ETV Bharat / state

TDP leaders Bharosa Yatra: నాలుగేళ్ల నరకానికి పది నెలల్లో విముక్తి: భవిష్యత్​కు భరోసా యాత్రలో టీడీపీ నేతలు

author img

By

Published : Jul 5, 2023, 5:23 PM IST

TDP leaders Bharosa Yatra: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నాడని టీడీపీ నేతలు విమర్శించారు. భవిష్యత్​కు భరోసా పేరుతో చేపట్టిన బస్సు యాత్ర గుంటూరు జిల్లా దుగ్గిరాల చేరగా.. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ అనురాధ పర్యటించి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరో పది నెలల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుందని, ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.

టీడీపీ నాయకుల బస్సు యాత్ర
టీడీపీ నాయకుల బస్సు యాత్ర

TDP leaders Bharosa Yatra: దేశంలో అత్యధిక ధనవంతుడు అవ్వాలనే ఉద్దేశంతోనే ప్రజా సొమ్మును జగన్ దోచుకుంటున్నాడని తెలుగు దేశం పార్టీ నేతలు ఆరోపించారు. భవిష్యత్తుకి గ్యారెంటీ పేరుతో గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఆ పార్టీ నేతలు బస్సు యాత్ర నిర్వహించారు. దుగ్గిరాలలో శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాబా సాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు తెలుగుదేశం పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

పసుపు యార్డులో రైతులతో సమావేశమై.. వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. జగన్ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు పార్టీ నేతల దృష్టికి తీసుకువచ్చారు. తాము అధికారంలోకి రాగానే పసుపు రైతులను ఆదుకుంటామని టీడీపీ నేతలు హామీ ఇచ్చారు. దుగ్గిరాల రహదారిలో గుంతలు పడ్డ ప్రాంతంలో నేతలు సెల్ఫీలు దిగారు. జగన్ పాలనలో రోడ్లు ప్రజల నడ్డి విరుస్తున్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ అనురాధ విమర్శలు గుప్పించారు.

నాలుగేళ్ల నరకం చూసిన రాష్ట్ర ప్రజలు మరో పది నెలలు ఆగితే కష్టాలన్నీ పోతాయని చంద్రబాబు నాయుడు భవిష్యత్​కు భరోసా ఇచ్చారు. పది నెలల తర్వాత ఈ పథకాలన్నీ అందితే ప్రతి పేద సంతోషంగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ సంపదను జగన్ కొల్లగొడుతూ క్విడ్ ప్రో కో ద్వారా వందల కోట్లు దోచుకోవడానికి అమూల్ కు డెయిరీని కట్టబెడుతున్నట్లు స్పష్టమవుతోంది. - ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి

ప్రతి ఇంటికీ తాగు నీటి కుళాయి అందిస్తాం.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను అమలు చేస్తాం. రాష్ట్రాన్ని పాలిస్తున్న సైకో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల అప్పు తెచ్చి 2లక్షలు సంక్షేమానికి ఖర్చు పెట్టామని చెప్పుకుంటూ 8లక్షల కోట్లు జేబులో వేసుకున్నాడు. దీనిని ప్రజలంతా గమనించాలి. -కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ నేత

ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్న కనీస ఆలోచన కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు. ఇన్నిసార్లు దిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏమైనా తీసుకువచ్చారా..? రైల్వే జోన్ ఏమైనా తీసుకువచ్చారా..? అంతరాష్ట్ర వివాదాలు ఏమైనా పరిష్కరించారా అంటే ఏమీ లేదు. ఆయన సొంత విషయాల కోసమే దిల్లీకి వెళ్తున్నారనేది జగమెరిగిన సత్యం. - పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్సీ

మంగళగిరి నియోజకవర్గంలో... తెలుగుదేశం పార్టీపై అక్కసుతోనే ప్రజలకు అందాల్సిన పథకాలను జగన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేస్తోందని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ నిర్వహిస్తున్న బస్సు యాత్ర ఉత్సాహంగా సాగుతుంది. యాత్రలో భాగంగా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు బ్రిడ్జి వద్ద తెలుగుదేశం పార్టీ నేతలు సెల్ఫీ ఛాలెంజ్ కార్యక్రమాలు నిర్వహించారు. రేవేంద్రపాడు బ్రిడ్జి నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ హయంలో 11 కోట్లు మంజూరు చేస్తే జగన్ వాటిని రద్దు చేశారని జీవీ ఆంజనేయులు చెప్పారు. పోలవరం, అమరావతి త్వరితగతిన పూర్తి కావాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.