ETV Bharat / state

వంటనూనెల ధరలపై కరోనా ప్రభావం

author img

By

Published : Nov 11, 2020, 12:10 PM IST

edible oil prices
edible oil prices

కరోనా ప్రభావం, భారీగా కురిసిన వర్షాలతో వంటనూనె ధరలు సామాన్యునికి చుక్కలు చూపిస్తున్నాయి. దేశీయంగా ఏటా పెరుగుతున్న వినియోగానికి తగ్గట్లుగా నూనె ఉత్పత్తి లేకపోవడంతో అధిక శాతం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన వంటనూనెల ధరల ప్రభావం భారత్‌పై పడింది.

ఓ వైపు ప్రణాళిక లేని ప్రభుత్వాలు, మరోవైపు పంట దిగుబడులపై కన్నెర్ర చేసే ప్రకృతి ప్రభావం వంట నూనెల ఉత్పత్తిపై పడుతోంది. దేశంలో నూనె గింజ పంటలు ఏటా ప్రకృతి ప్రకోపానికి తీవ్రంగా దెబ్బతింటున్నాయి. వేరుశనగ, సోయా, ఆవాలు తదితర పంటల దిగుబడులు చేతికొచ్చే సమయంలో వర్షాభావం, అకాల వర్షాల భారిన పడుతున్నాయి. పర్యవసానంగా ఏటా నూనె గింజల ఉత్పత్తి తగ్గి, వంట నూనెల డిమాండ్, సరఫరాలకు మధ్య పెద్ద అంతరం ఏర్పడుతోంది. ప్రకృతి సహకరించక నూనె గింజల పంటలు నష్టపోతున్న రైతులను, ఈసారి కరోనా వైరస్ అదనంగా దెబ్బతీసింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఈ వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా అమలు చేసిన లాక్ డౌన్ అన్నదాతలను మరిన్ని కష్టాలకు గురిచేసింది.

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఏటా 200 మిలియన్ టన్నుల వంటనూనెలు తింటున్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. భారతదేశంలో 23 మిలియన్ టన్నుల నూనె వినియోగిస్తున్నారు. దేశంలో పామోలిన్, పొద్దుతిరుగుడు, వేరుశనగ, వరి తవుడు తదితర నూనెగింజల నుంచి వస్తున్న నూనె ఉత్పత్తి కేవలం పదిన్నర మిలియన్ టన్నులు మాత్రమే ఉంటోంది. ఏటా దాదాపు 14 నుంచి 15 మిలియన్ టన్నుల మేర అన్ని రకాల వంటనూనెలను వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏటా మలేసియా, ఇండోనేసియా దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. భారీ వర్షాలతో పంట దెబ్బతినటం, లాక్ డౌన్ తో పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోవటంతోనే వంట నూనెల ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

నూనె గింజ పంటలను ప్రోత్సహించి, దిగుబడులు పెంచుకునే వరకూ వంట నూనెల ధరలు దిగిరాని పరిస్థితి నెలకొంది. దిగుమతులపైనే ఆధారపడే పరిస్థితి ఉన్నంత కాలం.. ప్రపంచ నూనె మార్కెట్ ధరల హెచ్చు తగ్గుల భారాన్ని భారత్‌ ప్రజలు కూడా భరించాల్సిందేనని వ్యాపార నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

రహదారి అభివృద్ధి పన్నుల్లో సింహభాగం రుణాల చెల్లింపులకే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.