ETV Bharat / state

Fake Votes Issue: నిందితుడి చేతికి తాళాలు.. అనధికార వ్యక్తితో ఓటరు జాబితా తయారీ పనులు

author img

By

Published : Jul 18, 2023, 5:55 PM IST

Accused in Preparation of Voter List: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ ఎత్తులు వేస్తోంది. విరివిగా దొంగ ఓట్లు నమోదు చేయడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు తహసీల్దార్‌ కార్యాలయంలో అనధికార వ్యక్తితో ఓటరు జాబితా తయారీ పనులు చేయించడమే ఇందుకు నిదర్శనం.

Fake Votes Issue
Fake Votes Issue

Accused in Preparation of Voter List: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ అక్రమాలకు పాల్పడుతోంది. విరివిగా దొంగ ఓట్లు నమోదు చేయడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని నాయకులు ఎత్తుగడలు వేస్తున్నారు. ఇందుకు కొందరు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అనంతపురం జిల్లా రాప్తాడు తహసీల్దార్‌ కార్యాలయంలో అనధికార వ్యక్తితో ఓటరు జాబితా తయారీ పనులు చేయించడమే ఇందుకు నిదర్శనం. అందులోనూ సదరు వ్యక్తి గతంలో నకిలీ ఆధార్‌ కార్డు సృష్టించిన కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. నియోజకవర్గంలోని కీలక వైసీపీ నాయకుడి ఒత్తిడితోనే సదరు వ్యక్తికి తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రవేశం లభించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలిసినా నోరు మెదపడం లేదు. అధికార పార్టీకి అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో మనిషికి రెండు ఓట్లు ఎక్కించడం.. మృతులు, వలసదారుల ఓట్లను అలాగే ఉంచడం... తదితర బాధ్యతలను అతడికి అప్పగించినట్లు సమాచారం.

గతంలోనూ ఓట్ల మాయ: అనంతపురం గ్రామీణంలోని కొన్ని పంచాయతీలు రాప్తాడు నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. కొన్ని పూర్తిగా నగరంలో కలిసిపోయాయి. దీన్ని అవకాశంగా తీసుకుని స్థానిక వైసీపీ నాయకులు, రెవెన్యూ అధికారులు 2019 ఎన్నికల సమయంలో భారీగా దొంగ ఓట్లు, డబుల్‌ ఓట్లు ఎక్కించారు. ఇందుకు ఓ అధికారి కూడా సహకరించినట్లు తెలుస్తోంది. అనంతపురం గ్రామీణ మండలంలోనే సుమారు పదహారు వేల డబుల్‌ ఓట్లు ఎక్కించినట్లు తెలుస్తోంది. అయితే వీరి ఓట్లు జాబితాలో ఉండటం గమనార్హం. దీన్ని గుర్తించిన తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

నియోజకవర్గ వ్యాప్తంగా 11 వేల డబుల్‌ ఓట్లు ఉన్నట్లు తేల్చారు. వీటిపై ఫారం-7 దరఖాస్తు చేయగా.. అధికారులు రెండు వేల ఓట్లను తొలగించారు. ఇంకా 9వేల ఓట్లను అలాగే ఉంచారు. మృతులు, పెళ్లి చేసుకుని వెళ్లిన అమ్మాయిలు, వలస వెళ్లినవారు.. ఇలా సుమారు 6 వేల వరకు ఉన్నట్లు టీడీపీ నాయకులు గుర్తించారు. వీటిపై ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. వైసీపీ నాయకులు 2019లో మాదిరే ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో తమకు సహకరించినా.. ఇప్పుడు అనధికారికంగా పనులు చేస్తున్నా ఇంతియాజ్‌ను అనంతపురం తహసీల్దార్‌ కార్యాలయానికి తీసుకురావాలనే ఆలోచనలో కీలక నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌ విచారణకు ఆదేశించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి.

నకిలీ ఆధార్‌ సృష్టించి.. ఉద్యోగం కోల్పోయి: అనంత నగరానికి చెందిన ఇంతియాజ్‌ గత సంవత్సరం వరకు అనంతపురం తహసీల్దార్‌ కార్యాలయంలో పొరుగుసేవల ఉద్యోగిగా పని చేసేవాడు. గత సంవత్సరం అక్టోబరులో రాచానపల్లిలో ఓ పొలాన్ని యజమానికి తెలియకుండా నకిలీ ఆధార్‌ కార్డు సృష్టించి.. కొందరు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. నకిలీ ఆధార్‌ సృష్టించడంలో ఇంతియాజ్‌ పాత్ర ఉన్నట్లు పొలం యజమాని ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. దీంతో అధికారులు అతడిని సస్పెండ్‌ చేశారు. అలాంటి వ్యక్తి కొన్ని నెలలుగా రాప్తాడు తహసీల్దార్‌ కార్యాలయంలో ఎన్నికల కంప్యూటర్‌ ఆపరేటర్‌ స్థానంలో పని చేస్తున్నారు. ఈ విషయంగా ఉన్నతాధికారులను వివరణ కోరగా తమ దృష్టికి రాలేదని తెలిపారు. అలాగే రాప్తాడు తహసీల్దార్‌ లక్ష్మీనరసింహను సంప్రదించగా.. తనకూ విషయం తెలియదని చెప్పడం కొసమెరుపు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.