ETV Bharat / state

మెుక్కలతో మమేకం.. అదే ఆమె వ్యాపకం !

author img

By

Published : Mar 6, 2022, 9:24 PM IST

Margani Satya
Margani Satya

ఆమెకు మొక్కలంటే అమితమైన ఇష్టం. దానికి తోడు... నర్సరీలు ఉన్న అత్తారింట్లో అడుగు పెట్టారు. మొక్కలు నాటడం, సంరక్షణ, విక్రయం వరకు... ఎంతో శ్రద్ధతో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మొక్కను... పునరుత్పత్తి చేసి దేశం మొత్తం విక్రయించారు. నర్సరీల నిర్వహణలో భర్తకు అండగా నిలిచి సిరులు కురిపిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా నర్సరీని విజయవంతంగా నిర్వహిస్తూ... ఆదర్శంగా నిలుస్తున్న తూర్పుగోదావరి జిల్లా కడియంకు చెందిన మహిళ విజయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం.

మొక్కలంటే ఆమెకు ప్రాణం.. సంరక్షణలో ఆదర్శం

తూర్పుగోదావరి జిల్లా కడియంకు చెందిన మార్గాని సత్య.... ఏడో తరగతి వరకు చదువుకున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఈమెకు చిన్నప్పటి నుంచి సహజంగానే మొక్కలంటే ఎంతో ఇష్టం ఏర్పడింది. అత్తవారికి నర్సరీ ఉండటంతో... మొక్కల పెంపకం, సంరక్షణపై మక్కువ పెంచుకున్నారు. భర్త వీరబాబు ప్రోత్సహించడంతో... నర్సరీల నిర్వహణ బాధ్యతలు చేపట్టారు సత్య. ఓ వైపు పిల్లల పోషణ, మరోవైపు మొక్కల సంరక్షణ... ఇదే వ్యాపకంతో ముందుకు సాగారు. ఈ క్రమంలో పన్నెండేళ్ల క్రితం ఇంటి పెరట్లో వేసేందుకు సింగపూర్‌ నుంచి నాలుగు మొక్కలు వీరబాబు తెప్పించారు. వీటిని మడగాస్కర్‌ ఆల్మండో అంటారు. ఈ తరహా మొక్కలు కంబోడియా, చైనా, థాయ్‌లాండ్‌, మలేషియా, సింగపూర్‌ తదితర దేశాల్లో పెరుగుతాయి. వీటిని ఇంటి పెరట్లో నాటారు. అవి నాలుగేళ్లకు పూతకొచ్చి గింజలు రాలడం మొదలెట్టాయి. ఆ గింజల్ని తిరిగి వేల సంఖ్యలో నాటారు. అంతే సంఖ్యలో మొక్కలు పెరిగాయి.

నర్సరీలో వివిధ రకాలైన విదేశీ మొక్కలు

అలా నర్సరీలో పెరిగిన మొక్కలను దేశంలోని ప్రఖ్యాతిగాంచిన సంస్థలకు విక్రయించి... అధిక మొత్తంలో ఆదాయం ఆర్జించారు. ఉదయం నిద్ర లేచి ఇంటి పనులు త్వరగా ముగించుకొని... వెంటనే నర్సీలకి వెళ్తారు సత్య. వీరి ఇల్లు కూడా నర్సరీలోనే నిర్మించుకున్నారు. మొక్కలు నాటడం, పాదులు చేయడం, నీరు పెట్టడం, అంటుకట్టడం, కూలీలతో పనులు చేయించడం.... ఇలా అన్ని బాధ్యతలూ దగ్గరుండి చూసుకుంటారు. అలాగే వీరి గౌతమి నర్సరీలో వివిధ రకాలైన విదేశీ మొక్కలు, చెట్లు ఎక్కువగా దర్శనమిస్తాయి. వాటి ధరలు లక్షల్లో ఉంటాయి. దేశంలోని ప్రముఖ సంస్థలు, ప్రముఖ ప్రాజెక్టులకే వీరు ఎక్కువగా మొక్కలు పంపింస్తారు. దీంతో ఎంతో విలువైన ఆ చెట్లను సత్య ఎంతో ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారు.

పెద్దగా చదువుకోకపోయినా..

నర్సరీల అభివృద్ధికి సత్య ఎంతో కృషి చేశారని ఆమె భర్త వీరబాబు చెబుతున్నారు. నర్సరీ నిర్వహణ, కొత్త మొక్కల పెంపకంతో పాటు ఇంటినీ సమర్థవంతంగా నిర్వహిస్తున్న సత్య... తమకు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఆమె పిల్లలు చెబుతున్నారు. పెద్దగా చదువుకోకపోయినా వేల మొక్కల పెంపకం, వాటి విక్రయంతో ఆదాయం ఆర్జిస్తున్న సత్య... మరింత మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇదీ చదవండి: Great Poet Molla: కవయిత్రి మొల్ల సాహితీ సాంస్కృతిక మహోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.