ETV Bharat / state

No compensation for Jagananna Colonys : పరిహారం.. పరిహాసం..! జగనన్న కాలనీ నిర్వాసిత రైతుల ఎదురుచూపులు

author img

By

Published : Jun 10, 2023, 7:07 AM IST

Updated : Jun 10, 2023, 10:31 AM IST

జగనన్న కాలనీ నిర్వాసిత రైతుల ఎదురుచూపులు
జగనన్న కాలనీ నిర్వాసిత రైతుల ఎదురుచూపులు

No compensation for Jagananna Colony lands : పేదలకు సొంతింటి కల నిజం చేస్తామంటూ గొప్పలు చెబుతున్న ప్రభుత్వం దానికోసం మరో పేద రైతు పొట్టకొట్టింది. ఇళ్ల స్థలాల పంపిణీకి భూములు తీసుకుని మూడేళ్లవుతున్నా... ఇప్పటికీ పరిహారం సొమ్ము చెల్లించలేదు. నమ్మకం కలిగించేందుకు కొద్దిమంది రైతులకు తొలివిడత పరిహారం చెల్లించిన అధికారులు... మిగిలిన వారి ఊసే ఎత్తడం లేదు. సర్కార్‌ సొమ్ము వస్తుందన్న భరోసాతో అప్పులు చేసిన రైతులు... ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వాన్ని నమ్మి రోడ్డునపడ్డామంటున్న తిరుపతి జిల్లా రైతులపై ప్రత్యేక కథనం.

No compensation for Jagananna Colony lands : పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నాం... ఇళ్లను కాదు కాలనీలనే నిర్మిస్తున్నామంటూ ఆర్భాటపు ప్రకటనలతో ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీల నిర్మాణం పేద రైతుల పాలిట శాపంగా మారింది. రైతుల నుంచి జగనన్న కాలనీల కోసం ప్రభుత్వం సేకరించిన భూములకు మూడేళ్లు గడుస్తున్నా పరిహారం చెల్లించలేదు. దీంతో సాగు చేసుకోవడానికి భూములు లేక పరిహారం అందక అన్నదాతలు దుర్భర జీవితం గడుపుతున్నారు. మూడేళ్ల కాలంలో పంటల రూపంలో రావాల్సిన ఆదాయం కోల్పోగా... పరిహారం అందక జీవనం సాగించడానికి చేసిన అప్పులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జగనన్న కాలనీల కోసం సేకరించిన భూములకు పరిహారం అందక ఇబ్బందులు పడుతున్న అన్నదాతలపై ఈటీవీ ప్రత్యేక కథనం.

జగనన్న కాలనీ నిర్వాసిత రైతుల ఎదురుచూపులు

పెద్ద పెద్ద ప్రకటనలు.. పేదలకు పెత్తందార్లకు మధ్య యుద్ధం... పేదల పక్షాన నేనున్నా.. నా ఎస్సీలు... నా బీసీలు... నా మైనారిటీల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నా అంటూ ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి.. అదే పేదల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. తన పేరుతో నిర్మిస్తున్న కాలనీలకు చిన్న, సన్నకారు రైతుల నుంచి సేకరించిన భూములకు మూడేళ్లు గడుస్తున్నా పరిహారం చెల్లించడం లేదు. పరిహారం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం లేదని... వారం రోజుల్లో మీ ఖాతాల్లో నిధులు జమ అవుతాయంటూ అధికారులు కార్యాలయాలు చుట్టూ తిప్పుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ పరిహారం అందక సాగుచేసుకోవడానికి భూములు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

20మందికే పరిహారం.. తిరుపతి జిల్లా ఊరందూరు పరిధిలో జగనన్న కాలనీ కోసం ఏర్పేడు మండలం పొగలి రైతుల నుంచి 130.08 ఎకరాలు సేకరించారు. ఒక్కో ఎకరాకు పదిహేనున్నర లక్షల రూపాయల చొప్పున 31.33 కోట్ల రూపాయల పరిహారం చెల్లించడానికి అధికారులు రైతులను ఒప్పించారు. 80 మంది రైతుల నుంచి భూములు సేకరించగా 20 మందికి మాత్రమే పరిహారం చెల్లించారు. మిగిలిన రైతులు పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు.

ఆదాయం లేక అవస్థలు.. జగనన్న కాలనీల కోసం ప్రభుత్వం భూసేకరణకు ముందు రైతులు మినుములు పండించేవారు. మినుమలు సాగుచేయడం ద్వారా ఎకరాకు లక్ష నుంచి లక్షన్నర రూపాయల వరకు ఆదాయం వచ్చేదని రైతులు తెలిపారు. మూడేళ్లుగా పంటలు సాగు చేయకపోవడంతో దాదాపు ఐదు లక్షల రూపాయలు పంట రూపంలో వచ్చే అదాయాన్ని కోల్పోయామని... వ్యవసాయం లేక, పరిహారం అందక అప్పులపాలవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మూడేళ్లుగా ఎదురుచూపులు.. ఇంటి అవసరాల కోసం తెచ్చిన అప్పులు పంట చేతికి వచ్చాక తీర్చే వారమని, గత మూడేళ్లుగా పంటలు లేక కూలీలుగా మారిపోయామని రైతులు వాపోయారు. కుటుంబ పోషణ, పిల్లల చదువుల కోసం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. అప్పులు ఇచ్చిన వ్యక్తులు ఇళ్ల మీదకు వచ్చి నానా దర్భాషలాడుతున్నారని, కోర్టుకు ఈడుస్తామని బెదిరిస్తున్నారంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భూ సేకరణ పరిహారం దాదాపు 91 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది.

Last Updated :Jun 10, 2023, 10:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.