ETV Bharat / state

'ఎన్ని కేసులతో బెదిరించినా భయపడేది లేదు.. లొంగేది లేదు'

author img

By

Published : Dec 25, 2022, 7:39 PM IST

Pilot Rohit Reddy
పైలట్ రోహిత్ రెడ్డి

TS MLA Pilot Rohit Reddy media conference: ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనే అంశాన్ని ఛేదించి దొంగస్వాములను బయటపెట్టినందుకే తనను తన కుటుంబాన్ని ఈడీ పేరుతో బీజేపీ ఇబ్బంది పెట్టాలని చూస్తోందని తెలంగాణ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆరోపించారు. అందుకే తనకు ఈడీ నోటీసులు ఇచ్చిందని విచారణలో భాగంగా ఈడీ తనను కేవలం వ్యక్తిగత విషయాలు వ్యాపార విషయాలను మాత్రమే అడిగిందన్నారు. బీఆర్​ఎస్​ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఈడీ విచారణకు సంబంధించిన అంశాలను ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌ రెడ్డి వెల్లడించారు.

TS MLA pilot Rohit Reddy media conference: బీజేపీ కుట్రలను బయటపెట్టినందుకే తనకు ఈడీ నోటీసులు ఇచ్చిందని తెలంగాణ బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే ఫైలట్​ రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్​ఎస్​ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కుట్రలో ఎక్కడా కూడా డబ్బు అనే మాట లేదు, మనీలాండరింగ్‌ జరగలేదని చెప్పారు. ఏదో విధంగా ఈడీని పంపించి నన్ను ఇబ్బంది పెట్టి, భయబ్రాంతులకు గురి చేసి.. లొంగదీసుకోవాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతోనే ఈడీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు భావిస్తున్నారు.

ఏ కేసులో అయినా నిందితులను ముందుగా పిలిచి విచారణ జరిపించడం అందరికీ తెలిసిన విషయం అని స్పష్టం చేశారు. కానీ ఈడీ మాత్రం అందుకు విరుద్ధంగా ఫిర్యాదుదారుడినే పిలిచి విచారించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రెండు రోజులు అభిషేక్​ను, తనను పిలిచి విచారించినా.. వాళ్లు అనుకున్నట్లు ఏదీ జరగలేదని తెలిపారు.

దీంతో రూటు మార్చి.. ముఖ్య సూత్రధారి అయిన నందకుమార్‌ని విచారిస్తామని కోర్టులో ఈడీ పిటిషన్‌ దాఖలు చేసిందని ఎమ్మెల్యే రోహిత్​రెడ్డి వెల్లడించారు. రోహిత్‌రెడ్డిని అతని కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే ఏకైక లక్ష్యంగా.. నందకుమార్‌తో వారికి అనుకూలంగా స్టేట్​మెంట్‌ తీసుకోవాలని చూస్తున్నారన్నారు. ఆ వాంగ్మూలంతో తనను ఈ కేసులో ఇరికించడమే వారి వ్యూహం.. ఇదే మాకు అందిన సమాచారం అని ప్రకటించారు. దొంగే దొంగ.. దొంగ అని అరిచినట్టుగా బీజేపీ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నా కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేసినా.. వ్యక్తిగత ఇమేజ్‌ని దెబ్బతియాలని చూసినా.. నేను మాత్రం తగ్గేది లేదని స్పష్టం చేశారు.

న్యాయవ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉందని.. మీరు పన్నిన కొత్త కుట్రను భగ్నం చేసి.. తిప్పి కొడతామని ధీమా వ్యక్తం చేశారు. ఈడీ తీరుపై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయబోతున్నామని ఫైలట్​ రోహిత్‌రెడ్డి వెల్లడించారు. బీఎల్​ సంతోశ్​, తుషార్​ సిట్​ విచారణకు ఎందుకు హాజరుకావడం లేదని ప్రశ్నించారు. తప్పుచేయకుంటే వారు ఎందుకు భయపడుతున్నారన్నారు.

ఎన్ని కేసులతో భయపెట్టినా భయపడేది లేదు.. లొంగేది లేదు

"నందకుమార్​ను విచారిస్తామని ఈడీ కోర్టులో ఒక అప్పీల్​ దాఖలు చేశారు. నందకుమార్​తో వారికి అనుకూలంగా స్టేట్​మెంట్​ తీసుకొని.. ఆ వాగ్మూలంతో నన్ను ఈ కేసులో ఇరికించడమే వారి వ్యూహం. దొంగే దొంగ.. దొంగ అని అరిచినట్టుగా ఉంది బీజేపీ వ్యవహారం. మీరు ఎన్ని నోటీసులిచ్చినా, ఎన్ని విచారణలు జరిపినా, ఎన్ని కేసులు పెట్టినా, అరెస్టు చేసినా నేను మాత్రం మీకు లొంగేదే లేదు. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టినా ఎక్కడా వారికి ఎదురు దెబ్బ తగల్లేదు.. కేవలం తెలంగాణలో మాత్రమే వారు అనుకున్నది జరగలేదు." - ఫైలట్​ రోహిత్​రెడ్డి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.