ETV Bharat / state

Rythu Bharosa Centers are not Useful to Farmers: రైతుకి భరోసా ఇవ్వని కేంద్రాలు.. వేల కోట్లు వెచ్చించినా సేవలు మాత్రం డొల్లే

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 8, 2023, 7:57 AM IST

Rythu Bharosa Centers are not Useful to Farmers: రైతులకు దిక్సూచిగా నిలుస్తాయని భావించిన రైతు భరోసా కేంద్రాలు ఊళ్లలో ఉత్సవ విగ్రహాలుగా దర్శనమిస్తున్నాయి. రైతులకు కావాల్సిన సకలం ఇక్కడే దొరుకుతాయని ప్రభుత్వం ఊదరగొడుతున్నా ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల జాడే ఉండటం లేదని రైతులు వాపోతున్నారు. ఒక్కో కేంద్రంలో నెలకు అరలీటరు పురుగుమందూ అమ్మలేదు. ఎరువులు, విత్తనాల అమ్మకాలూ నామమాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి నామమాత్రపు కేంద్రాల కోసం మాత్రం ప్రభుత్వం 3వేల కోట్లు వెచ్చిస్తోంది.

Rythu Bharosa Centers are not Useful to Farmers
Rythu Bharosa Centers are not Useful to Farmers

Rythu Bharosa Centers are not Useful to Farmers: రైతుకి భరోసా ఇవ్వని కేంద్రాలు.. వేలకోట్లు వెచ్చించినా సేవలు మాత్రం డొల్లే..!

Rythu Bharosa Centers are not Useful to Farmers: రాష్ట్రంలో రైతులకు రైతు భరోసా కేంద్రాలే కళ్లు, చెవులుగా పనిచేయనున్నాయంటూ ముఖ్యమంత్రి చెబుతున్న గొప్పలు చూశారుగా.. రైతు భరోసా కేంద్రాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయని.. గతంలో మన రాష్ట్ర అధికారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడి పథకాలను పరిశీలించేవారని.. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు మన వైపు చూస్తున్నాయని ప్రభుత్వం ఊదరగొడుతోంది. వ్యవసాయరంగం ఊసెత్తితే చాలు రైతు భరోసా కేంద్రాలతో ఉద్ధరిస్తున్నామంటూ సీఎం గొప్పలు చెబుతారు. కానీ గ్రామాల్లోకి వెళ్లి రైతులను కదలిస్తే తెలుస్తుంది. వాటి పనితనం ఏపాటిదో విత్తనాలు, పురుగుల మందులు అందించడం దేవుడెరుగు.. తాము కష్టపడి పండించిన పంటలను సైతం కొనుగోళ్లు చేయడం లేదని రైతులు మండిపడుతున్నారు.

Farmers problems: రైతుకి 'భరోసా' ఇవ్వని కేంద్రాలు.. దీంతో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు

రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుచేసి 40 నెలలవుతోంది. ఇప్పటివరకు వీటిద్వారా అమ్మిన మొత్తం పురుగు మందులు ఎంతో తెలుసా? ఒక్కో కేంద్రానికి సగటున 12.60 లీటర్లే. అంటే నెలకు అర లీటరు మందు కూడా విక్రయించలేదు. పత్తి, మిరప, మొక్కజొన్న విత్తనాల విక్రయం చూసినా అంతే. నెలకు కిలో చొప్పున లేవు. ఎరువుల అమ్మకాలూ నామమాత్రమే. ఒక్కో కేంద్రంలో సగటున 750 బస్తాల ఎరువులనూ విక్రయించలేకపోయారు. ఇందుకేనా జాతీయస్థాయిలో అవార్డులు వచ్చింది..? పట్టుమని పదిమంది రైతులకూ విత్తనాలివ్వలేకపోవడాన్ని గుర్తించేనా ప్రభుత్వానికి సత్కారాలు చేసింది అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు.

వాస్తవాలను కప్పిపుచ్చి.. ప్రభుత్వం ఊకదంపుడు ప్రచారం చేస్తోంది. కనీసం ఈ కేంద్రాల్లో టీవీలు పని చేయడం లేదని, ఇంటర్‌నెట్‌ రావడం లేదని, కియోస్క్‌లు మొరాయించాయన్న సంగతైనా ముఖ్యమంత్రికి తెలుసా అంటూ నిలదీస్తున్నారు. మొక్కుబడి సేవలందించే ఈ ఆర్‌బీకేల భవన నిర్మాణాల కోసం మాత్రం ప్రభుత్వం 2 వేల446 కోట్లు వెచ్చిస్తోంది. మౌలిక సదుపాయాలతో కలుపుకుంటే మొత్తం ఖర్చు 3 వేల కోట్లకు చేరనుంది. ప్రచార ఆర్భాటానికి భారీగా ప్రజాధనాన్ని వెచ్చిస్తున్న ప్రభుత్వం.. వాటిల్లో అందుతున్న సేవలు మాత్రం పట్టించుకోవడం లేదు. ఆర్బీకేల పనితీరు బాగా లేదని, సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని జాతీయ అధ్యయన సంస్థలు తలంటుతున్నా కళ్లు తెరవడం లేదు.

Rythu Bharosa Centers : రైతు భరోసా కేంద్రాలను విస్మరించిన ప్రభుత్వం.. పునాదికే పరిమితమైన నిర్మాణాలు

రైతులు పండించిన పంటలన్నీ భరోసా కేంద్రాల్లోనే కొనుగోలు చేస్తామని రైతులకు పంట రుణాలు కూడా ఇక్కడే ఇప్పిస్తామని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. అయితే రైతులకు అవసరమైన ఉత్పత్తులేవీ అక్కడ అందుబాటులో ఉండటం లేదు. 2020 మే నుంచి ఈ ఏడాది సెప్టెంబరు వరకు రాష్ట్రంలోని అన్ని ఆర్బీకేలలో 14.01 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగు మందులే విక్రయించారు. ఆర్బీకేల ద్వారా ఎరువులు విక్రయించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. సహకార సంఘాలకు కేటాయింపులు తగ్గించేసి వీటికి పెంచింది. వ్యాపారులకు ఇచ్చే ఎరువుల పరిమాణంలోనూ కోత పెట్టింది. అయినా ఆశించిన అమ్మకాలు లేవు.

కేంద్రాల్లో ఏడాదికి సగటున 4 లక్షల టన్నులలోపే ఎరువులు విక్రయించారు. ఒక్కో ఆర్‌బీకేలోనూ సగటున 750 బస్తాల ఎరువులనూ విక్రయించలేకపోయారు. సగటున ఎకరాకు 5 బస్తాల వినియోగం ప్రకారం చూసినా 2 వేల ఎకరాల విస్తీర్ణం ఉండే ఒక్కో ఆర్‌బీకే పరిధిలో కనీసం 10వేల బస్తాలు విక్రయించాలి. కానీలో 7శాతం విక్రయాలు కూడా జరగలేదు. 2020-21లో లక్షా 6వేల 962 టన్నులు, 2021-22లో 3 లక్షల68 వేల204 టన్నులు, 2022-23లో 3 లక్షల 93,914 టన్నుల ఎరువులు విక్రయించారు.

rythu bharosa kendram: చెప్పేవన్నీ గొప్పులు.. ఆర్బీకేల్లో రైతులకు అందని సేవలు

రైతులు ఎక్కువగా మోసపోయేది విత్తనాల ఎంపికలోనే.. అందుకే అన్ని రకాల పరీక్షలు నిర్వహించి నాణ్యమైన విత్తనాలను రైతు భరోసా కేంద్రాల్లోనే అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే రైతులకు అవసరమైన రకాలే ఇక్కడ దొరకవు.. దొరికినా బహిరంగ మార్కెట్‌కంటే ఎక్కువ ధరలే ఉంటున్నాయని రైతులు వాపోతున్నారు. 40 నెలల్లో 12.75 కోట్ల విలువైన 1,661 క్వింటాళ్ల విత్తనాలనే ఇక్కకడ విక్రయించారు. అంటే ఒక్కో ఆర్‌బీకేలో సగటున 16 కిలోల విత్తనాలనూ కూడా విక్రయించలేకపోయారు. ఒకవేళ డిమాండ్‌ ఎక్కువగా ఉన్న ఉత్పత్తులను మాత్రం ముందుగా వైసీపీ నేతలకే అందజేస్తున్నారు. యూరియా, డీఏపీ తదితర ఎరువులను ఇవ్వడంలోనూ అధికార పార్టీ వారికే ప్రాధాన్యమిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.