ETV Bharat / state

Guntur Gandhi Park: ఆధునికీకరణ పేరుతో మూసేశారు.. పనులు పూర్తైనా పట్టించుకోవడం లేదు

author img

By

Published : Jun 22, 2023, 5:58 PM IST

Delay in Inauguration of Gandhi Park: ప్రజలకు మానసికోల్లాసం పంచే పార్కులకు గుంటూరులో రాజకీయ గ్రహణం పట్టింది. గాంధీ పార్కుని ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవటమే అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఆధునికీకరణ పనుల పేరిట మూడేళ్లు కాలం గడిపిన పాలకమండలి.. ఇప్పుడు పనులు పూర్తి అయినా.. పార్కుని ప్రారంభించకుండా ఆలస్యం చేస్తోంది. నగరంలో విరివిగా ఎగ్జిబిషన్లకు అనుమతులు ఇచ్చి నిర్వాహకుల నుంచి కమీషన్లు దండుకొనేందుకు.. పార్కుని ప్రారంభించటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

Guntur Gandhi Park
Guntur Gandhi Park

ఆధునికీకరణ పేరుతో మూసేశారు.. పనులు పూర్తైనా పట్టించుకోవడం లేదు

Delay in Inauguration of Gandhi Park: గుంటూరు నగరంలోని గాంధీ పార్కుకి ఎంతో ఘన చరిత్ర ఉంది. స్వాతంత్రోద్యమ సమయంలో గాంధీజీ ఈ ప్రాంతంలోనే సమావేశం ఏర్పాటు చేశారు. మొదట్లో స్వరాజ్ మైదానంగా పిలిచేవారు. ఆ తర్వాత గాంధీ పార్కు అని పేరు పెట్టారు. కొన్ని దశాబ్దాలుగా నగరవాసులకు ఆహ్లాదం, వినోదం పంచటంతో పాటు కార్పోరేషన్​కు ఆదాయం తెచ్చిపెడుతోంది. అలాంటి పార్కుని ఆధునీకరణ పేరిట మూడు సంవత్సరాలకు పైగా మూసివేశారు. రూ.5కోట్లకు పైగా వ్యయంతో పార్కుని తీర్చిదిద్దారు. అయితే అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య పంతాలు.. పట్టింపుల కారణంగా పార్కు ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఆధునికీకరణ పనులు పూర్తై మూడు నెలలైనా ప్రజలకు అందుబాటులోకి రాలేదు.

పార్కుని ప్రారంభించి ఉంటే వేసవి సెలవుల్లో పిల్లలకు ఆటవిడుపుగా ఉపయోగపడేది. పనులు పూర్తయినా రాజకీయ కారణాలతో పార్కు ప్రారంభం కాలేదు. నగరం నడిబొడ్డున మార్కెట్‌ సెంటర్‌లో ఉన్న పార్కు వినియోగంలోకి రాకుండా పోయింది. అధికార పార్టీ నేతల కాసుల యావ కారణంగా పార్కు ప్రారంభించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. పార్కులో సైకిల్‌స్టాండ్‌, ఫుడ్‌కోర్టుల నిర్వహణ టెండర్లు లేకుండా నేరుగా తనకివ్వాలని.. వైసీపీ ముఖ్య ప్రజాప్రతినిధి ఒత్తిడి తెస్తున్నారు. అధికార పార్టీలోని మరికొందరు టెండర్లు పిలవాల్సిందేనని పట్టుబట్టారు. అలాగే కార్పొరేటర్లు అందరి పేర్లు శిలాఫలకంపై ఎక్కించాలని కమిషనర్‌ను కలిసి కోరారు. స్థానిక కార్పొరేటర్ పేరు మాత్రమే ఉండాల్సిన చోట.. అందరి పేర్లు అనేసరికి అధికారులకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. నగరంలో విరివిగా ఎగ్జిబిషన్లకు అనుమతులు ఇచ్చి నిర్వాహకుల నుంచి కమీషన్లు దండుకొనేందుకు.. పార్కుని ప్రారంభించటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

నగరంలోని 10 లక్షల మంది పైగా జనాభాకు ఏకైక ఆటవిడుపునిచ్చే పార్కు ఇదొక్కటే. దశాబ్దాల నుంచి ప్రజలకు సాయం సమయాల్లో, వారాంతాల్లో, సెలవుదినాల్లో ఆహ్లాదం అందించిన పార్కు నిర్వహణ లేక ఐదారేళ్ల నుంచి ప్రాభవం కోల్పోయింది. పార్కు ఆధునీకరించిన తర్వాత ప్రజలకు అందుబాటులోకి తెస్తే పూర్వవైభవం వస్తుందని అంతా భావించారు. కానీ పనులు పూర్తయ్యాక రాజకీయ గ్రహణం పట్టుకుంది. పార్కులో గతంలో ఉన్న సౌకర్యాలతో పాటు మరికొన్ని హంగులను జోడించారు. పిల్లలకు ప్రత్యేకంగా ప్లే ఏరియాను ఏర్పాటు చేశారు. డైనోసార్ బొమ్మను ఆధునికంగా తీర్చిదిద్దారు. స్వతంత్ర పోరాటానికి స్ఫూర్తిగా ఏర్పాటు చేసిన టవర్​కు కొత్త హంగులు అద్దారు.

కొత్త రకం మొక్కలు పెంచారు. పార్కింగ్, ఫుడ్ కోర్టుల కాంట్రాక్టు తనకు ఇవ్వకపోవటంతో సదరు నేత.. పార్కు పనుల్లో అవకతవకలు జరిగాయని.. అందుకు సంబంధించిన ఫైల్లు తన ముందు పెట్టాలని అధికారుల్ని ఆదేశించారు. దీంతో ఉన్నతాధికారులకు ఏం చేయాలో తెలియక పార్కు ప్రారంభాన్ని ఆలస్యం చేస్తున్నారు. పార్కు పనుల్లో అవినీతి జరిగితే తేల్చడానికి విజిలెన్స్‌ విచారణ కోరవచ్చని.. ఆ పని చేయకుండా పార్కు ప్రారంభాన్ని అడ్డుకోవడం ఏమిటనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నాళ్లిలా నిరుపయోగంగా ఉంచుతారని ప్రజలు, ప్రజా సంఘాల వారు ప్రశ్నిస్తున్నారు.

నగర శివార్లలో ఉన్న నగర శివార్లో ఉన్న మానస సరోవరం పార్కు నిర్వహణను గాలికొదిలేశారు. ఇప్పుడు నగరంలో అందరికి అనువైన ప్రదేశంలో ఉన్న గాంధీ పార్కు ఆధునీకరణ తర్వాత కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవటం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటమేనన్న విమర్శలు వస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.