ETV Bharat / state

Fake votes: విచ్చలవిడిగా దొంగఓట్లు నమోదు.. ఒకే ఇంట్లో ఏకంగా 47

author img

By

Published : Jun 23, 2023, 12:03 PM IST

Fake votes Registration in Anantapur: అనంతపురం జిల్లా రాప్తాడు ఓటర్ల జాబితాలో అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున దొంగఓట్లు నమోదు చేస్తున్నారు. ప్రధానంగా అభ్యర్థి గెలుపును నిర్ణయించే అనంతపురం గ్రామీణ మండలంలో దొంగఓట్ల నమోదు ప్రక్రియను వైఎస్సార్​సీపీ నాయకులు యథేచ్ఛగా కానిచేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు వెలుగు చూడగా.. రానున్న ఎన్నికల్లో సైతం అదే ధోరణి కొనసాగిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆక్షేపిస్తున్నారు.

Fake votes Registration in Anantapur
విచ్చలవిడిగా దొంగఓట్లు నమోదు.. ఒకే ఇంట్లో ఏకంగా 47

Fake votes Registration in Anantapur: నకిలీ ఓట్లను ఏరివేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకువచ్చింది. కానీ కొందరు అధికారులు అధికార పార్టీ నేతలకు ఒత్తాసు పలుకుతూ బోగస్ ఓట్ల నమోదుకు తెరలేపారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాష్ట్రంలోని కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటి. నియోజకవర్గంలోని 21 పంచాయతీలు అనంతపురం నగరంతో కలిసిపోయి ఉంటుంది. ఇక్కడ సుమారు 90 వేల మంది ఓటర్లు ఉన్నారు. గ్రామాల్లో ఐతే ఓట్లను పరిశీలించడం తేలిక. అక్కడ బోగస్‌ ఓట్లు చేర్పు కొంత కష్టంతో కూడుకున్నది. అందుచేతనే గ్రామీణ మండలాల్లో ఎవరూ గుర్తించలేరనే ఉద్దేశంతో.. దొంగ ఓట్లను ఇష్టారీతిన చేరుస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 12 వేలకు పైగా దొంగ ఓట్లను అధికార పార్టీ నేతలు ఓటర్ల జాబితాలో చేర్చారని చెబుతున్నాయి.

ఒకే ఇంట్లో ఏకంగా 47 ఓట్లు.. గ్రామీణ మండలం ప్రసన్నాయపల్లిలో ఓ కుటుంబం పదేళ్ల క్రితం వలస వెళ్లింది. వారు ఉంటున్న 1/1 డోర్ నెంబర్ ఇల్లు శిథిలమై పడిపోయింది. ఓటర్ల జాబితాలో మాత్రం ఆ ఇంటిపై ఏకంగా 47 ఓట్లు నమోదై ఉన్నాయి. అనంతపురం గ్రామీణ మండలంలోని రాచానపల్లి, కక్కలపల్లి, పాపంపేట, కురుగుంట పంచాయతీల్లో దాదాపు 2 వేల 500 దొంగ ఓట్లు జాబితాలోకి ఎక్కాయి. సార్వత్రిక ఎన్నికల ముందు 12 వేలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని బూత్ లెవెల్ అధికారులే నిర్దారించారు.

ఈ ఓట్లను తొలగించాలని టీడీపీ నాయకులు పలుమార్లు మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఓట్లను మాత్రం తొలగించలేదు. పెళ్లి చేసుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినా కూడా వైఎస్సార్​సీపీ సానుభూతిపరుల ఓట్లను జాబితాల్లో కొనసాగిస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదీలా ఉంటే కొత్తగా ఇంటి నెంబర్ కేటాయింపునకు 400 చలాన చెల్లించి.. ఆ వచ్చిన డోర్‌ నెంబర్​పై పదుల సంఖ్యలో కుటుంబ సభ్యులున్నట్లు కొత్త తరహా అక్రమాలకు వైసీపీ నాయకులు తెరలేపారని స్థానకులు చెబుతున్నారు.

బీఎల్వోలను బెదిరించి.. బోగస్‌ ఓట్లు నమోదు.. రాప్తాడులో ఓటర్ల జాబితాలో తాము చెప్పినట్లు ఓట్లు నమోదు చేయటంలేదని ఉపతహసీల్దార్​ను బదిలీ చేయించారనే విమర్శలున్నాయి. ఓటర్ల జాబితాలో తమకు అనుకూలంగా పేర్లు చేర్చే అధికారిని తెచ్చుకునే యత్నం చేస్తున్నట్లు నియజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ నాయకులు కొన్నిచోట్ల బీఎల్వోలను బెదిరించి మరీ.. బోగస్‌ ఓట్లను నమోదు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓటరు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసినప్పుడు మాత్రమే నకిలీ ఓట్ల తొలగింపు సాధ్యపడుతుందని.. ఆ దిశగా అధికారులు ప్రయత్నించాలని ప్రజలు కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.