మాజీ మంత్రి ఇలాకాలో అక్రమ గ్రావెల్ దందా.. గుట్టలు, చెరువులు మాయం

author img

By

Published : Jun 12, 2022, 12:48 PM IST

gravel mafia in ex minister muttamshetty srinivas rao constituency

Gravel Mafia: మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇలాకాలో రోజురోజుకీ గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. గుట్టలు, చెరువులు, ప్రభుత్వ భూములు సైతం కనుమరుగవుతున్నా.. సంబంధిత అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇలాకాలో రోజురోజుకీ గ్రావెల్ మాఫియా పేట్రేగిపోతోంది. స్థానిక మండల అధ్యక్షులు కనుసన్నల్లోనే కొండలు, గుట్టలు, చెరువులు, ప్రభుత్వ భూములు కనుమరుగవుతున్నాయి. ప్రైవేట్ స్థలాల్లో సైతం మట్టి, గ్రావెల్, ఇసుక, రాళ్ల అక్రమ వ్యాపారం ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారుల సమన్వయ లోపంతో అక్రమ వ్యాపారులపై చర్యలకు వెనుకాడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

విశాఖ జిల్లా పద్మనాభం మండలం అనంతవరంలో మండల స్థాయి నాయకులు కనుసన్నల్లో ఓ కాంట్రాక్టర్ కొండ ప్రాంతం, అటవీ శాఖకు సంబంధించిన భూముల్లో దర్జాగా గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నాడు. రెండు జేసీబీలు, పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో అక్రమ గ్రావెల్ తరలించి లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. సచివాలయ కార్యదర్శి, మండల ఇంజనీర్లు గ్రావెల్ తరలింపునకు అనుమతి ఇచ్చారంటూ.. సదరు కాంట్రాక్టర్ అనుమతి పత్రాలు చూపించి ఇష్టారాజ్యంగా గ్రావెల్ తవ్వకాలు జరిపి తరలిస్తున్నారు.

గ్రావెల్ తవ్వకాల కోసం సచివాలయ కార్యదర్శి పైడయ్య, పీఆర్ఐ మండల ఇంజనీర్ ఎం. సుధాకర్ ఇచ్చిన అనుమతి పత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ విషయంపై సంబంధిత తహసీల్దార్​ను వివరణ కోరగా.. గ్రావెల్ అనుమతి ఇచ్చేందుకు తనకు అధికారం లేదని ఎటువంటి అనుమతి ఇవ్వాలన్నా.. గనుల శాఖ అధికారులకు అధికారం ఉంటుందని చెప్పడం మరో విశేషం.

సంబంధిత విషయాన్ని ఎంపీడీవో చిట్టిరాజు, పీఆర్ఐ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగదీష్ బాబు వద్ద ప్రస్తావించగా.. అనుమతులకు సంబంధించి ఎటువంటి సమాచారం లేదని ఫోన్​లో తెలిపారు. గ్రావెల్ అనుమతులు తమ శాఖ పరిధిలోకి రావని మండల ఇంజనీర్(పీఆర్ఐ) సుధాకర్ విషయమై పరిశీలిస్తానని తెలిపారు. అధికారుల కళ్లు గప్పి సాగుతున్న ఈ అక్రమ దందాలపై స్థానిక ఎమ్మెల్యే.. జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.