ETV Bharat / state

Floods In Jagananna Colonies: నీట మునిగిన జగనన్న కాలనీలు.. చెరువుల కన్నా దారుణం.

author img

By

Published : Jul 28, 2023, 7:15 AM IST

Updated : Jul 28, 2023, 12:00 PM IST

Jagananna Colonies filled with water: వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న పేదవారి సొంత ఇంటి కల.. కలగానే మిగిలిపోయేలా ఉంది. ప్రభుత్వం పేదలకు పంచిన జగనన్న కాలనీల ఇళ్ల స్థలాలు రాష్ట్రంలో చాలా చోట్ల వర్షం నీటిలో మునిగిపోయాయి. అందులో ఇళ్లు కట్టుకుంటే ఎలా ఉండేదని లబ్దిదారులు లబోదిబోమంటున్నారు.

Etv Bharat
Etv Bharat

వర్షాలకు నీటిలో నానుతున్న జగనన్న కాలనీలు

Jagananna Colonies Filled With Flood Water: జగనన్న కాలనీల్లో ఇళ్లు కాదు ఊళ్లు కడుతున్నామంటూ సీఎం జగన్ సమయం వచ్చినప్పుడల్లా చెప్పుకొస్తున్నారు. వర్షాలకు ఇప్పుడా కాలనీలు నీటిలో నానుతున్నాయి. అవి తేలితేగానీ పునాదులు ఎలా ఉన్నాయో, ఎంత మేర కోతకు గురయ్యాయో చెప్పలేమని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇదే కాలనీలను మెరక చేస్తున్నామని ఏకంగా 2,200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ముంపు సమస్య మాత్రం వీడలేదు. కొన్ని చోట్ల పొలాలకు, చెరువులకు, నివాస స్థలాలకు మధ్య తేడా తెలియడం లేదు. కోట్ల రూపాయలతో వేసిన రోడ్లూ కోతకు గురయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇళ్ల స్థలాల కోసం ఎంపిక చేసిన జగనన్న కాలనీల్లో మెరక, చదును పనుల్ని నాణ్యంగా చేయకపోవడం వల్ల వరద ఎక్కడికక్కడ ముంచేస్తోంది.

విశాఖ నగరంలో పేదలకు ఇళ్ల కోసం తంగుడుబిల్లిలో వేసిన లే అవుట్‌ పరిస్థితి అధ్వన్నంగా తయారైంది. కాలనీలో 80శాతం ఇళ్లకు సిమెంట్ బీమ్‌లు పునాదులుగా వేశారు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో కొండపై నుంచి వస్తున్న వరద ప్రవాహం వల్ల పునాదుల కింద మట్టి కొట్టుకుపోయింది. సిమెంట్ భీంలు గాలులో తేలుతూ ప్రమాదకరంగా మారాయి.

కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం కొమరగిరిలో.. జగనన్న లేఅవుట్​లకు 2020 డిసెంబర్ 25న సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. ఇప్పుడు అది పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. ఎక్కడ ఏం ఉందో తెలియాని పరిస్థితి ఉంది. దాన్ని చూస్తుంటే నిండు కుండలా మారిన చెరువుల కనిపిస్తోంది. ఇక్కడ 16,601మందికి ఇళ్లు కేటాయించారు. రెండున్నరేళ్లుదాటినా కేవలం 40 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. వర్షాలకు ఈ లేఅవుట్‌ను చెరువును తలపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా హిరమండలం మేజర్ పంచాయతీలోని జగనన్న గృహ నిర్మాణ లేఅవుట్లు వర్షపు నీరులో మునిగిపోయాయి. ఓవైపు వంశధార నది.. మరోవైపు వంశధార కాలువ ఉండడంతో.. ఇక్కడ సుమారు 3అడుగుల ఎత్తులో నీరు నిలిచింది.

"కాకినాడ ప్రజలకు కాకినాడకు దగ్గర్లో ఇవ్వకుండా 18కిలో మీటర్ల దూరం తీసుకువచ్చి ఇక్కడ ఇచ్చారు. ఇచ్చే సమయంలోనే.. ఇది సరైన ప్రదేశము కాదని చెప్పాము. సముద్రం ఉప్పోంగుతుంది అని కూడా గుర్తుచేశాము." -లబ్దిదారులు

విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పేదల కోసం ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో జి.కొండూరు మండలం వెలగలేరు పరిధిలో ఉన్న ఈ ప్రాంతానికి రహదారి సౌకర్యం లేదు. బుడమేరు పొంగితే రాకపోకలు నిలిచిపోతాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు లేఅవుట్‌ ఇలా తయారైంది. మొకాలు లోతు నీరు నిలిచింది.

ఇకా మచిలీపట్నం జిల్లాలోనే అతిపెద్ద లేఅవుట్‌ గురించి చెప్పనవసరం లేదు. దానిని చూస్తుంటే చెరువో, పంటపొలమో అనిపించేంతలా మారిపోయింది. బందరు నియోజకవర్గంలో కరగ్రహారం ఏర్పాటుచేసిన ఈ లేఅవుట్‌లో 15వేల 998 మందికి సెంటుచొప్పున కేటాయించారు. ఇక్కడ ఇంటి నిర్మాణం చేయడం గగనంగా మారింది.

పెనమలూరు మండలం వణుకూరులో లేఅవుట్‌ మొత్తం మునిగింది. ఇళ్ల నిర్మాణం తీసుకొచ్చిన సిమెంట్, ఐరన్ నీటిలో నానుతోంది. ఇక్కడ ఇళ్లు ఎలా కట్టుకోవాలో తెలియడం లేదని లబ్దిదారులు వాపోతున్నారు. ఏలూరు జిల్లా సకలకొత్తపల్లి పంచాయతీ కడిమికుంటలోని జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు గుర్తుపట్టలేని పరిస్థితి నెలకొంది. 4 అడుగుల పైనే నీరు చేరడంతో.. రోడ్లు కానీ, ప్లాట్ల కోసం ఏర్పాటు చేసిన రాళ్లు కానీ కనిపించడం లేదు.

"ఇళ్లు కట్టుకుందామని చూస్తున్నాము. ఇప్పుడు నీళ్లతో మునిగిపోయాయి. నెల నుంచి రెండు నెలల వరకు ఈ నీళ్లు తగ్గే పరిస్థితి కనిపించటం లేదు."-లబ్దిదారులు

పెదపాడు మండలం కొణికి గ్రామంలో ఊరి చివర చేపల చెరువులకు వెళ్లే దారిలో జగనన్న కాలనీ ఏర్పాటు చేసి ఇళ్లు కేటాయించారు. ఇది కూడా ప్రస్తుతం మోకాళ్లలోతు నీళ్లలో మునిగి.. అసలు ఏమాత్రం నివాస యోగ్యంగా కనిపించడంలేదు. జిల్లా కేంద్రం నంద్యాలలో జగనన్న కాలనీ ప్లాట్లు నీట మునిగిపోయాయి. కుందునది చెంతనే ఉండడంతో వరద వచ్చినప్పుడు పరిస్థితి ప్రమాదకరంగా ఉంటోందని లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు.

"కుందునది పరివాహక ప్రాంతంలో కాలనీ ఏర్పాటు చేస్తున్నారు. వర్షాకాలంలో కుందునది, మద్దిలేరు వాగు పొంగే ప్రమాదం ఉంది. ఆ కాలనీలో నివాసం ఉండే వారు వాగు పొంగితే.. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి." -లబ్దిదారులు

కర్నూలు జిల్లా అదోనిలో జగనన్న కాలనీ చెరువును తలపిస్తోంది. ఇందులో 10 వేల మందికి స్థలాలను కేటాయించారు. వేయి ఇళ్ల వరకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2రోజుల నుంచి కురిసిన వర్షాలకు లేఅవుట్ లోని నిర్మాణాలు చెరువులను తలపిస్తున్నాయి. తమ స్థలాలు ఎక్కడో తెలియని పరిస్థితని.. లబ్దిదారులు లబోదిబోమంటున్నారు. ఎమ్మిగనూరులోని శివన్ననగర్ సమీపంలో జగనన్న కాలనీ కింద 1200 ఇళ్లు మంజూరు కాగా వెయ్యి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో 900 ఇళ్లు పునాదుల వరకు నిర్మించారు. వర్షానికి కాలనీలో రెండు అడుగులు మేర నీరు నిలిచింది.

Last Updated :Jul 28, 2023, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.