ETV Bharat / state

Farmers problems: రైతుకి 'భరోసా' ఇవ్వని కేంద్రాలు.. దీంతో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు

author img

By

Published : Jul 6, 2023, 7:29 AM IST

Rythu Bharosa Centres
రైతుకి 'భరోసా' ఇవ్వని కేంద్రాలు

Rythu Bharosa Centres: ప్రభుత్వం గొప్పగా చెబుతున్న రైతు భరోసా కేంద్రాలు.. రైతులకు ఏమాత్రం భరోసా ఇవ్వడం లేదు. ఒకపక్క ఖరీఫ్ సాగు కోసం రైతులు సిద్ధమవుతుంటే.. రైతు భరోసా కేంద్రాల్లో మాత్రం విత్తనాలు అందుబాటులో ఉండటం లేదు. దీంతో అన్నదాతలు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. విత్తనాలే అందించలేనప్పుడు రైతు భరోసా కేంద్రాల వల్ల ఉపయోగం ఏముందని.. ఉమ్మడి కృష్ణా జిల్లా రైతులు ప్రశ్నిస్తున్నారు.

Rythu Bharosa Centres: ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుభరోసా కేంద్రాలు.. "పేరు గొప్ప - ఊరు దిబ్బ" అన్న చందంగా తయారయ్యాయి. విత్తనం నాటే దగ్గర నుంచి.. పంట కొనుగోలు వరకు కావాల్సినవన్నీ రైతుభరోసా కేంద్రాల ద్వారా అందిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. అక్కడ కనీసం విత్తనాలు కూడా అందుబాటులో ఉండటం లేదు. దీంతో విత్తనాల కోసం రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి.. నాణ్యత లేని వాటితో నష్టపోతున్నారు. బయట మార్కెట్‌లో 25 కేజీల విత్తనాల ప్యాకెట్‌కే వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నామని.. ప్రభుత్వం రాయితీపై అందిస్తే కొంత ఆర్థిక భారం తగ్గుతుందని రైతులు అంటున్నారు.

పూర్తి స్థాయిలో అందని విత్తనాలు.. ఖరీఫ్‌ సీజన్ ప్రారంభం కావడంతో అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. రైతులకు ఇబ్బందులు లేకుండా విత్తనం వేసే దగ్గర నుంచి పంట కోనుగోలు చేసే వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా అధికారులు పర్యవేక్షణ చేస్తారని ప్రభుత్వం చెబుతోంది. వరిని సాగు చేయాలంటే రాయితీపై రైతులకు విత్తనాలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందించడం లేదు. దీంతో రైతులు విత్తనాల కోసం ప్రైవేట్ వ్యాపారులు ఆశ్రయిస్తున్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు ప్రభుత్వం సమృద్ధిగా సరఫరా చేయకపోవడంతో అక్రమార్కులకు వరంగా మారింది. కృష్ణాడెల్టా పరిధిలో వరి, చెరకు, పసుపు ఇతర ఉద్యాన పంటలను రైతులు సాగు చేస్తుంటారు. పేరుకే రైతు భరోసా కేంద్రాలు కానీ అవి తమకు ఏ విధంగాను ఉపయోగపడటం లేదని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

మార్కెట్​ ధర ప్రకారమే యూరియా.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో మొదటి పంటగా రైతులు వరిని సాగు చేస్తారు. దాదాపు 7 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. లక్షమంది రైతులు వరిని సాగుచేస్తున్నారు. పంట వేసేందుకు ప్రభుత్వం తాము కోరిన విత్తనాలు ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం యూరియాను మాత్రం ఇస్తుందని తెలిపారు. అది కూడా బయట మార్కెట్​లో 263 రూపాయలు ఉంటే ఆదే ధరను రైతు భరోసా కేంద్రం అధికారులు తమ వద్ద నుంచి వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు. బయట మార్కెట్​లో ఎంత ధర ఉంటే ప్రభుత్వం కూడా ఆదే ధరకు యూరియాను తమకు విక్రయిస్తే ఇంకా ప్రభుత్వం ఇచ్చేది ఏముందని ప్రశ్నిస్తున్నారు.

రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులకు ఏం ప్రయోజనం.. ధాన్యం విక్రయాల్లో ఇబ్బందులు పడిన రైతులు ఈ సారి కూడా అదే పరిస్థితి ఉంటుందేమోనన్న భయంతో.. సన్న రకాలు సాగు చేసేందుకు ఎక్కువ మంది రైతులు సిద్ధమయ్యారు. మరోక వైపు సబ్సిడీ విత్తనాలు కౌలు రైతులకు ఎండమావిగా మారింది. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు లేకపోవడంతో వారికి ప్రభుత్వం ఇస్తున్న ఆరకొర రాయితీ కూడా అందడం లేదు. రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలను ప్రభుత్వం ముందస్తుగా సిద్ధం చేసినట్లయితే విత్తనాల వ్యాపారుల అక్రమాలకు ఆస్కారం ఉండదని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు.. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మేలు చేస్తునట్లు ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారాన్ని పక్కన పెట్టి రైతులకు విత్తనాలు, ఎరువులు రాయితీపై అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.