ETV Bharat / state

ప్రభుత్వ అధికారి అంటూ వాహనానికి  బోర్డు.. లోపల మాత్రం...!

author img

By

Published : Jun 28, 2021, 7:20 PM IST

-illegal-liquor-transfer
మద్యం పట్టివేత

ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా తరలించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసులు వారిని పట్టుకునేందుకు ఎప్పటికప్పుడు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారిని పట్టుకుంటూ మద్యాన్ని సీజ్​ చేస్తున్నారు. అయినప్పటికీ మద్యం వ్యాపారులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. పోలీసులు పట్టుకోకుండా ఉండేందుకు రకరకాలుగా మద్యం తరలిస్తున్నారు.

విద్యుత్​ శాఖ విజిలెన్స్​ అధికారి అనే బోర్డు ఉన్న వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుబడింది. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో జరిగింది. పట్టుకోకుండా ఉండేందుకే వాహనంలో ఇలా బోర్డు పెట్టుకున్నారని పోలీసులు తెలిపారు.

కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి ఓ కారు, రెండు ద్విచక్ర వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం ప్యాకెట్లను రాష్ట్ర సరిహద్దుల్లో విడపనకల్లు పోలీసులు పట్టుకున్నారని ఉరవకొండ సీఐ శేఖర్ తెలిపారు. 1,595 మద్యం ప్యాకెట్లను స్వాధీన చేసుకుని, ఎనిమిది మందిని అరెస్టు చేశామని వెల్లడించారు.

కృష్ణాజిల్లా నాగాయలంక మండలం, ఏటిమోగ గ్రామంలో సైకం వెంకటేశ్వరరావు ఇంటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణాకు చెందిన 373 మద్యం సీసాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.47 వేలు ఉంటుందని జిల్లా అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. వాటితోపాటు రూ.26,500 నగదును సీజ్​ చేశారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సైకం వెంకటేశ్వరావు బెల్టు షాపు నిర్వహిస్తున్నాడని తెలిపారు.

గుంటూరు జిల్లా నగరం మండలంలో నాటుసారా స్థావరాలపై సెబ్​ పోలీసులు దాడులు చేశారు. పీటావారిపాలెం గ్రామంలో నాగరాజు అనే వ్యక్తి ఇంటి వద్ద సారా తయారీకి సిద్ధంగా ఉన్న సుమారు నాలుగు వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. సారా తయారీకి వినియోగించే సామగ్రితో పాటు 15 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. సారా తయారు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు నగరం సెబ్​ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

కర్నూలు సరిహద్దు పంచలింగాల వద్ద సెబ్ అధికారులు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర మద్యాన్ని పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వైపు నుంచి కర్నూలుకు వస్తున్న కారును సెబ్ అధికారులు తనిఖీ చేశారు. వాహనంలో 14 కాటన్ బాక్సుల మద్యం గుర్తించారు. ఈ కేసులో కారు డ్రైవర్ చిన్న నరసింహులును అరెస్ట్ చేసి 456 మద్యం సీసాలతోపాటు కారును సీజ్ చేసినట్లు సెబ్ సీఐ శ్రీనివాసులు తెలిపారు.

ఇదీ చదవండి: ROBBERS ARREST: వరుస దొంగతనాలు చేస్తున్న ముఠా పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.