కొల్లేరులో వైసీపీ నాయకుల అక్రమాల పర్వం.. చేపల చెరువుల దందా..

author img

By

Published : Jan 18, 2023, 9:46 AM IST

Etv Bharat

YSRCP Leaders Illegal Activities : కొల్లేరు అభయారణ్యంలో ఆక్రమణల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. స్వార్థ ప్రయోజనాల కోసం వందల ఎకరాలను చేపల చెరువులుగా మార్చేస్తున్నారు. ఐదో కాంటూరు పరిధిలో ఎలాంటి తవ్వకాలు జరపరాదని సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఉన్నా వాటిని బుట్టదాఖలు చేస్తూ అధికార పార్టీ నాయకులే తవ్వకాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కొల్లేరులో అక్రమాల పర్వం

YSRCP Leaders Illegal Activities in Kolleru : ఏలూరు గ్రామీణ మండలం కొక్కిరాయి లంక గ్రామ సమీపంలోని కొల్లేరు అభయారణ్యంలో జోరుగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. కొల్లేరులోని ఐదో కాంటూరు పరిధిలో తవ్వకాలు నిషిద్ధమైనప్పటికీ క్షేత్ర స్థాయిలో వందల ఎకరాల్లో చెరువులు తవ్వేస్తున్నారు. మొత్తం 40 ఎకరాల్లో చెరువులు తవ్వుతుండగా.. ఇందులో పదెకరాలకు పైగా ఐదో కాంటూరు పరిధిలోనిదే. గుడివాకలంక, ఆగడాళ్లలంక, పోతునూరు, వీరమ్మకుంట, గుడిపాడులోనూ అక్రమంగా చెరువులు తవ్వుకుని ఆక్వా సాగు చేస్తున్నారు. కొల్లేరు అభయారణ్యంలోకి యంత్రాలు ప్రవేశించడం చట్టరిత్యా నేరం. యంత్రాలను కొల్లేరులోకి తీసుకెళ్లాలంటే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. ఈ ప్రాంతానికి కూతవేటు దూరంలోనే చెక్ పోస్టులున్నా.. అదే మార్గంలో భారీ యంత్రాలు వెళ్తున్నాయి. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని కొల్లేరు పరిరక్షణ సమితి సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"కొల్లేరు ఐదో కాంటూరు పరిధిలో తవ్వకాలు చేపట్టటం చట్ట ప్రకారం నిషిద్ధమైనా.. వైసీపీ నాయకులు తవ్వకాలను చేస్తున్నారు. ఒకప్పుడు చిన్న అగ్గిపెట్టె జేబులో పెట్టుకుని అక్కడికి వెళ్లినా.. అరెస్టులు చేసిన ఫారెస్టు అధికారులు ఇప్పుడు మిన్నకుండి ఉండిపోయారు అంటే, వారికి వాటాలు దక్కాయా. వైసీపీ నాయకులకు భయపడి ఇలా వ్యవహరిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నాము." -రవి, కొల్లేరు పరిరక్షణ సమితి

పక్షులకు ఆవాసం కల్పించడం, కొల్లేరు పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ఐదో కాంటూరు వరకు అభయారణ్యంగా ప్రకటించారు. గుడివాకలంక, పైడిచింతపాడులో అధికార పార్టీకి చెందిన నియోజవర్గ స్థాయి నాయకులు సుమారు 150 ఎకరాల్లో చెరువులు తవ్వి లీజుకు ఇచ్చినట్లు సమాచారం. గుడివాకలంక పరిధిలో మంచినీటి చెరువు తవ్వకం పేరుతో 15 ఎకరాల్లో ఆక్వా చెరువు తవ్వారు. మండవల్లిలో 35 ఎకరాల్లో ఆక్వా చెరువు తవ్వేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునేందుకు ద్వితీయ శ్రేణి నాయకులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామస్థుల ఫిర్యాదుతో మొక్కుబడిగా కేసు నమోదు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. నియోజకవర్గ నాయకుల నుంచి గ్రామస్థాయి నాయకుల వరకు చెరువులు తవ్వుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

"వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొల్లేరులో అక్రమంగా చెరువుల తవ్వకాలు పెరిగాయి. ఇప్పుడు చేపట్టిన చెరువుల తవ్వకాలు మాత్రమే కాకుండా మరిన్ని తవ్వకాలకు వారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దురదృష్టం ఎంటంటే ఫారెస్టు అధికారులు అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాసే విధంగా తయారయ్యింది. జిల్లా యంత్రాంగం అధికార పార్టీకీ తలొగ్గకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం." -కిశోర్, కొల్లేరు పరిరక్షణ సమితి

అధికారులు స్పందించి ఐదో కాంటూరు పరిధిలోని కొల్లేరు అభయారణ్యాన్ని సంరక్షించాలని కొల్లేరు పరిరక్షణ సమితి సభ్యులు కోరుతున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.