ETV Bharat / state

Jagananna Videsi Vidya: జగనన్న విదేశీ విద్యలో నిబంధనల మాయ.. అదే లక్ష్యంగా..!

author img

By

Published : May 17, 2023, 8:41 AM IST

Jagananna Videsi Vidya Scheme: విదేశీ విద్యలో అర్హుల సంఖ్యను తగ్గించి డబ్బులు మిగుల్చుకునేందుకు.. ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఏటికేడు కొత్త నిబంధనలు తెస్తూ పేదలను విద్యకు దూరం చేస్తోంది. నిన్న మొన్నటి దాకా.. టాప్‌ 200 విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందితే వారికి సాయం చేస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం..ఇప్పుడు వాటిని 50 విశ్వవిద్యాలయాలకే అంటూ.. మెలిక పెట్టింది.

jagananna videsi vidya
jagananna videsi vidya

జగనన్న విదేశీ విద్యలో నిబంధనల మాయ

Jagananna Videsi Vidya Scheme: విదేశీ విద్య నిధుల విడుదల సమయంలో జగన్ చెప్పిన మాటలకు అర్థాలే వేరులే అన్నుట్లుంది నేడు పరిస్థితి. పిల్లల చదువుకు పేదరికం అడ్డు రాకూడదనే విదేశీ విద్య పథకం తీసుకొచ్చాం అని జగన్‌ అంటే.. దానికి అర్థం పేదలకు విదేశీ విద్యను దూరం చేయడమా అనే సందేహం వస్తోంది. టీడీపీ హయాంలో ఈ పథకం కింద వందలాది మంది విదేశాల్లో చదువుకున్నారు. జగన్‌ అధికారంలోకి రాగానే..ఆ పథకంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ నిలిపివేశారు.

మూడు సంవత్సరాల పాటు విదేశీ విద్యను ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద విద్యార్థులకు దూరం చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరుతో ఉన్న ఈ పథకానికి ఆ పేరును తొలగించి జగన్‌ తన పేరు పెట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా టాప్‌ 200 వర్సిటీల్లో చదివే వారికే సాయం అందిస్తామనే నిబంధన విధించారు. ఇప్పుడు దీన్ని టాప్‌-50 వర్సిటీలకు పరిమితం చేసి, పేదలకు అవకాశాలు అందకుండా చేశారు.

విజయవాడకు చెందిన మైనారిటీ విద్యార్థి గత సంవత్సరం అక్టోబర్‌లో యూనివర్శిటీ ఆఫ్‌ షఫీల్డ్‌లో ఎంబీఏ కోర్సుకు దరఖాస్తు చేశారు. ఆ విశ్వవిద్యాలయం అప్పట్లో క్యూఎస్‌ ర్యాంకింగ్‌లో 96వ స్థానంలో ఉంది. ఆ కోర్సుకు విశ్వవిద్యాలయం ఇంటర్వ్యూ చేసి.. భారత్‌ నుంచి ఎంపిక చేసిన ఇద్దరిలో విజయవాడ విద్యార్థి ఒకరు. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో విశ్వవిద్యాలయంలో చేరాలి. రెండో విడత విదేశీ విద్యకు దరఖాస్తు చేసేందుకు ప్రయత్నిస్తే.. అప్పటికే నిబంధనలు మారిపోయాయి. టాప్‌ 50 ర్యాంకుల్లో ఉన్నా అక్కడ ఎంబీఏ కోర్సు బదులు ఆర్కిటెక్చర్‌ అండ్‌ బిల్డ్‌ ఎన్విరాన్‌మెంట్‌కు మాత్రమే ప్రభుత్వం అవకాశమిచ్చింది. దీంతో ఆ పేద విద్యార్థి ఆశలన్నీ అడియాశలయ్యాయి. రాష్ట్రంలో చాలా మంది పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

విదేశీ విద్యలో అర్హుల సంఖ్యను తగ్గించి, డబ్బులు మిగుల్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇష్టారాజ్యంగా నిబంధనలు తీసుకొస్తూ పేదవారిని విదేశీ విద్యకు దూరం చేస్తోంది. ఏటికేడు కొత్త నిబంధనలతో అభ్యర్థులను అయోమయానికి గురి చేస్తోంది. సాధారణంగా విదేశాలకు వెళ్లే ఏపీ విద్యార్థులు టాప్‌ 400లోపు ఉన్న వర్సిటీల్లోనే ఎక్కువగా చదువుతున్నారు. మంచి ఉద్యోగాలు సాధిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఒకసారి టాప్‌-200 అని, ఇప్పుడు సబ్జెక్టుల వారీగా టాప్‌-50 వర్సిటీల్లో ప్రవేశాలని నిబంధనలు పెడుతోంది. ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విదేశీ విద్య అవకాశం లభించేలా సరళతర నిబంధనలు పెట్టకుండా సబ్జెక్టుల వారీగా అనే నిబంధన ఎందుకనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది.

రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లే వారిలో ఎక్కువ మంది ఇంజినీరింగ్‌కు వెళ్తారు. మిగతా సబ్జెక్టుల్లో తక్కువగా ఉంటారు. అయితే విద్యార్థులెవరూ ఎంపిక చేసుకోని సబ్జెక్టులను సైతం లెక్కల్లో చూపుతూ విశ్వవిద్యాలయాల సంఖ్య పెంచినట్లు ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ఏపీలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు టాప్‌ 50 విశ్వవిద్యాలయాల్లో సీట్లు లభించడం చాలా కష్టం. ప్రస్తుతం వీటిలో ప్రవేశాలు పొందుతున్న రాష్ట్ర విద్యార్థుల సంఖ్య 3శాతం లోపే. ప్రభుత్వం ప్రకటించిన సబ్జెక్టుల్లో ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌కు రాష్ట్రం నుంచి వెళ్లేవారు భూతద్దం పెట్టి వెతికినా కనిపించరు. ఫైనాన్స్, ఎకౌంటింగ్, డిజైన్, ఆర్ట్, నేచురల్‌ సైన్స్, ఎకనామెట్రిక్స్‌, ఎకనామిక్స్ లాంటి కోర్సులను ఎంపిక చేసుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలాంటి సబ్జెక్టులకు సైతం 50 వర్సిటీల చొప్పున చూపి, 379 విద్యాసంస్థలు, వర్సిటీల్లో అవకాశం కల్పించామని ప్రభుత్వం ఆర్భాటం చేస్తోంది.

ఆ కోర్సులకు వెళ్లేవారేరి?: విజయవాడ, గుంటూరు, హైదరాబాద్‌ల్లో బ్రాంచిలు కలిగిన ఓ కన్సల్టెన్సీ ఆరు దేశాలకు సంవత్సరానికి సుమారు 2వేల 500 నుంచి 3 వేల మంది విద్యార్థులను విదేశీ విద్య కోసం పంపిస్తుంది. వీటిలో ఆర్ట్స్, ఇతర కోర్సులకు వెళ్లేవారు 100 మంది కూడా ఉండరు. ఏపీ నుంచి ప్రతి సంవత్సరం సుమారు 30 వేల మంది వరకు విదేశీ విద్యకు వెళ్తారు. ప్రభుత్వం ప్రకటించిన 21 సబ్జెక్టుల్లో అగ్రికల్చర్‌ అండ్‌ ఫారెస్ట్రీ, ఎకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్, ఆర్ట్‌ అండ్‌ డిజైన్, ఆర్కిటెక్చర్‌ అండ్‌ బిల్డ్‌ ఎన్విరాన్‌మెంట్, ఆర్ట్స్‌ అండ్‌ హ్యుమానిటీస్, కమ్యూనికేషన్‌ అండ్‌ మీడియా స్ట్రాటజీ, బయోలాజికల్‌ సైన్స్, ఎకనామిక్స్‌ అండ్‌ ఎకనామెట్రిక్స్, ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్, నేచురల్‌ సైన్సెస్, ఫిజిక్స్‌ అండ్‌ ఆస్ట్రానమీ, ఇంజినీరింగ్‌- మినరల్స్‌ అండ్‌ మైనింగ్, ఇంజినీరింగ్‌- పెట్రోలియం వంటి 13 సబ్జెక్టులకు వెళ్లేవారు కేవలం 3 శాతమే. ఈ లెక్కన దాదాపు సగం వర్సిటీల్లో ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందేవారే ఉండరు. అభ్యర్థులు ఆసక్తి చూపని సబ్జెక్టుల్లో అవకాశం కల్పించడం ప్రభుత్వం వ్యయాన్ని తగ్గించుకునే ప్రయత్నమేనని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు.

ప్రభుత్వమే నిర్దేశిస్తుందా?: తాజా నిబంధనల ప్రకారం విశ్వవిద్యాలయానికి సంబంధించి నిర్దేశించిన సబ్జెక్ట్‌లో సీటొస్తేనే ఆర్థిక సాయం అందుతుంది. అదే విశ్వవిద్యాలయంలో ఆ విద్యార్థికి నచ్చిన వేరే సబ్జెక్ట్‌లో సీటొచ్చినా సాయం అందదు. విద్యార్థుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఏ కోర్సు చదవాలనేది ప్రభుత్వం నిర్దేశిస్తుందా అని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. గతంలో టాప్‌ 200 క్యూఎస్‌ ర్యాంకింగ్‌ విశ్వవిద్యాలయాల్లో ఏ కోర్సులో చేరినా ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించి, ఇప్పుడు దాన్ని 50 విశ్వవిద్యాలయాలకు కుదించడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.

ఎడాపెడా కోతలు: వైసీపీ అధికారం చేపట్టాక మొదటి మూడు సంవత్సరాలు పథకాన్ని నిలిపేసింది. ప్రతిపక్షాలు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఎట్టకేలకు దానిని అమల్లోకి తెచ్చింది. కానీ కఠిన నిబంధనలు తీసుకొచ్చి ఎడాపెడా కోతలు వేసింది. మొదట క్యూఎస్‌ ర్యాంకింగ్‌ 100 వరకు ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీటు సంపాదిస్తే 100 శాతం ఫీజు భరిస్తామని, 101 నుంచి 200 వరకు ఉన్న విశ్వవిద్యాలయాల్లో 50 శాతం ఫీజు లేదా రూ.50 లక్షలు చెల్లిస్తామని ప్రకటించింది. సాయం పెంచి అమలు చేస్తున్నట్లు ఉత్తుత్తి ఆర్భాటం చేసిందే తప్ప.. మొదటి విడతకు ఎంపికైన విద్యార్థులు నామమాత్రమే. అందులోనూ పేద ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల సంఖ్య మరీ తక్కువ.

మొదటి విడతలో 213 మంది విద్యార్థులకు 19 కోట్ల 95 లక్షల రూపాయలు విడుదల చేసింది. ఇప్పుడు అర్హుల సంఖ్యను తగ్గించేందుకు నిబంధనలను మరింత బిగించింది. టాప్‌ 50 ర్యాంకుల్లో నిలిచిన విశ్వవిద్యాలయాల్లో సీటు సంపాదించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 100 శాతం ఫీజు లేదా 1కోటి 25 లక్షలు రూపాయలు ..ఏది తక్కువైతే అది, ఇతర సామాజికవర్గాల విద్యార్థులకు 100 శాతం ఫీజు లేదా కోటి రూపాయల వరకు అందిస్తుంది. విద్యార్థులకు ఆయా కోర్సుల్లో 60 శాతానికి పైగా మార్కులు ఉండాలి. ఎంబీబీఎస్‌కు వెళ్లాలనుకునేవారు నీట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుందనే నిబంధన పెట్టింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.