ETV Bharat / state

HC SERIOUS ON CI: అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తూ.. అమాయకులను చితకబాదుతూ..

author img

By

Published : May 11, 2023, 3:14 PM IST

HC SERIOUS ON CI: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొందరు పోలీసుల ప్రవర్తన.. స్నేహపూర్వక పోలీసింగ్‌కు తీవ్ర విఘాతం కలిగిస్తోంది. అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తూ అమాయకులను చితికబాదే పోలీసులు కొందరైతే.. బాధితులపైనే అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టేవారు మరికొందరు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఒకప్పుడు పోలీస్‌ ఉద్యోగం క్రమశిక్షణకు మారుపేరుగా ఉండగా.. నేడది అధికార పార్టీ నేతల కనుసన్నల్లో నడిచే వ్యవస్థలా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందూపురంలో సీఐ ఇస్మాయిల్‌ తీరుపై హైకోర్టు సుమోటోగా స్పందించిన వేళ.. ఉమ్మడి అనంపురం జిల్లా పోలీసుల తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది.

HC raps Hindupur CI for mistreating advocate
హిందూపురం సీఐ ఇస్మాయిల్​పై హైకోర్టు సీరియస్

హిందూపురం సీఐ ఇస్మాయిల్​పై హైకోర్టు ఆగ్రహం

HC SERIOUS ON CI: హిందూపురంలో అక్రమ నిర్బంధంలో ఉన్న నిందితుడ్ని కోర్టుకు తీసుకెళ్లేందుకు వెళ్లిన అడ్వకేట్ కమిషన్ అధికారులపై.. సీఐ ఇస్మాయిల్ దాడి చేయటమే కాకుండా.. అక్రమ కేసు పెట్టిన ఘటన పోలీసుల దాష్టీకానికి పరాకాష్ఠగా నిలుస్తోంది. తాడిపత్రిలో సబ్ డివిజన్ పోలీసు అధికారిపై ఏకంగా తొమ్మిది ప్రైవేట్ కేసులు వేస్తూ కోర్టును ఆశ్రయించారంటే ఆ అధికారి దురుసు ప్రవర్తన ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కదిరిలో రోడ్డు వైపు చిన్నపాటి దుకాణం నడుపుకునే మహిళపై సీఐ దౌర్జన్యంగా వ్యవహరించిన తీరు.. తీవ్ర విమర్శలకు దారితీసింది. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఇలాంటి ఎన్నో ఘటనల వెనుక అధికార పార్టీ నేతలకు కొమ్ముకాసే పోలీసులే కారణమనే విమర్శలు వినిసిస్తున్నాయి.

గతేడాది అక్టోబర్‌లో హిందూపురం పోలీసు స్టేషన్​లో జరిగిన ఘటనపై హైకోర్టు ఇటీవల తీవ్రంగా స్పందించి.. సీఐ ఇస్మాయిల్ వ్యవహరించిన తీరుపై మండిపడింది. దొంగతనం ఆరోపణతో గిరీష్ అనే వ్యక్తిని హిందూపురం పోలీసు స్టేషన్​కు తీసుకొచ్చిన సీఐ ఇస్మాయిల్.. విచక్షణారహితంగా కొట్టారు. అక్రమ నిర్బంధంలో హింసిస్తున్నారని నిందితుడి తల్లి స్థానిక కోర్టును ఆశ్రయించారు. దీనిపై హిందూపురం కోర్టు.. అడ్వకేట్ కమిషన్‌ను ఏర్పాటు చేసి పోలీసు స్టేషన్​లోని నిందితుడిని కోర్టు ఎదుట హాజరుపరచాలని ఆదేశించింది. అక్రమ నిర్బంధంలో ఉన్న గిరీష్ కోసం వెళ్లిన అడ్వకేట్ కమిషన్ సభ్యులు, న్యాయవాదులపై సీఐ ఇస్మాయిల్.. దాడి చేశారు. అంతటితో ఆగకుండా కమిషన్ అధికారి సహాయకుడిగా వెళ్లిన కోర్టు ఉద్యోగిపై అక్రమ కేసు పెట్టారు. ఈ కేసులో ఏకంగా డీజీపీకి నోటీసులు ఇచ్చిన హైకోర్టు.. సీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత జరిగినా సీఐని.. కనీసం సస్పెండ్ కూడా చేయలేదు.

తాడిపత్రిలో పోలీస్ డివిజన్ అధికారిగా.. మొన్నటి వరకు ఉన్న చైతన్య తీరు సర్వత్రా విమర్శలకు దారి తీసింది. ప్రతిపక్ష పార్టీ నేతలపై విచక్షణారహితంగా దాడులు చేయటమే కాకుండా, అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపణలు ఉన్నాయి. డీఎస్పీ చైతన్య ఇసుక అక్రమ రవాణాకు అనుకూలంగా మారారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేకు డీఎస్సీ చైతన్య తొత్తుగా మారారంటూ గళమెత్తినా ఎవరూ కనీసం స్పందించి విచారణ జరిపించలేదంటేనే పోలీసు శాఖ పనితీరు ప్రశ్నార్థంగా కనిపిస్తోందనే విమర్శలొచ్చాయి. డీఎస్పీ చైతన్యపై తాడిపత్రి కోర్టులో ప్రతిపక్ష పార్టీల నాయకులు, ప్రజలు.. పదికి పైగా ప్రైవేట్ కేసులు దాఖలు చేశారంటే ఆ డీఎస్పీ ఏ మేరకు స్నేహపూర్వక పోలీసింగ్ చేశారో తెలుస్తోంది.

ధర్మవరంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం పెట్టి అక్కడి ప్రజాప్రతినిధి అక్రమాలపై రుజువులు ప్రదర్శించటానికి సిద్ధమైన సందర్భంలో వైసీపీ మూకలు దాడులకు పాల్పడ్డాయి. బీహార్ తరహాలో పట్టపగలే కర్రలు పట్టుకొని పదుల సంఖ్యలో వైసీపీ మూకలు బీజేపీ కార్యకర్తల తలలు పగలగొట్టారు. అక్కడ నిందితులపై కేవలం స్టేషన్ బెయిల్ కేసులు పెట్టి సరిపెట్టారు. ఈ మూడేళ్లుగా కొందరు పోలీసుల వ్యవహారం అధికార పార్టీ నేతలకు జీ హుజూర్ అన్నట్లుగా మారిందని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో సీఐ మధు దురుసు ప్రవర్తన విమర్శలకు దారితీసింది. దుకాణాల తొలగింపులో ఓ మహిళ పట్ల సీఐ వ్యవహరించిన తీరు వీధి రౌడీని తలపించిందని.. అప్పట్లో ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. సీఐ మధు ప్రవర్తన మీడియాలో పెద్ద ఎత్తున వచ్చినా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వచ్చాయి. మరో ఘటనలో గొర్రెలు దొంగలిస్తున్నారని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న రాయదుర్గం పోలీసులు.. విచక్షణారహితంగా కొట్టడంతో ఒక నిందితుడు స్టేషన్​లోనే ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇది లాకప్ డెత్ అంటూ ప్రజాసంఘాలు, బంధువులు ఆరోపించినా.. కనీసం పూర్తి స్థాయి విచారణ నిర్వహించలేదనే విమర్శలున్నాయి. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న ఏపీ పోలీస్ తీరు.. అన్ని చోట్లా తీవ్ర విమర్శలకు గురికావటానికి కారణం అనర్హులను అందలం ఎక్కించటమే అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.