ETV Bharat / state

ఆ వివరాలివ్వండి.. రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి కాగ్​ లేఖ

author img

By

Published : Apr 11, 2023, 12:04 PM IST

CAG Letter : రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలను తెలుసుకోవాలని కాగ్​ కోరుకుంటోంది. ఈ మేరకు ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను పరిశీలించాలని చూస్తోంది. అందుకోసం రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శికి లేఖ రాసింది.

Etv Bharat
Etv Bharat

రాష్ట్రానికి సంబంధించిన అన్నిరకాల ఆర్థిక కార్యకలాపాలపై కాగ్‌ దృష్టి

Letter to AP State Financial Secretary : రాష్ట్రంలో అన్నిరకాల ఆర్థిక కార్యకలాపాలపై కాగ్‌ దృష్టి సారించింది. సంబంధిత అంశాలన్నింటినీ తెలుసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం నేరుగా సీఎఫ్​ఎమ్​ఎస్​తో తమకు అనుసంధానం కల్పించాలని కోరింది. అలాగే ఆర్థిక అంశాలకు సంబంధించిన అన్ని జీవోలనూ నేరుగా పరిశీలించాలని కోరుకుంటోంది. ఈ మేరకు కాగ్‌ రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శికి లేఖ రాసింది.

రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేయడాన్ని రెండేళ్లుగా కాగ్‌ తప్పుబడుతోంది. ఆర్థిక నిర్వహణ సరిగా లేదని సోదాహరణంగా తెలియజేసింది. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రం అప్పుల విషవలయంలో చిక్కుకొని.. సంక్షోభ పరిస్థితులు తలెత్తుతాయని విశ్లేషించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల సమాచారం తమకు తెలియజేయడం లేదని అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. ప్రతి నెలా నివేదికల్లో ప్రస్తావిస్తూనే ఉంది. ఎంత మొత్తం రుణాలు ఏయే కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నారన్నది తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగ్‌ ఎప్పటినుంచో కోరుతోంది. రాష్ట్ర కార్పొరేషన్లను కూడా కాగ్‌ ప్రత్యేకంగా పరిశీలిస్తోంది. కార్పొరేషన్లు తీసుకుంటున్న రుణాలు, అవి చేస్తున్న ఖర్చులపై కాగ్‌ ప్రత్యేక బృందాలు తనిఖీలు కూడా చేస్తున్నాయి. గత కొన్ని మాసాలుగా రాష్ట్ర ప్రభుత్వం జీవోలను పారదర్శకంగా వెల్లడించడం లేదు. ప్రభుత్వానికి సంబంధించి ఏయే అంశాల్లో ఏ ఉత్తర్వులు వెలువడ్డాయో కూడా కాగ్‌కు తెలియడం లేదు. ప్రభుత్వం ఏ నెలలో ఎన్ని గ్యారంటీలు ఇచ్చింది..? రుణాల వివరాలు.. వాటిని ఖర్చు చేసిన సమాచారాన్ని కాగ్‌ కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు.

ఇటువంటి పరిస్థితులు నెలకొన్న సందర్భంలో.. రాష్ట్రానికి సంబంధించి 31 విభాగాల సమాచారం ఇవ్వాలని కాగ్‌ కోరుతోంది. ఆ ప్రకారం పాలనాపరమైన అంశాలు, ఉద్యోగుల వ్యవహారాలు, జీతాలు, ఇతర చెల్లింపులు, దీనికి సంబంధించిన ఉత్తర్వుల వివరాలను కూడా అడుగుతోంది. ఆంధ్రప్రదేశ్​ ప్రత్యేక పే, ఫైనాన్షియల్‌ కోడ్, అలవెన్సులకు సంబంధించిన అంశాలు, కాంటింజెన్సీ ఫండ్, కన్సాలిడేటెడ్‌ ఫండ్, పబ్లిక్‌ అకౌంట్స్​ల వివరాలు, వాటి ఉత్తర్వులు అవసరమని అనుబంధంలో పేర్కొంది. యూనివర్సిటీలు, స్థానిక సంస్థలకు, ఎన్‌జీవోలకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ మంజూరు తదితర అంశాలతోపాటు.. క్యాష్‌ బుక్, బిల్లు రిజిస్టర్‌ స్టాక్‌ రిజిస్టర్, బడ్జెట్‌ నియంత్రణ రిజిస్టర్‌ తదితర అంశాల వివరాలు కోరింది. పాలనాపరమైన ఆమోదాలు, బడ్జెట్‌ విడుదల ఉత్తర్వులు, ధరల పెంపు, వాటి చెల్లింపులు, కార్పొరేషన్లకు ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు, ఆ వివరాల ఉత్తర్వులు, కాంటింజెన్సీ నిధి నుంచి అడ్వాన్సులు, విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించిన జీవోల వివరాలు కావాలని కాగ్ కోరింది. బడ్జెట్‌ అంచనాల రూపకల్పన, సవరించిన బడ్జెట్‌ అంచనాలు, ఏమైనా నిధులు సరెండర్‌ చేస్తే ఆ వివరాలు తెలియజేసే సమాచారంతోపాటు.. పట్టణ స్థానిక సంస్థలు, గ్రామీణ స్థానిక సంస్థలకు నిధుల విడుదల ఉత్తర్వులు, ఆర్థిక సంఘం గ్రాంట్ల వివరాలు ఇవ్వమని అడిగింది. కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ద్వారా అమలు చేస్తున్న పథకాల వివరాలు తెలియజేయాలంటూ.. రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శికి కాగ్‌ లేఖ రాసింది. కాగ్‌లోని పాలనా విభాగం సీనియర్‌ డిప్యూటీ అకౌంటెంట్‌ పేరుతో రాష్ట్ర ఆర్థిక శాఖకు ఈ లేఖ పంపారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.