ఏపీలో విద్యుత్ ఛార్జీల బాదుడే బాదుడు - ప్రజలపై 1,723 కోట్ల భారం
Published: Nov 19, 2023, 6:45 AM


ఏపీలో విద్యుత్ ఛార్జీల బాదుడే బాదుడు - ప్రజలపై 1,723 కోట్ల భారం
Published: Nov 19, 2023, 6:45 AM

Electricity Charges Increased in AP: ఏ ప్రభుత్వమైనా.. డిమాండ్ ఉన్న సమయంలో విద్యుత్ కొని.. ప్రజలు అవస్థలు పడకుండా చూస్తోంది. కానీ రివర్స్ పరిపాలనలో ప్రసిద్ధ చెందిన వైసీపీ ప్రభుత్వ తీరు మాత్రం అందుకు వ్యతిరేకం. ప్రజలకు కావాల్సిన సమయంలో విద్యుత్ కొనుగోలు ఊసెత్తని జగన్ సర్కార్.. డిమాండ్ తగ్గిన తర్వాత కొంటుంది. అది కూడా స్వల్పకాలిక ఒప్పందాలతో అధిక ధరతో కొంటుంది. దీంతో ప్రజలపై మళ్లీ వందల కోట్ల రూపాయల భారం పడనుంది.
Electricity Charges Increased in AP: రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ భారీగా తగ్గిపోయింది. కానీ వైసీపీ ప్రభుత్వం స్వల్పకాలిక ఒప్పందాల కింద తీసుకునే విద్యుత్‌ను అధిక ధరకు కొంటుంది. ఇలాంటి సమయంలో అదనంగా విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీని ద్వారా కొన్ని విద్యుత్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే టెండరు ఆధారంగా ఒప్పందాలు కుదుర్చుకున్నా.. కొన్ని విద్యుత్ సంస్థలకు యూనిట్‌కు 9 రూపాయల చొప్పున చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడం వెనుక ఏదో మతలబు ఉందని నిపుణులు సందేహిస్తున్నారు.
విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు విద్యుత్ డిమాండ్ సర్దుబాటు కోసం అక్టోబరు నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు 3 వేల 8 వందల30 మిలియన్ యూనిట్ల కరెంటు తీసుకోవాలని డిస్కంలు నిర్ణయించాయి. అదనపు విద్యుత్ కొనుగోళ్లకు డిస్కంలు టెండర్లు పిలిచి.. ఇతర రాష్ట్రాల్లోని 8 విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఖరారైన బిడ్ల ఆధారంగా కనిష్ఠంగా యూనిట్‌కు 7 రూపాయలు, గరిష్ఠంగా 9 రూపాయలు పెట్టి డిస్కంలు కొంటున్నాయి.
Power Charges Increase in AP: ఈ లెక్కన సగటున యూనిట్‌కు 7 రూపాయల 80 పైసల వంతున ప్రభుత్వం చెల్లిస్తోంది. డిస్కంల స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా విద్యుత్‌ను అధిక ధరకు కొనడం వల్ల ప్రజలపై దాదాపుగా 17 వందల 23 కోట్ల రూపాయలకు పైగా అదనపు భారం పడుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి బహిరంగ మార్కెట్‌లో యూనిట్ విద్యుత్‌ను 4 రూపాయల 80 పైసల వంతున కొనడానికి డిస్కంలకు ఏపీఈఆర్సీ అనుమతించింది.
ఏపీఈఆర్సీ అనుమతించిన ధరతో పోలిస్తే డిస్కంలు 3 రూపాయల చొప్పున అధికంగా చెల్లిస్తున్నాయి. జెన్‌కోకు యూనిట్‌కు సుమారు రూపాయిన్నర వంతున చెల్లించే స్థిర ఛార్జీలతో కలిపి యూనిట్‌కు అదనంగా 4 రూపాయల 50 పైసలు డిస్కంలు ఖర్చు చేస్తున్నట్లే అవుతుంది. ఈ మొత్తాన్ని సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రతి నెలా బిల్లులో యూనిట్‌కు 40 పైసల వంతున ప్రభుత్వం ప్రజల నుంచి ఇప్పటికే వసూలు చేస్తోంది.
మిగిలిన మొత్తాన్ని ఏడాది చివర్లో లెక్కగట్టి ట్రూఅప్ పేరుతో వసూలు చేయనుంది. రాష్ట్రంలో విద్యుత్‌కు భారీగా డిమాండ్ ఉన్న సమయంలో విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోలేదు. గంటల పాటు విద్యుత్ కోతలు విధించి.. ప్రజలకు నరకాన్ని చూపించింది. బహిరంగా మార్కెట్‌లో కొందామన్నా.. విద్యుత్ దొరకడం లేదంటూ చెప్పుకొచ్చింది. వాతావరణం చల్లబడిన తర్వాత అధిక ధరకు అడ్డగోలుగా విద్యుత్ కొనుగోలు చేసి.. ట్రూఅప్, ఎఫ్‌పీపీసీ పేర్లతో భారాన్ని ప్రజలపై వేసిన వాళ్లు మారు మాట్లాడకుండా కట్టేస్తారని ప్రభుత్వం భావిస్తోందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అదనపు విద్యుత్ అందుబాటులో ఉండటంతో వార్షిక నిర్వహణ కోసం కొన్ని జెన్‌కో థర్మల్ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేశారు. వాటి నుంచి తీసుకునే యూనిట్ విద్యుత్‌కు 5 రూపాయల 29 పైసలు మాత్రమే డిస్కంలు చెల్లిస్తున్నాయి. ఈ ధరతో పోల్చినా.. స్వల్పకాలిక ఒప్పందాలతో తీసుకునే యూనిట్ విద్యుత్‌కు అదనంగా 2 రూపాయల 51 పైసల వంతున ప్రజలపై అదనంగా భారం వేసినట్లే అవుతుంది. ట్రూఅప్, ఇంధన సర్దుబాటు ఛార్జీలు, ఇతర పేర్లతో ఏటా 10 వేల కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రభుత్వం ప్రజలపై వేస్తుంది. దీని వల్ల నెల నెలా వేల రూపాయల్లో వస్తున్న బిల్లులు కట్టలేక ప్రజలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు స్వల్పకాలిక ఒప్పందాల వల్ల పడే 17 వందల 23 కోట్ల రూపాయల అదనపు భారం కూడా ప్రజలపై మోపనుంది.
