ETV Bharat / state

ఏపీలో కత్తులు దూస్తున్న కోళ్లు.. సంక్రాంతి పందాల హడావిడి షురూ..!

author img

By

Published : Jan 10, 2023, 9:22 AM IST

Sankranthi cock
Sankranthi cock

Sankranthi cock fighting: కొత్త ఏడాది ఆరంభం నుంచే ఏపీలోని పలు జిల్లాలో కోడిపందేల హడావుడి మొదలైంది. పోలీసులు హెచ్చరిస్తున్న పందెంరాయుళ్లు.. తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. తాజాగా బాపట్లలో పోలీసుల హెచ్చరికల్ని బేఖాతారు చేస్తూ అడవులదీవిలో ఆదివారం జోరుగా కోడిపందేలు నిర్వహించారు.

Sankranthi cock fighting: కొత్త ఏడాది ఆరంభం నుంచే ఏపీలోని పలు ప్రాంతాల్లో కోడిపందేల హడావుడి మొదలైంది. తాజాగా బాపట్ల జిల్లా ఎస్పీ హెచ్చరికలు జారీ చేస్తున్నా బేఖాతరు చేస్తూ అడవులదీవిలో ఆదివారం జోరుగా కోడిపందేలు నిర్వహించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో పందేలు జరుగుతున్నా పోలీసులు కనీసం ఆ చుట్టుపక్కలకు వెళ్లలేదు. విమర్శలు రావడంతో ఎట్టకేలకు పోలీసులు సోమవారం బరిని ధ్వంసం చేశారు. సంక్రాంతి నేపథ్యంలో తీర ప్రాంతంలో భారీగా బరుల ఏర్పాటుకు కొందరు నేతలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురు కాకుండా అధికార పార్టీ ముఖ్య నాయకులతో మాట్లాడి అభయం తీసుకుంటున్నారు. మంచి ఆదాయ మార్గం కావడంతో బరుల నిర్వహణకు గతంలో కంటే ఈ ఏడాది నాయకుల్లో పోటీ పెరిగింది. బరికి రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ముట్టజెప్పేందుకు సైతం నిర్వాహకులు వెనకాడటంలేదు. నూతన సంవత్సర వేడుకల పేరుతో బాపట్ల, రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు భారీగా కోళ్ల పందేలు నిర్వహించారు. తీరంలో జూద శిబిరాలు ఎప్పటి నుంచే కొనసాగుతున్నాయి. రోజూ రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయి.

రెపల్లే, వేమూరు నియోజకవర్గాల్లో గతేడాది పెనుమూడి, నిజాంపట్నం, పల్లెకూనలో కోడిపందేల బరులు ఏర్పాటు చేశారు. పండగ ముసుగులో గతంలో బొబ్బర్లంక, నగరం, నిజాంపట్నంలో భారీ స్థాయిలో పందేలు, జూదం నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ సంవత్సరం బరుల ఏర్పాటు కోసం అధికార పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలు పోటీపడుతున్నారు. గతేడాది సంక్రాంతి సమయంలో అధికార పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దగ్గరుండి కోళ్ల పందేలు వేయించారు. స్వయంగా పందేలు ఆడారు. పందేలు అడ్డుకోవటానికి పోలీసులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

కొత్తపాలెంలో నిర్వహిస్తున్న కోడి పందాలు
కొత్తపాలెంలో నిర్వహిస్తున్న కోడి పందాలు

ఈ ఏడాది పండగ ముందే వేమూరు, చుండూరు, పల్లెకూన, పెసర్లంక, పెనుమూడి, నిజాంపట్నంలో బరులు ఏర్పాటు చేయాలనే యోచనలో నాయకులున్నారు. చెరుకుపల్లి, నగరం మండలాల్లో బరుల కోసం కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రాంతాల వారీగా ఈనెల 10 నుంచి 12 వరకు, 13 నుంచి 16 వరకు వరుసగా పందేలు నిర్వహించి సొమ్ము చేసుకునేందుకు తాపత్రయపడుతున్నారు. పండగ సమయంలో రూ.కోట్లలో నగదు చేతులు మారనుంది. బరి ఏర్పాటుకు ప్రజాపతినిధుల అండదండలుంటే పోలీసులు ఆ వైపు రారన్న ధీమాలో నిర్వాహకులు ఉన్నారు. ఎంచక్కా పందేలు, పేకాట, గుండాట తదితర జూద క్రీడలు నిర్వహించుకోవచ్చన్న భావనలో ఉన్నారు. పందెంరాయుళ్లకు విందు భోజనాలు, మద్యం సరఫరా చేసి ఆకట్టుకోవాలని చూస్తున్నారు. పందేలు నిర్వహిస్తాం రమ్మంటూ హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, విజయవాడలోని ప్రముఖ వ్యాపారులకు ఆహ్వానాలు పంపిస్తున్నారు.

అడవులదీవిలో తలపడుతున్న కోళ్లు
అడవులదీవిలో తలపడుతున్న కోళ్లు

అప్పుడే మొదలెట్టేశారు: నూతన సంవత్సరం ప్రారంభం రోజే చుండూరు మండలం వేటపాలెం, కర్లపాలెం, బాపట్ల మండలం స్టూవర్టుపురం, నిజాంపట్నం కొత్తపాలెం, నగరం మండలం ఈదుపల్లిలో భారీస్థాయిలో కోడిపందేలు నిర్వహించారు. తాజాగా అడవులదీవిలో భారీగా పందేలు వేశారు. కోళ్లు కత్తులు దూశాయి. ఏకంగా బరి ఏర్పాటు చేసి కోళ్ల పందేలు వేస్తున్నా పోలీసులు అడ్డుకోలేదు. పోలీసులకు ముందస్తుగా సమాచారం అందించి పందేలు నిర్వహిస్తున్నామని ఎవరూ భయపడవద్దంటూ పందెంరాయుళ్లకు వైకాపా నేతలు భరోసా ఇచ్చారు. మూడు నుంచి నాలుగు గంటలకు పైగా బహిరంగంగా పందేలు వేశారు. సంక్రాంతి పండగ సమీపిస్తుండటంతో పందేలు జోరందుకున్నాయి. పందెం కోళ్లకు డిమాండ్‌ పెరిగింది. అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లోను కోళ్ల పందేలు గుట్టుచప్పుడు కాకుండా వేస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులకు సమాచారం తెలిసినా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాలతో అడపాదడపా అక్కడక్కడ దాడులు చేసి చిన్నపందేలు వేసిన వారిని పట్టుకుని అరెస్టు చేస్తున్నారు. రేపల్లె మండలం బేతపూడి, పేటేరు, మైనేనివారిపాలెం, మోళ్లగుంట శివారుల్లో చిన్నపాటి జాగా కనిపిస్తే చాలు పందేలు వేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో స్థానిక పోలీసులు వెళ్లేప్పటికి గుట్టు చప్పుడు కాకుండా జారుకుంటున్నారు. చెరుకుపల్లి, నగరం, నిజాంపట్నం మండలాల్లో కొందరు నేతలు జూద శిబిరాలు జోరుగా నిర్వహిస్తున్నారు. రోజూ రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయి. కోడి పందేలు, జూదంలో పెద్ద ఎత్తున నగదు పోగొట్టుకుని పలువురు అప్పుల పాలవుతున్నారు. ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించి క్షేత్ర స్థాయికి ప్రత్యేక పోలీసు బృందాలను పంపించి దాడులు చేయించి నిర్వాహకులపై కేసులు నమోదు చేసి పట్టుకుంటేనే పందేలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.