ఇస్తున్నందుకా జగన్‌? మిమ్మల్ని మళ్లీ రైతుల గెలిపించుకోవాలా..?

చంద్రబాబుపై కోపంతో అమరావతి సర్వనాశనానికి కంకణం కట్టుకొని, మూడు రాజధానులంటూ నేడు రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితి కల్పించినందుకా జగన్‌? మళ్లీ మీరు రాష్ట్రానికి కావాలా..? రాజధాని అమరావతికి భూములిచ్చిన 29 వేల మంది రైతుల ఉసురు పోసుకుంటున్నందుకా? వారికి కౌలు కూడా చెల్లించకుండా, స్థలాలు అభివృద్ధి చేసి ఇవ్వకుండా కన్నీళ్లు పెట్టిస్తున్నందుకా? గత ప్రభుత్వం రూ.10 వేల కోట్లు వెచ్చించి నిర్మించిన భవనాలు, రహదారులను గ్రాఫిక్స్‌గా ముద్రవేసి పాడు పెట్టినందుకా? కనీసం కరకట్ట రోడ్డునూ విస్తరించలేని అసమర్థతకా?

Rythu Bharosa Centers are not Useful to Farmers: రైతుకి భరోసా ఇవ్వని కేంద్రాలు.. వేల కోట్లు వెచ్చించినా సేవలు మాత్రం డొల్లే

దశల వారీగా మద్యనిషేదం అమలు చేస్తామని చెప్పి, తీరా ప్రభుత్వమే మద్యం విక్రయిస్తూ, ఆ వ్యాపారాన్ని అస్మదీయుల చేతుల్లో పెట్టినందుకు మళ్లీ మిమ్మల్ని ఎన్నుకోవాలి జగన్‌? లిస్టైన 100 కంపెనీలను కాదని, మీ ప్రభుత్వం సన్నిహితుల చేతుల్లోని 16 కంపెనీల నుంచే ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌తో మద్యాన్ని కొనిపిస్తున్నందుకా? రాష్ట్రంలో లాభసాటి గనులు అన్నింటినీ అధికారికంగా, అనధికారికంగా ప్రభుత్వ పెద్దల చేతుల్లోనే పెట్టినందుకా?. ఎందుకు మిమ్మల్ని ఎన్నుకోవాలి జగన్‌.

నాలుగేళ్లలో ఎస్సీల కోసం ఒక్క కొత్త పథకాన్నయినా ప్రకటించారా? అభ్యర్థులు కోరుకున్నచోట సివిల్స్‌కు ట్రైనింగ్ ఇప్పించే ఎన్టీఆర్‌ విద్యోన్నతి పథకాన్ని ఎందుకు ఎత్తివేశారు? ఆర్థిక సాయం పెంచినట్లు చెప్తూనే, నిబంధనల పేరుతో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు విదేశీ విద్యాదీవెనను దూరం చేయలేదా? ఎస్సీలకు భూమి కొనుగోలు పథకమేది? అధికారిక లెక్కల ప్రకారం 2021 ఏడాదిలో నెలకు ముగ్గురు ఎస్సీ, ఎస్టీల హత్య, వారానికి నలుగురు దళిత, గిరిజన మహిళలపై అత్యాచారాలు జరిగాయి. ఆ సంవత్సరం సగటున రోజుకు 7 దాడులు, అఘాయిత్యాలు రికార్డయ్యాయి కదా? ఎస్సీ విద్యార్థులకు కార్పొరేట్‌ విద్యనందించే బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్ల విధానాన్ని ఎత్తేయలేదా ముఖ్యమంత్రి గారూ?.

New Liquor Policy in AP: మద్య నిషేధమని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్​.. ఆ హామీని మరిచి..!

మిమ్మిల్ని ఎందుకు ఎన్నుకోకూడదంటే.. పంచాయతీలకు సమాంతరంగా గ్రామ సచివాలయ వ్యవస్థను తెచ్చి సర్పంచుల అధికారాలకు కోతలు పెట్టినందుకు? పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం పంపించిన 15 వందల కోట్లను విద్యుత్‌ బిల్లుల బకాయిలకు మళ్లించినందుకు? అధికారంలోకొచ్చిన ఆర్నెళ్లకే ఒకసారి, 2022లో రెండుసార్లు ఆర్టీసీ ఛార్జీలను పెంచి జనంపై ఏటా సగటున రూ.2 వేల కోట్ల భారాన్ని మోపుతున్నందుకు.. మండలానికో వృద్ధాశ్రమం నిర్మిస్తామంటూ పాదయాత్ర ప్రారంభించిన రెండో రోజే ప్రకటించిన జగన్‌.. నాలుగేళ్లలో ఒక్కటైనా కట్టించారా? బీమా మిత్రలను కొనసాగిస్తానని, వారికిచ్చే లబ్ధిని పెంచుతానని మాటిచ్చి, మడమ తిప్పారుకదా? అస్థిర విధానాలతో ప్రాథమిక విద్యను గందరగోళం పడేయలేదా?

ఎయిడెడ్‌ విద్యాసంస్థల ఉసురు తీయలేదా? గత రెండేళ్లలో 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడులను వీడింది నిజం కాదా? అంగన్‌వాడీ కార్యకర్తలకు తెలంగాణలో కంటే వెయ్యి రూపాయలు ఎక్కువే జీతం ఇస్తామని చెప్పి నేడు 2 వేలు తక్కువ ఇస్తున్నందుకు జగన్‌ మళ్లీ కావాలా? పదవీ విరమణ వేళ అక్కడ కార్యకర్తకు లక్ష రూపాయలు, ఆయాలకు 50 వేల రూపాయలు ఇస్తుంటే, ఏపీలో ఉత్తిచేతులతో పంపించడం లేదా? రాజకీయ కక్ష సాధింపుల్లో మీ ప్రభుత్వం ముందు ఏ రాష్ట్రంలోనూ, ఏ పార్టీ అయినా దిగదుడుపే!

CAG Said Ward Secretariat System Unconstitutional in Andhra Pradesh: ఏపీలో వార్డు సచివాలయ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమన్న కాగ్‌

ప్రతి విషయంలోనూ ప్రత్యర్థులపై కేసులు పెట్టి వేధిస్తూ, రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారే! మీ అస్మదీయులు ఇసుక, మట్టి, గనులు ఇలా వనరులన్నీ కొల్లగొడుతుంటే కిమ్మనరెందుకు? దేశంలో ఏ ముఖ్యమంత్రీ పెట్టుకోని మాదిరిగా ప్రతి పథకానికీ తన పేరు, తండ్రి పేరు పెట్టకుని బ్రాండ్‌ ప్రమోషన్‌ చేసుకుంటున్నందుకా?ఇన్ని మోసాలు చేశాక కూడా ‘జగనే ఎందుకు కావాలో’ ప్రజలకు వివరించే నైతికత ఎక్కడిదన్న ప్రశ్నలు సామాన్యుల నుంచి వినిపిస్తున్నాయి.

Unilateral Attitude of Police in the State: పోలీసుల ఏకపక్ష వైఖరి.. ప్రతిపక్షాలపైనే కేసులు.. వైసీపీ వారిపై ఒక్క కేసూ పెట్టరా..!

Last Updated : Oct 9, 2023, 12:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.