ETV Bharat / state

చదువులో గోల్డ్‌మెడలిస్ట్.. "కిక్" సినిమాను రిపీట్ చేశాడు!

author img

By

Published : Jul 6, 2022, 3:57 PM IST

"కిక్" సినిమా చూశారా? అందులో హీరోకు ఏ పనిలోనూ కిక్కు రాదు. సూపర్ టాలెంట్ ఉంటుంది. కానీ, ఏ ఉద్యోగంలో చేరినా.. నెల రోజులకన్నా ఎక్కువ పనిచేయడు. చివరాఖరికి దొంగతనాలు చేయడంలో కిక్కు వెతుక్కుంటాడు! ఇప్పుడు మనం చెప్పుకుంటున్న స్టోరీలో ఘనుడు కూడా ఇదే రకానికి చెందిన అదోరకం మనిషి. చదువులో అద్భుతమైన ప్రతిభావంతుడు. ఏకంగా.. MBAలో గోల్డ్ మెడల్ సాధించాడు! కానీ.. పని చేయడానికి బద్ధకించాడు! దొంగతనంలో కిక్ వెతుకున్నాడు..! సీన్ కట్ చేస్తే.. ఏకంగా 200 చోరీలు చేశాడు!!

thief
thief

ఇతని పేరు వంశీకృష్ణ.. ఊరు గుంటూరు.. ఎంబీఏ చదివాడు.. ఏకంగా గోల్డ్ మెడల్ సాధించాడు. కానీ.. ఉద్యోగానికి బదులు.. క్యాబ్ డ్రైవింగ్ వృత్తిని ఎంచుకున్నాడు! ఇంతవరకూ బాగానే ఉంది. ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేదుకావొచ్చు.. స్వతంత్రంగా జీవించాలనే కాంక్షఉంది కావొచ్చు.. అని సరిపెట్టుకోవచ్చు. కానీ.. డ్రైవింగ్ వృత్తిలో కొనసాగుతూ.. దొంగతనాలు చేయడం ప్రవృత్తిగా ఎంచుకున్నాడు..!

జల్సాల కోసం : వంశీకృష్ణ 2004లో ఎంబీఏ పూర్తి చేశాడు. ఆ తర్వాత జల్సాలకు అలవాటు పడి, సులభంగా డబ్బు సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు దొంగతనాలే సరైన మార్గమని డిసైడ్ చేసుకున్నాడు. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలు మొదలుపెట్టాడు. తెలంగాణలోని హైదరాబాద్‌ నగరంతోపాటు ఆంధ్రప్రదేశ్​లోని పలు జిల్లాల్లోనూ దొంగతనాలకు పాల్పడ్డాడు. 2006 నుంచి ఇప్పటివరకు 200 ఇళ్లలో దొంగతనాలు చేశాడంటే.. చోరీల్లో ఎంతగా ఆరితేరాడో అర్థం చేసుకోవచ్చు.

ఎన్నో కేసులు : రెండు వందల చోరీలు చేసిన వంశీకృష్ణ.. పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. అయినా.. చోరీలు చేయడం మాత్రం మానలేదు. దొంగతనాలు చేస్తూ పట్టుబడడం.. జైలుకు వెళ్లి రావడం.. తిరిగి కొనసాగించడం.. ఇదే పద్ధతి కొనసాగిస్తున్నాడు నిందితుడు. ఇప్పటి వరకూ వివిధ కేసుల్లో సుమారు 67 నెలల జైలుశిక్ష అనుభవించాడు. అంతేకాడు.. ఇతనిపై పోలీసులు రెండుసార్లు పీడీ యాక్ట్‌ కూడా నమోదు చేశారు.

ఇప్పుడు మరోసారి : తాజా​గా మరో కేసులో హైదరాబాద్‌లోని గాంధీనగర్‌ పోలీసులకు చిక్కాడు. ఇతనికి సంబంధించిన వివరాలన్నీ.. ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌రావు తెలిపారు. గుంటూరుకు చెందిన మిక్కిలి వంశీకృష్ణకు పలు మారుపేర్లు ఉన్నాయని చెప్పారు. లోకేశ్‌, సామ్‌ రిచర్డ్‌ పేరుతో.. నగరంలో క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని చెప్పారు. గత నెలలో కవాడిగూడలోని ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసులో వంశీకృష్ణను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 19 తులాల బంగారు నగలు, రూ.3 లక్షల నగదుతోపాటు రెండు సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.