ETV Bharat / state

పార్కులు ఏం చేశాయ్..! పూర్తి కావచ్చిన ఉద్యానవనాలనూ పట్టించుకోని ప్రభుత్వం

author img

By

Published : Dec 31, 2022, 1:02 PM IST

Unfinished Parks: ప్రజల ఆహ్లాదం, ఆనందం కోసం అక్కడ ఉద్యానవనాలు నిర్మించేందుకు కోట్లు ఖర్చుపెట్టారు. నిర్మాణాలు దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. ఈలోగా ప్రభుత్వం మారింది. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చింది. మూడున్నరేళ్లు గడిచినా వాటిపై దృష్టిపెట్టకపోవడంతో ప్రజలకు అందుబాటులోకి రాకుండా నిరుపయోగంగా పడిఉన్నాయి. ఎంతో వ్యయంతో నిర్మితమై.. సర్వాంగ సుందరంగా ముస్తాబైన పార్కులు వాటి శోభను కోల్పోయి వెలవెలబోతున్నాయ. ఇదీ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పార్కుల పరిస్థితి.

Unfinished Parks
అసంపూర్తిగా ఉన్న పార్కలు

Unfinished Parks: పాలకొల్లులోని నారా చంద్రబాబునాయుడు ఉద్యానవనంలో పట్టణవాసులు సాయంత్రం పూట సరదాగా కుటుంబంతో గడిపేందుకు తెలుగుదేశం హయాంలో నిర్మాణం ప్రారంభించారు. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ పార్కులో వాకింగ్ ట్రాక్, పిల్లలు ఆడుకునే జారుడు బల్లలు, ఉయ్యాలలు, వ్యాయామ పరికరాలు, వాటర్ ఫౌంటైన్‌.. ఇలా ఎన్నో వసతులు సమకూర్చారు. గ్రామీణ వాతావరణాన్ని తలపించే బొమ్మలతో పాటు వివిధ రకాల కళాఖండాలను సుందరంగా తీర్చిదిద్దారు.

కోట్ల రూపాయలు ఖర్చుచేసి నిర్మించిన ఈ ఉద్యానవనంలో.. చిన్న చిన్న పనులు పూర్తిచేస్తే ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ప్రభుత్వం మారాక ఈ పార్కును పట్టించుకోకపోవడంతో పార్కులో వాకింగ్ ట్రాక్ దెబ్బతింది. కూర్చునేందుకు ఏర్పాటు చేసిన కుర్చీలు విరిగిపోయాయి. పిల్లలు ఆడుకునే పరికరాలు సైతం పాడైపోయాయి. ఎంతో అందంగా తీర్చిదిద్దిన విగ్రహాలు రంగు వెలసి పోగా కొన్ని విరిగిపోయాయి. పనులు అసంపూర్తిగా ఉన్నాయనే కారణంతో పార్కులోకి ప్రజలను అనుమతించడం లేదు. దీంతో ఎప్పుడు చూసినా ఈ ఉద్యానవం గేటు మూతబడి కనిపిస్తోంది.

తెలుగుదేశం హయాంలో ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా ఉన్న నిమ్మల రామానాయుడు.. పట్టుదల, కృషితో అబ్దుల్ కలాం పార్కు, కైలాస వనాలను అభివృద్ధి చేశారు. పట్టణంలోని శంభుని చెరువు ప్రాంతాన్ని అందమైన ఆరోగ్య ఉద్యానవనంగా తీర్చిదిద్ది అబ్దుల్ కలాం హెల్త్ పార్క్ అని పేరు పెట్టారు. పట్టణ ప్రజలు ఇక్కడ ఉదయం, సాయంత్రం నడకతో పాటు వ్యాయామం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. చెరువు చుట్టూ నడక మార్గం, సేదతీరేందుకు కుర్చీలు ఉన్నాయి. చిన్నపాటి పనులు పూర్తి చేసి పార్కును అందుబాటులోకి తీసుకురావాల్సిన అధికారులు.. రోడ్డు మరమ్మతుల కారణంగా పార్కులోకి అనుమతి లేదంటూ బోర్డు పెట్టి ఇందులోకి ఎవరినీ రానివ్వడం లేదు. శ్మశానమా లేక ఉద్యానవనమా అనుకునేలా మహా నగరాలకు దీటుగా నిర్మించిన కైలాస వనం సైతం సర్వాంగ సుందరంగా తయారైంది.

పాలకొల్లు పట్టణ వాసుల కోసం గత ప్రభుత్వంలో.. ప్రజల కోసం ఎన్నో కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఈ నిర్మాణాలు.. చిన్నపాటి మరమ్మతులకు నోచుకోక వెలవెలబోతున్నాయి. ఏళ్ల తరబడి నిర్వహణ లేక వాటి శోభను కోల్పోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. ఈ పార్కుల్లో అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

"ఇంత అందమైన పార్కు, అంత చక్కటి కైలాస వనం.. వాకింగ్ ట్రాక్.. ఇంత చక్కగా రామానాయుడు గారు చేస్తారని మేము కూడా ఊహించలేదు. మేమే ఆశ్చర్యం చెందే విధంగా ఇవన్నీ అభివృద్ధి చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తూ ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి వచ్చేలోపే.. ప్రభుత్వం మారడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన పనులను వీళ్లు అభివృద్ధి చేసుకుంటూ.. వెళ్తారనుకున్నాం. కానీ ఎక్కడ వేసినవి అక్కడే ఉండి పోయాయి. దీంతో నిరుపయోగంగా ఉండి పోతున్నాయి". - వెంకటేశ్వరరావు, పాలకొల్లు

"మూడున్నర ఏళ్లలో కూడా అలాగే ఉన్నాయి. 80 శాతం పనులు అయిపోయాయి. రామానాయుడు గారికి పేరు వస్తది అనే కారణంతో మిగతా 20 శాతం పనులను పూర్తి చేయడం లేదు. పాలకొల్లు ప్రజలు ఏం అయిపోయినా పర్లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు". - సోమశేఖర్, పాలకొల్లు

"వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. చిన్న చిన్న పనులు కూడా ఆపేశారు. మొత్తం నాశనం అయిపోతున్నాయి. 2019 తరువాత అభివృద్ధి చేయలేదు". - ఈశ్వరరావు, పాలకొల్లు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.