ETV Bharat / state

Arya Vaishya Atmiya Sammelanam ఆర్యవైశ్య సమ్మేళనం..! వైసీపీ, టీడీపీ నేతలు ఏమన్నారంటే..?

author img

By

Published : Jul 2, 2023, 9:12 PM IST

Arya Vaishya Atmiya Sammelanam
ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం

Arya Vaishya Atmiya Sammelanam: రాజకీయ లబ్ది కోసం ఆర్యవైశ్య మహాసభపై విమర్శలు చేయడం సరికాదని వైసీపీ నాయకులు అన్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులపై దాడులు పెరిగాయని.. దేవాలయాలకు రాజకీయ రంగు పులుముతున్నారన్నారని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో టీడీపీ, విజయవాడలో వైసీపీ నేతలు.. ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

Arya Vaishya Atmiya Sammelanam: రాజకీయ లబ్ది కోసం ఆర్యవైశ్య మహాసభపై విమర్శలు చేయడం, అగౌరవపరచరడం సరికాదని.. ఆర్యవైశ్య మహాసభ నాయకులు అన్నారు. విజయవాడలో ఆర్యవైశ్య మహాసభ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సమ్మేళనానికి శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, అన్నా రాంబాబు సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనతో ఆర్యవైశ్యులు తీవ్రంగా నష్టపోయారని.. హైదరాబాద్​లో ఆర్యవైశ్య మహాసభకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయన్నారు. విజయవాడలో ఆర్యవైశ్య మహాసభ నూతన భవనం నిర్మాణం జరుగుతుందన్నారు.

రాజకీయ లబ్ది కోసం కొంతమంది ఆర్యవైశ్యులు, పదవులు దక్కని వారు.. ఆర్యవైశ్య మహాసభపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిందన్నారు. అందులో భాగంగా ఆర్యవైశ్యులకు కన్యకాపరమేశ్వరి ఆలయాల సత్రాలను అప్పగించారన్నారు. ఆర్యవైశ్యుల మనోభావాలను గౌరవించి చింతామణి నాటకాన్ని రద్దు చేశారని గుర్తు చేశారు. చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నా భవిష్యత్​లో అందరినీ కలుపుకుని వెళ్తామన్నారు.

"రాజకీయ లబ్ది కోసం కొంత మంది ఆర్యవైశ్యులను అగౌరపరిచేలా మాట్లాడుతున్నారు. మహాసభను తక్కువగా చేసి మాట్లాడుతున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము". - కోలగట్ల వీరభద్రస్వామి, శాసనసభ ఉపసభాపతి

గుంటూరులో టీడీపీ నేతల ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం: ఆర్యవైశ్యుల ఆస్తుల సంరక్షణకు ప్రతీ ఒక్కరూ ఐక్యతతో ముందుకు సాగాలని తాళ్లాయపాలెం పీఠాధిపతి శివస్వామి అన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సమ్మేళనం గుంటూరు నగరంలో జరిగింది. ఆర్యవైశ్యుల సత్రాలు, దేవాలయాల ఆస్తుల జోలికి ఎవరూ వచ్చినా ఉపేక్షించేది లేదన్నారు. రాష్ట్రంలో స్వామిజీ వ్యవస్థ నుంచి సామన్య వ్యవస్థ వరకు అవినీతి పాతుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాన్ని కూకటివేళ్లతో పెకిలించాలన్నారు. సమర్ధవంతమైన నాయకులు ఏ పార్టీలో ఉన్నా సరే వారు ఆర్యవైశ్యులైతే తప్పకుండా గెలిపించుకోవాలని శివస్వామి కోరారు.

దేవాలయాలకు రాజకీయ రంగు: రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డుండి రాకేష్‌ అన్నారు. దేవాలయాలకు సైతం రాజకీయ రంగు పులుముతున్నారన్నారు. అందుకు నిదర్శనం గుంటూరులోని కన్యకాపరమేశ్వరి ఆలయమన్నారు. వైశ్యులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని రాకేష్ పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లాకు కొణిజేటి రోశయ్య పేరు పెట్టాలని అందుకు పోరాటానికి సిద్ధం కావాలన్నారు. ఆర్యవైశ్యుల ఆస్తులను కాపాడుకోవాలని అన్నారు.

"స్వామిజీ వ్యవస్థ నుంచి సామన్య వ్యవస్థ వరకు మన రాష్ట్రంలో అవినీతి పాతుకుపోయింది. దానిని కూకటివేళ్లతో పెకిలించాలి. సమర్ధవంతమైన ఆర్యవైశ్యులు ఏ పార్టీలో ఉన్నా గెలిపించుకుందాం". - శివస్వామి, తాళ్లాయపాలెం పీఠాధిపతి

Arya Vaishya Atmiya Sammelanam: వేర్వేరుగా టీడీపీ, వైసీపీ.. ఆర్యవైశ్య సమ్మేళనం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.