ETV Bharat / state

No Jobs in AP: ఇక్కడ చదువులు.. అక్కడ కొలువులు.. ఇదీ రాష్ట్రంలో విద్యావంతుల పరిస్థితి

author img

By

Published : May 8, 2023, 7:00 AM IST

Unemployment in AP
Unemployment in AP

Unemployment in AP: ప్రభుత్వ కొలువులకు నోటిఫికేషన్లే లేవు.. ప్రైవేటులో పని చేద్దామంటే చెప్పుకోదగ్గ పెద్ద సంస్థలూ లేవు. ఫలితంగా రాష్ట్రంలో ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఇక్కడే ఉద్యోగం చేద్దామంటే మాత్రం కూలి పనులే దిక్కవుతున్నాయి.

ఇక్కడ చదువులు.. అక్కడ కొలువులు.. ఇదీ ఏపీలో విద్యావంతుల పరిస్థితి

Unemployment in AP: ఆంధ్రప్రదేశ్​లో ఉన్నత చదువులు చదివినా.. ఉద్యోగం కావాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్లిపోవాలి. ఇక్కడే ఉండాలంటే మాత్రం కూలి పనుల్లాంటివే దిక్కవుతాయి. లేదంటే.. నిరుద్యోగిగా మిగిలిపోవాలి. రాష్ట్రంలో పెద్ద నగరమంటూ లేదు. ఐటీ కంపెనీలు రావు. ప్రభుత్వం ప్రోత్సాహం అందించదు. పరిశ్రమలను తీసుకొచ్చి, ఉపాధి కల్పించే చర్యలు తీసుకోదు. ఇతర రాష్ట్రాలకు ఉద్యోగులను అందించే రాష్ట్రంలా ఏపీ మారిపోయింది.

విద్యాసంస్థల నుంచి బయటకు వస్తున్న యువత ఉద్యోగాల కోసం బస్సులు, రైళ్లు, విమానాలు ఎక్కేస్తున్నారు. కనీసం పీజీ చేయాలన్నా.. ఇతర రాష్ట్రాలు, దేశాలకు తరలిపోతున్నారు. ఎంటెక్‌లో 21 వేలకు పైగా సీట్లు ఉంటే, చేరుతున్న వారు 5వేలలోపే. సాధారణ పీజీ కోర్సుల్లో 37% మందే ప్రవేశాలు పొందడం ఆందోళనకర విషయమే. రాష్ట్రంలో నిరుద్యోగుల్లో 73శాతానికి పైగా పట్టభద్రులే ఉన్నారు.

No Jobs in Andhra Pradesh: సంపాదించే యువశక్తి రాష్ట్రంలో లేకుండా పోతుంటే ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయట్లేదు. రాష్ట్రంలో ఉన్న కంపెనీలు తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోతుంటే.. కొత్తవి ఎలా వస్తాయన్న ఆలోచనా చేయట్లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో సంపాదన లేనివారు, తక్కువ ఆదాయం సంపాదించేవారు, వృద్ధులే రాష్ట్రంలో మిగులుతారు. రాష్ట్రంలో ఉద్యోగం, ఉపాధి అంటే పొరుగుసేవల ఉద్యోగం.. లేదంటే కూలి పనులు, కార్మికులు, నైట్‌ వాచ్‌మన్ల పనులే ఉంటున్నాయి. సీఎంఈ నివేదిక సైతం దీన్నే ధ్రువీకరించింది.

గత రెండేళ్ల సగటు చూస్తే రాష్ట్రంలో లక్ష మంది వరకు బీటెక్‌లో ప్రవేశాలు పొందుతున్నారు. డిగ్రీలోనూ సగటున లక్షన్నర మంది చేరుతున్నారు. వీరిలో 65-70% ఉత్తీర్ణులవుతారు. ఈ లెక్కన లక్షా 75వేల మంది విద్యార్థులు విద్యాసంస్థల నుంచి బయటకు వస్తున్నారు. వీరిలో 35% మందికి ఉద్యోగాలు లభించడం లేదు. మిగతా లక్షా 13వేల మందిలోనూ ఉపాధి కోసం బయట రాష్ట్రాలకు వెళ్లిపోతున్న వారే 95% మంది ఉన్నారు.

మూడు రాజధానుల ప్రకటనతో నిర్మాణ రంగం కుదేలైంది. దీంతో సివిల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఉద్యోగాల్లేవు. స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినడంతో పలు కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. పెద్ద వ్యాపారులు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వెళ్లిపోయారు. పరిశ్రమలు రాకపోవడంతో మెకానికల్‌ ఇంజినీర్లకు ఉద్యోగాలు లేకుండా పోయాయి.

ఏ రాష్ట్రంలోనైనా వివిధ రంగాల్లో 10-15 విశిష్ట విద్యాసంస్థలు ఉంటాయి. మన రాష్ట్రంలో నిట్‌, ఐఐటీ మినహా ఆ స్థాయి విద్యాసంస్థ ఒక్కటీ లేదు. విభజన చట్టం ప్రకారం కేంద్రం కొన్ని విద్యా సంస్థల్ని ఏర్పాటు చేసినా నిధులు, వనరులు సమకూర్చకపోవడంతో అవి ఇప్పటికీ ఆ స్థాయికి చేరలేదు. వాటిలో చదువుకున్న వారికి ఉద్యోగాలు కల్పించేలా రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదు.

ఐటీ పరిశ్రమలకు ప్రోత్సాహం లభించకపోవడంతో కొత్తవి రాకపోగా.. ఉన్నవే రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయాయి. విశాఖలో సుమారు 100 అంకుర సంస్థలు మూతపడ్డాయి. ఐబీఎం, హెచ్‌ఎస్‌బీసీ లాంటి సంస్థలు వెళ్లిపోయాయి. సిరిపురంలోని HSBC కార్యాలయం, కాల్‌ సెంటర్లలో ఒకప్పుడు 3వేల 500 మంది పని చేయగా..ఆ సంస్థ ఖాళీ చేసి వెళ్లిపోయింది. గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న కంపెనీకి సగం అద్దెకే ఇచ్చేవారు. ఇంటర్నెట్‌, విద్యుత్తు సదుపాయం కల్పించేవారు. ఈ ప్రభుత్వం వీటిని నిలిపివేయడంతో చాలా సంస్థలు మూతపడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి అవకాశం ఉన్న విశాఖ పరిస్థితే అధ్వానంగా తయారైంది. దీంతో యువత ఉపాధి కోసం వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

విజయవాడలో H.C.L., టెక్‌ మహీంద్ర లాంటి సంస్థలున్నా.. పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టట్లేదు. విశాఖ, విజయవాడ సహా రాష్ట్రంలో పెద్ద ప్యాకేజీలతో ఉద్యోగాలు ఇచ్చే సంస్థల్లేవు. పెద్ద ప్యాకేజీలు వచ్చేవారు వేరే రాష్ట్రాలకు వెళ్లడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతోంది. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు పొందినవారు తమ ఆదాయాన్ని అక్కడే ఖర్చు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు, విదేశాలకు యువత వలస వెళ్లడంతో చాలా గ్రామాల్లో వృద్ధులే మిగులుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.