ETV Bharat / state

AP Debts: అందినకాడికి అప్పులు.. 9 నెలల అప్పులు 4 నెలల్లోనే..

author img

By

Published : Jul 23, 2023, 9:35 AM IST

AP Debts
ఏపీ అప్పులు

AP Govt Make Debts: రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా.. వదులుకోవటం లేదు. అప్పు పుట్టే పరిణామాలు కనిపిస్తే చాలు అక్కడ ప్రత్యక్షమై.. అందినకాడికి అందినట్లుగా ఏమాత్రం అలసత్వం వహించకుండా రుణాలు సేకరిస్తోంది. ఇలానే ప్రస్తుత అర్థిక సంవత్సరంలో 9నెలల కాలపరిమితిలో సేకారించాల్సిన అప్పులను వైసీపీ ప్రభుత్వం కేవలం 4నెలల్లోనే సమీకరించింది.

అప్పుల్లో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు..

YSRCP Government Make Heavy Debts: అప్పుల్లో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోంది. కేంద్రం అనుమతించిన రుణాలను అయినకాడికి తెచ్చి వాడేస్తోంది. పుట్టిన చోటల్లా అప్పులు తెచ్చి పబ్బం గడుపుకొంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. 9 నెలలకు తీసుకోవాల్సిన అప్పును కేవలం 4 నెలల్లోనే దాదాపు తీసేసుకుంది.

అప్పుల విషయంలో జగన్‌ ప్రభుత్వం తగ్గేదేలేదంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి నాలుగు నెలల్లో బహిరంగ మార్కెట్‌ రుణమే 28 వేల 500 కోట్ల రూపాయలు సమీకరించింది. జులై 25న మరో వెయ్యి కోట్ల రూపాయలు తెచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో మొత్తం అప్పు 29 వేల 500 కోట్లకు చేరబోతోంది. కేంద్ర ఆర్థికశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో 30 వేల 275 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది.

ఆ అప్పు మొత్తాన్ని దాదాపు నాలుగు నెలల్లోనే రాష్ట్రం తీసేసుకుంటోంది. ప్రభుత్వం జులై 25న వెయ్యి కోట్లు రుణం తీసుకుంటే.. కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన దాంట్లో 775 కోట్లే తీసుకునేందుకే వీలు ఉంది. ఈ పరిస్థితుల్లో ఆగస్టు నుంచి కొత్త రుణాలు కావాలంటే కేంద్ర అనుమతుల కోసం ప్రయత్నించాలి. అదే సమయంలో విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 0.50శాతం మేర అదనపు రుణం ఇచ్చేందుకు కేంద్రం ఇప్పటికే అనుమతులు మంజూరు చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌లో 6 వేల కోట్లు, మే నెలలో 9 వేల 500 కోట్లు, జూన్‌లో 7 వేల కోట్లు సమీకరించింది. జులైలో ఇంతవరకు 6 వేల కోట్లు తీసుకుంది. వచ్చే మంగళవారం అప్పుతో కలిపి ఇది 7వేల కోట్లు అవుతుంది. కేంద్ర అనుమతి మేరకు.. నెలకు సగటున 3 వేల 400 కోట్ల రుణం తీసుకోవచ్చు. కానీ సగటున నెలకు 7 వేల 500 కోట్ల వరకు తీసుకున్నట్లవుతోంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మొత్తం అప్పు లెక్కలు వెల్లడి కావట్లేదు. ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు సమీకరిస్తోంది. ఇంకా ప్రజాఖాతా ద్వారా ఇతర రూపాల్లో ప్రభుత్వానికి వచ్చే నిధులనూ రుణంగా వాడుకుంటోంది. ఆ లెక్కలపై ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగ్‌ అడుగుతూ ఉన్నా బయటకు చెప్పని పరిస్థితి ఉంది.

ప్రభుత్వం వెల్లడించే అప్పుల లెక్కల్లో మాయ కనిపిస్తోంది. రిజర్వుబ్యాంకు రుణాలకు సంబంధించి వెల్లడిస్తున్న లెక్కలకు, కాగ్‌కు ఇస్తున్న లెక్కలకూ పొంతన లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే నెలల లెక్కలను కాగ్‌ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ లెక్కలతో.. రిజర్వు బ్యాంకు ప్రతి మంగళవారం ఆయా రాష్ట్రాల అప్పులపై వెల్లడించే సమాచారాన్ని పోల్చిచూస్తే విస్తుపోవాల్సిందే. ఏపీ ప్రభుత్వం ఏప్రిల్‌లోనే కాగ్‌కు సమర్పించిన లెక్కల ప్రకారం.. 23 వేల 548.04 కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్లు పేర్కొంది. ఇందులో నికర ప్రజారుణం రూ.7 వేల 801.58 కోట్లు, నికర పబ్లిక్‌ అకౌంట్‌ నుంచి 10 వేల 767.03 కోట్ల రూపాయలు ఉన్నాయని వెల్లడించింది.

అదే మే నెలకు వచ్చే సరికి మొత్తం అప్పు 25 వేల 292.68 కోట్ల రూపాయలుగా లెక్కల్లో చూపారు. అంటే ఏప్రిల్‌-మే మధ్య రుణం 17 వందల 44.67 కోట్లు మాత్రమే పెరిగినట్లు చూపారు. కానీ, మే నెలలోనే రిజర్వుబ్యాంకు సెక్యూరిటీల వేలంలో పాల్గొని ప్రభుత్వం 9 వేల 500 కోట్ల రుణం తీసుకుంది. లెక్కల్లోని ఈ వ్యత్యాసం చర్చనీయాంశమవుతోంది. ఇంత పెద్దమొత్తంలో రుణం ఎక్కడ చెల్లించి ఈ నికర రుణం లెక్కించారన్నది ప్రశ్నార్థకమవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.