మారుతున్న గడువులు.. మారని పేదల బతుకులు

author img

By

Published : Mar 11, 2023, 9:24 AM IST

Housing Scheme

Condition of Housing Scheme: పట్టణ పేదల ఇళ్ల నిర్మాణం విషయంలో.. ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లుంది ప్రభుత్వ వైఖరి. నవరత్నాలు -పేదలందరికీ ఇళ్ల పథకం కింద చేపట్టిన పట్టణ గృహ నిర్మాణం లక్ష్యం.. నెరవేరడం లేదు. ఈ ఉగాది నాటికి 5 లక్షల గృహాలు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. అదీ నెరవేరేలా లేదు. నిర్దేశిత గడువుకు మరో 11 రోజులే ఉన్నా.. ఇప్పటికీ 3.10 లక్షల ఇళ్లే పూర్తయ్యాయి. ఏప్రిల్‌లో 3 లక్షల గృహాలను ప్రారంభించబోతున్నట్లు.. శుక్రవారం నాటి ఎస్​ఎల్​బీసీ సమావేశంలో.. ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.

పట్టణ పేదల ఇళ్ల నిర్మాణం.. ఎప్పటికి పూర్తయ్యేనో..?

House Scheme in Andhra Pradesh: పట్టణ పేదల కోసం ఇళ్ల నిర్మాణానికి 2020 డిసెంబర్‌లో శంకుస్థాపన జరిగింది. మొదటి విడతగా చేపట్టిన 15.60 లక్షల గృహాలను 2022 మార్చినాటికి పూర్తిచేస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఆ గడువును 2022 డిసెంబర్‌కు పొడిగించినా లక్ష్యం మాత్రం చేరలేదు. గతేడాది డిసెంబర్‌ నాటికి 15.60 లక్షల ఇళ్లు పూర్తయ్యేలా లేవని ముందుగానే అంచనాకు వచ్చిన ప్రభుత్వం.. అదే గడువుకు కనీసం 5 లక్షల ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించింది.

ఇందులో టిడ్కో గృహాలు లక్షా 50 వేలు ఉన్నాయి. ఆ లక్ష్యం కూడా నేరవేరకపోగా.. వర్షాల కారణంగా పనులు మందగించాయని అప్పట్లో ప్రభుత్వం వెల్లడించింది. ఆ తర్వాత ఈ ఉగాదికి గడువును మార్చారు. టిడ్కో ఇళ్లతో పని లేకుండా జగనన్న కాలనీల్లో చేపట్టే ఇళ్లు... 5 లక్షలు పూర్తిచేయాలని అప్పట్లో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటివరకు 3.10 లక్షల ఇళ్లు పూర్తికాగా... రూఫ్‌ కాస్ట్‌ స్థాయిలో 70 వేలు, రూఫ్‌ స్థాయిలో మరో 70 వేల గృహాలున్నాయి.

ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులపై ఎంత ఒత్తిడి చేస్తున్నా.. వారు ముందుకు రావడం లేదు. ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం ఇచ్చే లక్షా 50 వేలతో కలిపి మొత్తం లక్షా 80 వేల రూపాయలు ఇస్తున్నా.. అవి ఏ మాత్రం సరిపోవనే ఆలోచనతో.. చాలా మంది ఆసక్తి కనబర్చడం లేదు. అలాగే లబ్ధిదారులు ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతాలకు చాలా దూరంగా ఇళ్ల స్థలాలు కేటాయించడం వల్ల కూడా.. చాలా మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి తటపటాయిస్తున్నారు.

పట్టాలు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నా చాలా మంది ముందుకు రావడం లేదు. హౌసింగ్ డే పేరుతో ప్రతి శనివారం కలెక్టర్‌ నుంచి గృహనిర్మాణ శాఖ ఏఈ వరకు కాలనీల్లో పర్యటిస్తున్నా.. పెద్దగా ఫలితం కనిపించడం లేదు. 6 నెలలకోసారి ప్రభుత్వం కొత్త లబ్ధిదారులకు స్థలాలిచ్చి.. ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు లెక్కలు చూపుతోంది. కానీ మొత్తం లబ్ధిదారుల సంఖ్య మాత్రం పెరగడం లేదు.

వివిధ కారణాలతో ఇళ్లు కట్టుకోని వారి పేర్లను జాబితా నుంచి తీసేసి వారి స్థానంలో కొత్తవారి పేర్లను చేరుస్తోంది. దానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా తీసుకుంటోంది. ఇప్పటిదాకా దాదాపు లక్షకుపైగా ఇళ్ల లబ్ధిదారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించి కొత్తవారికి ఇచ్చినట్లు సమాచారం. దీనిపై గృహనిర్మాణశాఖ అధికారుల్ని వివరణ కోరగా.. గత రెండు నెలల నుంచి ఇళ్ల నిర్మాణంలో వేగం పెరిగిందని చెబుతున్నారు. రోజుకు 2 వేల 500 ఇళ్లు పూర్తవుతున్నాయని అంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.