ETV Bharat / state

AP Debts Crossing Limits అప్పు ఆదాయంగా మారడంలేదు.. అప్పుగానే మిగిలిపోతోంది! ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం.. అయినా తగ్గేదేలే అంటున్న సర్కార్!

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2023, 8:38 AM IST

AP Debts Crossing Limits అప్పు తీసుకున్నవారు అప్పు భారం నుంచి బయటపడితే.. అది ఆదాయంగా మారుతుంది. బ్యాంకింగ్ రంగంలో అప్పు-ఆదాయం అంశంలో ఓ నిర్వచనం ఇది. కాని ఏపీ రాష్ట్రంలో మాత్రం.. అప్పు ఆదాయంగా మారుతున్న సంగతి ఎక్కడా కనిపించడంలేదు. ఇది మొత్తానికి ఆర్ధిక విపత్తుగా మారుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. అందినకాడికి అప్పులు చేసేందుకు కేంద్రం పరిమితులు.. కాగ్‌ హెచ్చరికలను సైతం పెడచెవిన పెడుతున్న వైసీపీ సర్కార్ రాష్ట్రాన్ని ఏ తీరానికి చేరుస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

AP Debts Crossing Limits
ap_debts_crossing_limits

AP Debts Crossing Limits: "రాష్ట్రానికి రుణాలను భరించే సామర్థ్యం లేదు. రుణం తీసుకుని పాత అప్పులు తీరుస్తున్నారు. తీసుకున్న అప్పుతో ఆస్తులు సృష్టించడం లేదు. ఎలాంటి ఆదాయమూ రానివాటిపై ఖర్చు పెడుతున్నారు. సాధారణంగా రుణ మొత్తాన్ని అభివృద్ధి కార్యక్రమాలకు, ఆస్తుల సృష్టికి వినియోగించాలి. అయితే వడ్డీలను చెల్లించేందుకు, ప్రస్తుతం రోజువారీ ఖర్చులకు అప్పులు తీసుకోవడం ఆర్థిక అస్థిరతకు దారి తీస్తుంది". రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 2022వ సంవత్సరంలో కాగ్‌ తన నివేదికలో వ్యక్తం చేసిన ఆందోళన ఇది.

అదే విధంగా అస్తవ్యస్త ఆర్థిక విధానాలతో పాతాళానికి పడిపోయిన శ్రీలంక పరిస్థితిని చూసి అప్రమత్తం కావాలి. ఏపీ రుణాలు జీఎస్‌డీపీలో అత్యధికంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, బిహార్, రాజస్థాన్, పంజాబ్‌ రాష్ట్రాలు రుణ, ఆర్థిక కొలమానాలు దాటాయి అంటూ కేంద్ర ప్రభుత్వం 2022 జులైలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో హెచ్చరించింది. కేంద్ర మంత్రి జై శంకర్‌ ఈ సమావేశం నిర్వహించి.. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ప్రజంటేషన్‌ ఇచ్చారు. కానీ జగన్‌ ప్రభుత్వం ఆర్థిక హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు.

AP Government Trying to Get more Debts రూ. 5వేల కోట్ల అప్పు ఇప్పించండి సార్! తాజా రుణం కోసం జగన్ సర్కార్..

2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి జులై నాటికి ఎంత రాబడి వచ్చింది? కేంద్రం ఎంత గ్రాంటు ఇచ్చింది ? తెచ్చుకుని ఖర్చు చేసిన అప్పులు ఎన్ని? రెవెన్యూ రాబడి, ఖర్చు ఎంత అన్న గణాంకాలు వెల్లడయ్యాయి. వీటిని పరిశీలిస్తే రాష్ట్రం ఎంత ప్రమాదకర ధోరణిలో పయనిస్తోందో అవగతమవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో రాష్ట్ర పన్నుల రాబడి 38 వేల 879.17 కోట్లు. అదే సమయంలో అప్పులు అంతకుమించి ఎంతో ఎక్కువుగా ఉన్నాయి.

తొలి నాలుగు నెలల్లో ఏ రూపంలో అయితేనేం 45 వేల 818.74 కోట్ల అప్పు తీసుకుని ప్రభుత్వం ఖర్చు పెట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వమే కాగ్‌కు ఈ లెక్కలు సమర్పించింది. ఈ అప్పుల్లో కార్పొరేషన్ల నుంచి తీసుకొని ఖర్చు చేసినవి లేవు. ఈ సంవత్సరానికి ఎంత మొత్తానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి కార్పొరేషన్ల ద్వారా రుణాలు తీసుకున్నదో తెలపాలని కాగ్‌ కోరుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. దీంతో పన్నుల రాబడికి మించి ఎన్నోరెట్లు రుణాలు తీసుకొచ్చే పద్ధతి సాగిపోతోంటే.. భవిష్యత్తు ఏమిటి అనే ఆందోళనకు సమాధానం లేకుండా పోతోంది.

Andhra Pradesh Debt Details: రాష్ట్ర అప్పులను మరోసారి బయటపెట్టిన కేంద్రం

రాష్ట్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కన్నా చేసిన అప్పు 117 శాతం ఎక్కువగా ఉంది. అంటే తొలి నాలుగు నెలల్లో రాష్ట్రానికి వంద రూపాయల ఆదాయం వచ్చిందనుకుంటే మరో 117 రూపాయల అప్పు చేసి గడిపినట్లుగా భావించాలి. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో తెలియజేస్తోంది. అలాగే నాలుగు నెలల్లో వంద ఖర్చు చేస్తే అందులో 44 రూపాయల అప్పు రూపంలో తీసుకున్నదే. సొంత పన్నుల రాబడి 37 రూపాయలు. కేంద్రం ఇచ్చినది 17 రూపాయలు. మరో 2 రూపాయలు పన్నేతర రాబడి. కాగ్‌కు చెప్పకుండా, రాష్ట్ర ప్రభుత్వం బయటకు చెప్పకుండా కార్పొరేషన్ల ద్వారా తీసుకుంటున్న అప్పులను కూడా కలిపితే పరిస్థితి మరీ దారుణంగా ఉందన్న విషయం స్పష్టమవుతోంది.

రెవెన్యూ ఖర్చు తగ్గించుకొని రెవెన్యూ లోటు పరిమితం చేసుకోవాలనేది ఆర్థిక నిపుణుల సూత్రం. రాష్ట్రంలో ఈ సూత్రం వంట పట్టించుకుంటున్న దాఖలాలే లేవు. మొత్తం రెవెన్యూ రాబడి 58 వేల 453.97 కోట్లు అయితే రెవెన్యూ ఖర్చు 89 వేల 158.75 కోట్లు. అంటే లోటు 30 వేల 704.78 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరం రెవెన్యూ లోటును 22 వేల 316.70 కోట్లకు పరిమితం చేస్తామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్‌ సమావేశాల్లో హామీ ఇచ్చారు. ఆ మాట ఎలా ఉన్నా తొలి 4 నెలల్లోనే రెవెన్యూ లోటు అంతకుమించి పోయింది.

AP Debts: అందినకాడికి అప్పులు.. 9 నెలల అప్పులు 4 నెలల్లోనే..

అంచనాల కన్నా 137 శాతం అధికంగా రెవెన్యూ లోటు ఉంది. వివిధ రూపాల్లో తెచ్చిన అప్పుల నుంచి రెవెన్యూ ఖర్చుల కోసం వెచ్చించిన మొత్తాన్ని లెక్క కడితే రాష్ట్రంలో రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు తీవ్రతే మరింత ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మరో వెయ్యి కోట్ల రూపాయల రుణం సమీకరిస్తోంది. రిజర్వుబ్యాంకు మంగళవారం నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని 11 సంవత్సరాలలో తిరిగి చెల్లించేలా అప్పు తీసుకోబోతోంది. ఇందుకు రిజర్వు బ్యాంకుకు వర్తమానం పంపింది.

'ఆర్థిక' సుడిగుండంలో ఆంధ్రప్రదేశ్​.. అప్పులు, కేంద్ర నిధులపైనే ఆధారం..

AP Debts Crossing Limits అప్పు ఆదాయంగా మారడంలేదు.. అప్పుగానే మిగిలిపోతోంది!
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.