ETV Bharat / state

Ammaodi Scheme Restrictions: అమ్మఒడి సాయంలో కోత.. రూ.6,300 కోట్లు మిగుల్చుకున్న జగన్‌ సర్కారు..

author img

By

Published : Aug 5, 2023, 7:09 AM IST

Updated : Aug 5, 2023, 10:56 AM IST

ammaodi scheme restrictions
అమ్మఒడి సాయంలో కోతపెట్టిన జగన్‌

Ammaodi Scheme Restrictions: చదువు భారంగా మారకూడదు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందినీ బడికి పంపండి. అందరికీ.. 15వేల రూపాయల చొప్పున ఇస్తాం. ఇదీ ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీ. తీరా అధికారంలోకి వచ్చాక.. నిర్వహణ ఖర్చుల పేరుతో రూ.2వేలు కోతపెట్టారు. ఏటికేడు లబ్ధిదారుల సంఖ్యనూ తగ్గించారు. చివరకు 75 శాతం హాజరు నిబంధనతో.. ఏడాది సాయం ఎగ్గొట్టారు. దీంతో లబ్ధిదారులు ఒక ఏడాది ప్రయోజనాన్ని కోల్పోయారు.

అమ్మఒడి సాయంలో కోతపెట్టిన జగన్‌

Ammaodi Scheme Restrictions: అన్నింటిలాగే అమ్మఒడి పథకంలోనూ సీఎం జగన్.. కోతల్లో తనదైన మార్క్‌ చూపించారు. ఎన్నికలకు ముందు పిల్లల్ని బడికి పంపితే చాలు రూ.15 వేలంటూ చెప్పి.. తర్వాత ఎంతమంది పిల్లలున్నా రూ.15 వేలే అని మాట మార్చారు. తర్వాతా లబ్ధిదారుల సంఖ్య తగ్గించేందుకు పలు నిబంధనలు పెట్టారు. ఫలితంగా మొదటి ఏడాది తప్ప ఎప్పుడూ రూ.15 వేల పూర్తిమొత్తం తల్లుల ఖాతాల్లో జమ కాలేదు. మొదటి ఏడాది సైతం బ్యాంకులో జమ చేసిన తర్వాత మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో వెయ్యి వెనక్కి తీసుకున్నారు. రెండో ఏడాది నేరుగా వెయ్యి రూపాయలు మినహాయించి రూ.14 వేలే వేశారు.

గతేడాది నుంచి మరుగుదొడ్లకు తోడు పాఠశాలల నిర్వహణనూ జత చేసి ఏకంగా రూ.2 వేలు కోత వేస్తున్నారు. ఈ ఏడాది విచిత్రమేమిటంటే కొంతమందికి రూ.13 వేలు, కొందరికి రూ.11 వేలు, రూ.9 వేలు, రూ.5 వేలు చొప్పున జమ చేయడంతో.. అర్థం కాక లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. మొదట రూ.9 వేలు వేసిన వారిలో కొందరికి మిగతా రూ.4 వేలు వేశారు. మరికొందరికి ఇప్పటికీ మిగతా మొత్తం పడలేదు. అమ్మఒడి సైతం రెండు విడతలుగా జమ చేస్తున్నారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మరోవైపు రూ.2 వేల కోతపైనా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పాఠశాలలు, మరుగుదొడ్ల నిర్వహణ ఖర్చులు పేదలే భరించాలా.. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా పేదలు అని మాట్లాడే జగన్‌ వారి కోసం ఆ మాత్రం నిధులను ఖర్చు చేయలేరా? అని తల్లులు ప్రశ్నిస్తున్నారు.

గత రెండేళ్లతో పోల్చితే లబ్ధిదారుల సంఖ్య ఏకంగా రూ.1.86 లక్షలకు తగ్గింది. తొలి రెండేళ్ల పాటు జనవరిలో అమ్మఒడి నిధులు విడుదల చేసిన జగన్‌ సర్కారు 75 శాతం హాజరు నిబంధన పేరుతో ఏడాది నిధులు మిగుల్చుకునే ఎత్తుగడ వేసింది. ముందు ఏడాది హాజరు తీసుకొని, తర్వాత విద్యా సంవత్సరం ప్రారంభంలో లబ్ధి ఖాతాల్లో జమ చేస్తామంటూ జనవరి నుంచి జూన్‌కు మార్చడంతో ఏకంగా ఓ ఏడాది మొత్తం రూ.6వేల300 కోట్లు మిగుల్చుకుంది. పైగా వైసీపీ ప్రభుత్వ కాలంలో ఐదేళ్లలో నాలుగు పర్యాయాలు మాత్రమే అమ్మఒడి ఇచ్చారు. అంటే ఈ ఏడాది జూన్‌లో ఇచ్చిన సాయమే చివరిది. మాటల్లోనే పేదలపై ప్రేమ కురిపించే జగన్‌.. వారికి ఇవ్వాల్సిన ఏడాది సాయాన్ని ఏకంగా ఎగవేశారు.

లబ్ధిదారులు కోరుకుంటే 9-12 తరగతుల పిల్లలకు అమ్మఒడి నగదుసాయం బదులు ల్యాప్‌టాప్‌ ఇస్తామని 2021 జనవరి 11న సీఎం జగన్‌ ప్రకటించారు. ఈమేరకు దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు ల్యాప్‌టాప్‌ల కోసం ఆశపడ్డారు. కానీ టెండర్లలో గుత్తేదారులు ఒక్కో ల్యాప్‌టాప్‌కు రూ.26 వేలు కోట్‌ చేయడంతో అదనంగా ఒక్కోదానికి 13 వేలు భరించాల్సి వస్తుందనే కారణంతో ప్రభుత్వం చేతులెత్తేసింది. బదులుగా డిసెంబరులో బైజూస్‌ కంటెంట్‌ ట్యాబ్‌లతో సర్దుబాటు చేసింది.

Ammavodi not credited: ఇంకా జమ కాని 'అమ్మఒడి' నిధులు.. బ్యాంకుల వద్ద ఎండలో పడిగాపులు

Last Updated :Aug 5, 2023, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.