ETV Bharat / state

మలిదఫా సర్కార్​లో 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సీఎం కేసీఆర్

author img

By

Published : Dec 13, 2022, 9:35 AM IST

CM KCR 4 Years Administration: కేసీఆర్ మలిదఫా సర్కార్.. ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టింది. తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తిచేసుకుంది. కోవిడ్ సంక్షోభం, కేంద్రం ఆంక్షలకుతోడు.. భాజపాతో రాజకీయ వైరం ప్రభావం రాష్ట్రంపై కనిపిస్తోంది. వివిధరంగాల్లో వృద్ధిరేటు బాగానే ఉన్నా ఆశించిన మేర కేంద్రం నుంచి సహకారం లేదని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే చెబుతోంది. కొన్ని హామీల అమలు ప్రారంభించిన గులాబీసర్కార్... మరికొన్నింటిని పట్టాలెక్కించాల్సి ఉంది. తెరాస నుంచి భారాసగా మారిన తరుణంలో అన్నింటినీ సర్దుకొని ఎన్నికలకు యంత్రాంగాన్ని, పార్టీని నడిపించాల్సిన గురుతర బాధ్యత కేసీఆర్​పై ఉంది.

మలిదఫా సర్కార్​లో 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సీఎం కేసీఆర్
మలిదఫా సర్కార్​లో 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సీఎం కేసీఆర్

CM KCR 4 Years Administration: తెలంగాణలో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కేసీఆర్... మలిదఫా పాలనలో నాలుగేళ్ల కాలం పూర్తిచేసుకున్నారు. 9 నెలల గడువుండగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఘనవిజయంతో 2018 డిసెంబర్ 13న రెండోసారి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించారు. తొలిదఫాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును... రెండోవిడతలో జాతికి అంకితం చేసిన ఆయన... ఇతర నీటిపారుదల ప్రాజెక్టుల పనుల వేగవంతంపై దృష్టిసారించారు. ఐతే ఇటీవలి గోదావరికి వచ్చిన భారీవరదలకు కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన రెండు పంపుహౌస్‌లు నీటమునిగి దెబ్బతినడంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేసి దశలవారీగా పుంపుల్ని అందుబాటులోకి తెస్తున్నారు.

సవాల్​గా ధరణి సమస్యలు : కాళేశ్వరంతో ఇతర సాగునీటి ప్రణాళికలతో భూగర్భమట్టం పెరిగి వరి ఉత్పత్తి రికార్డుస్థాయికి చేరింది. ధాన్యం కొనుగోళ్లపై హైదరాబాద్, దిల్లీలో కేసీఆర్‌ ఆందోళనకు దిగారు. రెవెన్యూ సంస్కరణల్లో తెచ్చిన ధరణి మిశ్రమ ఫలితాలు ఇచ్చింది. రికార్డుల్లో ఇబ్బందిలేనివారి భూలావాదేవీలు నిమిషాల్లో పూర్తవుతున్నాయి. వివాదాలతోపాటు ఇతర కారణాలు, ఉన్నవారికి ఉపశమనం కలగలేదు. కొన్నిచోట్ల భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లడం, పేర్లు, విస్తీర్ణం నమోదులో పొరపాట్లతో ధరణి సమస్యలు సవాల్‌గా మారాయి. వాటి పరిష్కారానికి చేసిన కసరత్తు కొలిక్కిరాలేదు. రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా వీఆర్వో వ్యవస్థ చరిత్రలో కలిసిపోయింది. పోడు సమస్య కొనసాగుతూనే ఉంది. పోడుసాగుదార్లకు పట్టాలిస్తామన్న హామీ అమలుకాలేదు. గతంలో చేపట్టిన కసరత్తు మధ్యలోనే నిలిచిపోగా... మరోదఫా ప్రక్రియ సాగుతోంది. గిరిజనులు, అటవీ అధికారుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి ఈ క్రమంలో కొన్నిసార్లు విలువైన ప్రాణాలు పోతున్నాయి.

జిల్లాకు ఒక వైద్యకాలేజీ : ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపింది. అప్రమత్తమైన ప్రభుత్వం... ప్రజారోగ్య వ్యవస్థ పటిష్టానికి ఆసుపత్రుల స్థాయిపెంపు, కొత్తవాటి నిర్మాణాన్ని వేగవంతం సహా వైద్యులు, సిబ్బందినియామక ప్రక్రియ చేపట్టింది. జిల్లాకు ఒక వైద్యకాలేజీ లక్ష్యంగా... ప్రభుత్వ వైద్యకళాశాలలు ఏర్పాటుచేస్తోంది. ఈ విద్యాసంవత్సరంలో 8 ప్రారంభం కాగా... వచ్చే ఏడాది మరో తొమ్మిదింటిని ప్రారంభించేందుకు సిద్ధమైంది. రాష్ట్రం నుంచి వచ్చిన కోవాక్జిన్, ఇతరటీకాలు ప్రాణాలపై భరోసా నింపాయి. హైదరాబాద్ పోలీస్‌కమిషనరేట్‌కి కమాండ్‌కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. పాతసచివాలయ భవనాలు కూల్చేసి.. కొత్తవి నిర్మిస్తోంది. సంక్రాంతి తర్వాత ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.

రాష్ట్రంలో ప్రముఖసంస్థల పెట్టుబడులు : అమరవీరుల స్మారకం, అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం పనులు వేగంగా సాగుతున్నాయి. పలు జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ భవనాలు అందుబాటులోకి రాగా... మిగతావి వివిధదశల్లో ఉన్నాయి. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాంతీయ వలయ రహదారి - ఆర్​ఆర్​ఆర్​ పనులు ప్రారంభంకావాల్సిఉంది. పూర్తిగా ప్రభుత్వనిధులతోనే... రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాజెక్టును సర్కార్ చేపట్టింది. హైదరాబాద్‌తోపాటు ఇతర చోట్లా మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో కొన్ని పూర్తి కాగా. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. రాష్ట్రంలో అమెజాన్, అమరరాజా, తదితర ప్రముఖసంస్థల పెట్టుబడులు పెట్టాయి. స్థిరాస్తిరంగం ఊపందుకోవడంతో ఇళ్ల విక్రయాలు జోరందుకున్నాయి.

ఎస్సీ రిజర్వేషన్ల పెంపుపై ఉత్తర్వులు : దళితబంధు పేరిట కొత్త పథకాన్ని తెచ్చిన సర్కారు... ఒక్కో కుటుంబానికి 10 లక్షల రాయతీతో జీవనోపాధి కల్పిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం... యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో అమలు చేశారు. ఆనంతరం నాలుగు ఎస్సీ నియోజకవర్గాల్లోని ఒక్కో మండలంలో పూర్తిస్థాయిలో అమలుచేయగా.. మిగిలిన చోట్ల దశలవారీగా అమలుకు శ్రీకారం చుట్టింది. అదే తరహాలో గిరిజనబంధు అమలుచేస్తామని... కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడంతో ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచుతూ రాష్ట్రప్రభుత్వమే ఉత్తర్వు జారీచేసింది.

90వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి శ్రీకారం: రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి 95 శాతం స్థానికత ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 90వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి శ్రీకారంచుట్టింది. నోటిఫికేషన్లు, నియామకప్రక్రియ వివిధ దశల్లో ఉంది. నిరుద్యోగ భృతి హామీ ఇంకా అమలుకాలేదు. ఎఫ్​ఆర్​బీఎం పరిధికి వెలుపల రాష్ట్రప్రభుత్వం తీసుకున్న అప్పులపై అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్రం... రుణపరిమితికి లోబడి తీసుకున్న అప్పుల్లో ఆంక్షలుపెట్టింది. తద్వారా నిధులకు కటకట ఏర్పడి.... ఆచితూచి ముందుకెళ్లాల్సిన పరిస్థితి. విభజన వివాదాలు, నీటిపంచాయతీలు కొనసాగుతూనే ఉన్నాయి. గల్వాన్ లోయలో చైనా సైనికులతో ఘర్షణల్లో మరణించిన రాష్ట్రానికి చెందిన కల్నల్ సంతోష్ బాబుతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన సైనికులకు ప్రభుత్వం ఆర్థికసాయం చేసింది. ఉత్తరాదిలో... రైతు ఆందోళనల్లో మరణించిన కర్షకుల కుటుంబాలకు అండగా నిలించింది.

కేంద్ర వేడుకలకు భిన్నంగా రాష్ట్రంలో జాతీయసమైక్యతా వజ్రోత్సవాలు: రెండోసారి అధికారంలోకి వచ్చాక కేంద్రంతో... రాష్ట్రప్రభుత్వానికి దూరంపెరిగింది. వివిధ అంశాలు, విషయాల్లో కేంద్రంతో విభేదిస్తూ వస్తోంది. కేసీఆర్ బహిరంగంగానే... కేంద్రం, భాజపా, ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భాజపా, కేంద్ర ప్రభుత్వ పెద్దలు రాష్ట్రసర్కార్‌, సీఎం కేసీఆర్‌పై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ప్రధాని రాష్ట్ర పర్యటనలకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్వాగతం పలకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. కేంద్రం నిర్వహించే వివిధ సమావేశాలకు సీఎం, మంత్రులు దూరంగా ఉంటూ వస్తున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంలో కేంద్రంతో పోటీగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు రాష్ట్రం వినూత్నంగా నిర్వహించింది. హైదరాబాద్ రాష్ట్రం ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంలో కేంద్ర వేడుకలకు భిన్నంగా రాష్ట్రంలో జాతీయసమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించారు.

ప్రోటోకాల్ వివాదాలు : కేంద్రప్రభుత్వ పథకాలు, నిధులు సహా పలు అంశాల్లో కేంద్రం, రాష్ట్రం మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ రాష్ట్రప్రభుత్వానికి దూరం చాలా పెరిగింది. జిల్లాల పర్యటనలో ప్రోటోకాల్, గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణతో ప్రారంభమైన వివాదం... బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడంతో తారాస్థాయికి చేరుకొంది. రాజ్ భవన్, ప్రగతిభవన్ వద్ద క్రమేపీ అంతరం పెరుగుతూ వచ్చింది. నేరుగా గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఖరిని తప్పుపడుతూ వస్తుండగా మంత్రులు గవర్నర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం ఉభయసభల్లో మూడునెలల క్రితం ఆమోదించిన బిల్లులు గవర్నర్ ఆమోదం పొందకుండా రాజ్‌భవన్‌లో పెండింగ్‌లోనే ఉన్నాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఓ బిల్లుపై మంత్రి, అధికారుల వివరణ తీసుకున్నా ఆమోదం ప్రక్రియ పూర్తి కాలేదు.

బీఆర్​ఎస్​గా మారిన టీఆర్​ఎస్: సీనియర్ నేత ఈటల రాజేందర్‌ను ఆరోపణలతో మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఆయనపై విచారణలు చేపట్టారు. తెలంగాణ అభివృద్ధి నమూనా దేశం మొత్తంఅమలు కావాలన్న ఉద్దేశంతో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. రైతు సంఘాలు, నిపుణులు, ఆర్థికవేత్తలు, రాజకీయ నేతలతో చర్చించిన ఆయన... వివిధ రాష్ట్రాల్లోనూ పర్యటించారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్రసమితిగా మార్చారు. ఈ ఏడాది కాలంలో కేసీఆర్ సర్కార్... రాష్ట్రంలో ప్రజల తీర్పును ఎదుర్కోవాల్సి ఉంది. మరోసారి ముందస్తు అంటూ ఉహాగానాలు వస్తున్నా... పాలకపక్షం నుంచి మాత్రం తోసిపుచ్చుతోంది. రుణమాపీ, ఇళ్ల నిర్మాణానికి 3 లక్షల ఆర్థికసాయం, నిరుద్యోగ భృతి, తదితర ఎన్నికల హామీలు అమలు చేయడంతో కొత్త వ్యూహాలు రచించి, అమలు చేయాల్సిన బాధ్యత రథసారధిగా కేసీఆర్​పై ఉంది.

మలిదఫా సర్కార్​లో 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సీఎం కేసీఆర్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.