చెరువుల అభివృద్ధికి గండి కొట్టిన జగన్​ సర్కారు - నిధులున్నా 'నీటిపారుదల' అస్తవ్యస్తం

author img

By ETV Bharat Andhra Pradesh Desk

Published : Jan 15, 2024, 12:11 PM IST

Updated : Jan 15, 2024, 3:56 PM IST

cheruvulu_chidram

Jagan's government neglects water resources జగన్‌ పాలనలో చిన్ననీటి వ్యవస్థ ఛిద్రమైపోతోంది. జలయజ్ఞం సాగిస్తానని పాదయాత్రల్లో ప్రతిజ్ఞను గట్టున పెట్టేశాడు. భారీ ప్రాజెక్టుల నిర్మాణం దేవుడెరుగు కనీసం చెరువుల్ని సైతం పట్టించుకోలేని దుస్థితిలోకి దిగజారారు. కేంద్రం, ప్రపంచబ్యాంకు, జపాన్‌ సహా ఎన్నో సంస్థలు నిధులివ్వడానికి సిద్ధంగా ఉన్నా సద్వినియోగం చేసుకోలేని దురవస్థలో ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోంది.

Jagan's government neglects water resources : రాజన్నకు పుత్రుడవు, రైతన్నకు మిత్రుడవు, జగనన్నా జగనన్న. గత ఎన్నికల ప్రచారంలో వైసీపీ హోరెత్తించిన ఓ పాటలోని కొన్ని వ్యాక్యాలివి. మరి అధికారంలోకి చేపట్టాక జగనన్న ఏం చేశారు? అన్నదాతల నోట్లో మట్టి కొట్టే చర్యలకు తెరలేపారు. సాగుకు నీరే ఆధారం. భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు నిర్మించలేక, నిధులివ్వక చేతులెత్తేసిన ప్రభుత్వం కనీసం చెరువుల్నీ పట్టించుకున్న పాపాన పోలేదు.

చెరువుల అభివృద్ధికి గండి కొట్టిన జగన్​ సర్కారు - నిధులున్నా నీటిపారుదల వ్యవస్థ అస్తవ్యస్తం

వర్షాధార ప్రాంతాల్లో చెరువులే ప్రజల జీవనాధారం. అలాంటి చెరువులు ఇప్పుడు అధికార పార్టీ నాయకగణానికి ఆర్థిక వనరులుగా, ఆస్తులుగా మారిపోతున్నాయి. పురాతన చెరువులను పునరుద్ధరించి సాగు, తాగునీటికి యోగ్యంగా తయారు చేయాల్సిన జగన్‌ సర్కార్‌ చేష్టలుడిగి చూస్తోంది. వర్షాధార ప్రాంతాల్లో కొత్త చెరువుల తవ్వి నూతన ఆయకట్టు సాగులోకి తీసుకురాలేకపోయింది. ప్రపంచబ్యాంకు ముందుకొచ్చినా, జపాన్‌ ఆర్థికసాయం చేసినా, నాబార్డు నిధులిస్తున్నా రాష్ట్ర సర్కార్‌ ఆ చేయూతను అందుకోలేకపోతోంది. తన వాటా నిధుల్నీ సరిగా ఇవ్వడం లేదు. కేటాయించిన నిధులూ సరిగా ఖర్చు చేయడం లేదు.

కొల్లేరులో వైసీపీ నాయకుల అక్రమాల పర్వం.. చేపల చెరువుల దందా..

రాష్ట్రంలో 40,817 చెరువుల కింద 25.60 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. వివిధ పథకాల ద్వారా ఈ చెరువుల కింద ఉన్న ఆయకట్టును స్థిరీకరించాల్సి ఉంది. 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లకాలంలో చిన్ననీటి వనరుల కోసం 5,560 కోట్లు ఖర్చు చేస్తే, ప్రస్తుతం సర్కార్‌ నాలుగున్నరేళ్లలో కేవలం 1,837 కోట్లు మాత్రమే వెచ్చించింది. ఈ ఖర్చులోనూ పాత ప్రభుత్వంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. చెరువుల మరమ్మతులు-పునరుజ్జీవనం-పునరుద్ధరణ పథకం, సమీకృత సేద్య వ్యవసాయ పరివర్తన ప్రాజెక్టు, జపాన్‌ అంతర్జాతీయ సహకారంతో సాగునీరు-జీవనోపాధి అభివృద్ధి ప్రాజెక్టు పేరుతో కార్యక్రమాలు అమలు చేస్తున్నా... అవన్నీ అంతంతమాత్రంగా ఉన్నాయి.

కడపలో వైసీపీ నేతల దుర్మార్గం.. మట్టి కోసం చెరువులకు గండి

చెరువుల మరమ్మతు, పునరుద్ధరణ కోసం కృషి సంచాయి యోజన కింద 235 చెరువుల పనులు చేపట్టేందుకు 2016 నుంచి ప్రయత్నాలు సాగుతున్నాయి. కేంద్రం ఇందులో 60శాతం నిధులు ఇస్తుంది. మిగిలిన నిధులు రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. మొత్తం 137.49 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పథకంలో 2023 మార్చి వరకు ఖర్చు చేసిన మొత్తం కేవలం 30 కోట్లు మాత్రమే. ప్రపంచబ్యాంకు రుణ సాయంతో చిన్ననీటి వనరుల అభివృద్ధికి 1,600 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. 2017-18లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 2023-24 సంవత్సరంతో పూర్తి కావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టులో వెయ్యి చెరువులను పునరుద్ధరించి 2,26,552 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలనేది లక్ష్యం. ఇందులో ప్రపంచబ్యాంకు 70శాతం నిధులు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా కేవలం 30శాతం మాత్రమే. 2023 మార్చి వరకు ఈ ప్రాజెక్టు కింద 120 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 120 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రతిపాదించినా ఇంతవరకు అందులో సగం నిధులు ఇవ్వలేదు.

జపాన్‌ అంతర్జాతీయ సహకార సంస్థ సాయంతో ఏపీ సాగునీరు జీవనోపాధి అభివృద్ధి ప్రాజెక్టు రెండో దశను చేపట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక్క చిన్ననీటి వనరుల కోసమే 900 కోట్లు ఖర్చు చేయాలనేది ప్రణాళిక. ఈ ప్రాజెక్టు కోసం జపాన్‌ అంతర్జాతీయ సహకార సంస్థ ఒక సర్వే కూడా చేసింది. 445 చిన్ననీటి వనరుల పునరుద్ధరణ, 21 మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టుల ఆధునికీకరణకు రూపకల్పన చేశారు. ఇందులో 441 చెరువుల పునరుద్ధరణకు 270.91 కోట్లతో పాలనామోదం ఇచ్చారు. ఈ మొత్తం ప్రక్రియ 2018-19లో ప్రారంభమైంది. జగన్‌ సర్కార్‌లో వేగం లోపించి ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. షెడ్యూలు కులాల ఉప ప్రణాళిక కింద, గిరిజన ప్రాంత ప్రణాళిక కింద చేపట్టిన పనుల్లోను చాలినంత వేగం, పురోగతి లేదు.

Handri Neeva: హంద్రీ-నీవాపై సీఎం ఆర్భాటపు హామీలు.. నాలుగేళ్లుగా నిండని చెరువులు

అప్పటి టీడీపీ ప్రభుత్వం నీరు చెట్టు పథకం కింద వేల చెరువులను తవ్వించి నీటి నిల్వ సామర్థ్యం, భూగర్భజలాల పెరుగుదలకు చర్యలు తీసుకుంది. 7లక్షలకు పైగా పంట కుంటలు తవ్వారు. జగన్‌ సర్కార్‌ మాత్రం నీరు-చెట్టుకు సంబంధించిన వేల కోట్ల బిల్లుల్ని చెల్లించక... ముప్పతిప్పలు పెడుతోంది. నీరు చెట్టు పనులపై విజిలెన్సు తనిఖీలు నిర్వహించింది. ఇంజినీరింగ్ బృందాలను ఏర్పాటు చేయించి తనిఖీలు నిర్వహించింది.

ఆ ప్రక్రియ నిర్వహించినా తమ బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదంటూ రైతులు, సాగునీటి నిర్వహణ కమిటీలు హైకోర్టును ఆశ్రయించాయి. పెద్ద న్యాయపోరాటమే సాగించాయి. మొత్తం 8,070 కేసులు దాఖలు చేశారు. కోర్టు ఆదేశించినా ఈ సర్కార్‌కు మనసు రాలేదు. న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా అమలు కావడం లేదంటూ.. మరో 6,402 కోర్టు ధిక్కరణ కేసులూ దాఖలు చేశారు. దిగొచ్చిన సర్కార్‌ 1,076 కోట్ల చెల్లింపులకు జీవోలు విడుదల చేయగా ఇంతవరకు 804 కోట్లు చెల్లింపులు పూర్తయ్యాయి. ఇంకా 400 కోట్ల వరకు బిల్లులు పెండింగులోనే ఉన్నాయి.

'అనంత' కరవు కష్టం! ఎండిన చెరువులు, అడుగంటిన బోర్లు - రైతుల కన్నీళ్లు పట్టని వైసీపీ పాలకులు

Last Updated :Jan 15, 2024, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.