ETV Bharat / state

Handri Neeva: హంద్రీ-నీవాపై సీఎం ఆర్భాటపు హామీలు.. నాలుగేళ్లుగా నిండని చెరువులు

author img

By

Published : Jul 26, 2023, 12:08 PM IST

Updated : Jul 26, 2023, 2:30 PM IST

CM Jagan assurances on Handri Neeva: కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో హంద్రీ- నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ ద్వారా నీటిని ఎత్తిపోసి.. తాగు, సాగు నీరు అందించే కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తామనని సీఎం జగన్‌ ఇటీవల ఘనంగా ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే ఇప్పటికీ పనులు పూర్తికాలేదు. నాలుగేళ్లుగా పనులు నత్తనడకన సాగుతున్నాయి.

CM Jagan assurances on Handri Neeva
హంద్రీ-నీవాపై సీఎం ఆర్భాటపు హామీలు.. నాలుగేళ్లుగా నిండని చెరువులు

హంద్రీ-నీవాపై సీఎం ఆర్భాటపు హామీలు.. నాలుగేళ్లుగా నిండని చెరువులు

CM Jagan assurances on Handri Neeva: ఈ ఏడాది జూన్ ఒకటో తేదీన పత్తికొండలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్‌.. 68 చెరువులను నింపే కార్యక్రమం పూర్తి కావొచ్చిందని.. జులై లేదా ఆగస్ట్‌ నెలల్లో తానే వచ్చి నీళ్లు విడుదల చేస్తానని చెప్పారు. కానీ జులై నెలాఖరుకు వచ్చినా.. సీఎం హామీ నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రస్తుతం 68 చెరువుల్లో ఇప్పటికి 35 చెరువులకు మాత్రమే పైపులైను వేశారు. ఆరు చెరువులకు అసలు పైపులైను వేసే పరిస్థితి లేదని తేల్చేశారు. ఎప్పటి నుంచో ఈ చెరువులకు నీళ్ల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు నిరాశే ఎదురవుతోంది.

68 చెరువులకు నీరు. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో పత్తికొండ, డోన్ నియోజకవర్గాల్లో ఉన్న 68 చెరువులకు నీటిని అందించాలనేది ఉద్దేశంతో హంద్రీ- నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి నీటిని మోటార్ల సాయంతో ఎత్తిపోసి నీటిని అందించేందుకు ప్రణాళిక రచించారు. తొలుత హంద్రీ- నీవా కాలువ నుంచి కటారుకొండ ప్రాంతానికి.. అక్కడి నుంచి మూడు ప్రధాన పైపులైన ద్వారా 57 గ్రామాల ప్రజలకు తాగునీటిని అందించేందుకు.. 10 వేల 130 ఎకరాలకు సాగునీటి సరఫరా కోసం 68 చెరువులకు నీటిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2018లో తెలుగుదేశం హయాంలో 253.72 కోట్లతో పనులు చేపట్టారు. అప్పట్లోనే శంకుస్థాపన చేశారు. గత నాలుగేళ్లుగా పనులు సరిగా చేయకపోవడంతో అంచనాలు సుమారు 300 కోట్లకు చేరుకుంటున్నాయి. అసలు సకాలంలో పనులు చేసి ఉంటే అంచనా విలువ ఎందుకు పెరుగుతుంది అనే ప్రశ్న వినిపిస్తోంది.

నత్త నడకన పనులు.. మొత్తం 68 చెరువుల్లో 35 చెరువులకు మాత్రమే ఇప్పటి వరకు పైపులైన్లు ఏర్పాటు పూర్తయింది. మరికొన్ని చెరువుల పైపులైన్లకు కనెక్షన్లు ఇచ్చే నాటికి ఆగస్టు నెలా కూడా దాటిపోవచ్చు. ఆరు చెరువులకు అసలు పైపులైన్లు వేసే పరిస్థితి లేదు. చిన్నపొదిళ్లలోని చిన్న, పెద్ద చెరువులు, మామిళ్లకుంటలోని చెరువులు పైపులైను కన్నా ఎక్కువ ఎత్తులో ఉండటం, పెరవలి, కొత్త బురుజు గ్రామాల్లోని చెరువులు ప్రైవేటువి కావడం, బాపనికుంట ప్రాంతంలోని చెరువుకు పైపులైను పనులను రైతులు అడ్డుకోవడంతో ఆయా చెరువులకు పైపు లైన్లు వేసే పరిస్థితి లేదని తేల్చారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇలా ఉంటే ఆగస్టులో నీళ్లు ఇచ్చేస్తామని సీఎం చెబుతున్నారు.

చేతి చమురు వదిలించుకోవాల్సిన పరిస్థితులు.. తమ భూముల్లో పైపులు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులిచ్చిన పాపానికి భారీగా చేతి చమురు వదిలించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైపులైన ఏర్పాటు కోసం రైతుల పొలాల్లో తీసిన గోతులను మళ్లీ పూడ్చి వ్యవసాయ యోగ్యంగా ఉండేలా యథాతథ స్థితికి తీసుకురావాలి. అందుకు విరుద్ధంగా గుంతల నుంచి తీసిన మట్టిని మళ్లీ ఆయా గోతుల్లో సరిగా పోయడం లేదు. ఫలితంగా ఆయా పనులన్నీ రైతులే చేసుకోవాల్సి వస్తోంది. కొందరు వేల రూపాయలు వెచ్చించి కూలీలను పెట్టి కూడా పనులు చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కొన్నిచోట్ల రైతుల పొలాల్లో భారీ రాతి బండలు ఉండడంతో వాటిని పొక్లెయిన్ల సాయంతో పొలాల్లోకి తోశారు. మళ్లీ ఆయా బండలను పక్కన పెట్టకుండా వదిలేయడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పైపులైన్ల కోసం రహదారులు పక్కన తీసిన గోతులు పూడ్చకుండా అక్కడక్కడా పనులు పెండింగ్ లో ఉంచారు. పైపులైను నిర్మాణ పనులకు రైతుల భూములను వినియోగించు కుంటున్న ప్రభుత్వం కొందరికే పరిహారం ఇస్తోంది. పైపుల సైజుల్లో కొద్దిపాటి తేడాను సాకుగా చూపి అధికారులు పరిహారాన్ని ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు.

పని పూర్తి చేయించే బాధ్యత తీసుకోరా.. ఎన్నికలొచ్చినప్పుడే ప్రాజెక్టులు గుర్తొస్తాయా..? అని నాటి సీఎం చంద్రబాబును ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్‌ ప్రశ్నించారు. కానీ అదే సీఎం జగన్‌ను చెరువులకు ఎందుకు నీటిని ఇవ్వలేకపోయారని.. తాగునీరు అందక తల్లడిల్లుతున్న కర్నూలు కరవు సీమ ప్రశ్నిస్తోంది. మళ్లీ ఎన్నికలొస్తున్నా ఈ చెరువులకు ఎందుకు నీటిని ఇవ్వలేకపోయారని నిలదీస్తోంది. ఈ కొద్దిపాటి పనులు పూర్తి చేసేందుకు నాలుగేళ్ల సమయమూ సరిపోదా అని ప్రశ్నిస్తోంది. నాలుగేళ్లుగా పనులు నత్తనడక నడుస్తుంటే మీరేదో కార్యశూరులు అన్నట్లు ఇలా ఎలా మాట్లాడేస్తారంటూ అడుగుతోంది. ఎప్పటికప్పుడు సమీక్షించి ఆ పని పూర్తి చేయించే బాధ్యత తీసుకోరా? ఆలస్యం ఎందుకు? ఎక్కడ సమస్య? ఎలా పరిష్కరించాలి? ఎవరు సమన్వయం చేయాలి? అనేది కూడా పట్టించుకోకుండా నాలుగేళ్లు పాటు పనులు చేయకపోయినా.. దిక్కూమొక్కూ లేకపోయినా.. నీళ్లు ఇచ్చేస్తున్నాం అని ఎలా చెబుతారంటూ గట్టిగా ప్రశ్నిస్తోంది.

Last Updated : Jul 26, 2023, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.