ETV Bharat / state

ప్రైవేటు బస్సులో... ఆకుకూరల గంపలో... అక్రమ మద్యం రవాణా!

author img

By

Published : Feb 5, 2021, 8:08 AM IST

illegal wine caught by police
అక్రమ మద్యం స్వాధీనం

పంచాయతీ ఎన్నికల సందర్బంగా గ్రామాల్లో.. రాజకీయం వేడెక్కింది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవటానికి.. మద్యం ఏరులై పారే అవకాశం ఉండటంతో... పోలీసులు, ఎక్సైజ్ అధికారులు అప్రమత్తమయ్యారు. అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా... అక్రమార్కులు కొత్త మార్గాలు వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే వివిధ ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేయగా, అక్రమంగా తరలిస్తున్న ఇతర రాష్ట్రాల మద్యం, నాటు సారా పట్టుపడింది.

ప్రకాశం జిల్లా పామూరు మండలం రావిగుంటపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాదు నుంచి వస్తున్న రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేశారు. అక్రమంగా తరలిస్తున్న 288 తెలంగాణ మద్యం ప్యాకెట్లు గుర్తించారు. రెండు బస్సుల్లో ఉన్న మద్యాన్ని స్వాధీనం చేసుకొని.. బస్సులను పామూరు పోలీస్ స్టేషన్​కి తరలించారు. మద్యాన్ని తరలించేందుకు ప్రయత్నించిన.. ప్రయాణికుడితో పాటు, డ్రైవర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

మైలుచర్లలలో నాటు సారా

ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం మైలుచర్ల గ్రామ అటవీ ప్రాంతంలో... ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. నాటు సారా తయారీకి సిద్ధం చేసిన 1000 లీటర్ల బెల్లం ఊటను, బట్టీలను ధ్వంసం చేశారు. నాటు సారా తయారు చేస్తున్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు... ఎస్ఈబీ అధికారి విజయ భాస్కర్ తెలిపారు.

ఆకుకూరల గంపలో... మద్యం సీసాలు!

అనంతపురం జిల్లా మడకశిరలో పోలీసులు, సెబ్ సిబ్బంది వేర్వేరుగా దాడులు నిర్వహించారు. వాహనాలను తనిఖీ చేస్తుండగా.. ద్విచక్ర వాహనంపై.. ఆకుకూరల గంపలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు గుర్తించారు. నిందితుడు మడకశిర మండలం మల్లినాయకనహల్లికి చెందిన గోపాల్​ రెడ్డి అని పోలీసులు వెల్లడించారు. అగలి మండలం తొనసనపల్లి గ్రామానికి చెందిన సుబ్బరాయుడు.. ద్విచక్రవాహనంలో మద్యం తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ రెండు దాడుల్లో 80 కర్ణాటక మద్యం ప్యాకెట్లు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... అనుమతి లేకుండా కల్లు అమ్మినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ముగిసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జిల్లాల పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.