ETV Bharat / state

అయ్యన్నకు ఊరట.. రిమాండ్​ను తిరస్కరించిన కోర్టు

author img

By

Published : Nov 3, 2022, 7:05 PM IST

Updated : Nov 3, 2022, 9:14 PM IST

AYYANNA ARREST UPDATES : అయ్యన్నపాత్రుడికి కోర్టులో ఊరట లభించింది. ఆయనకు రిమాండ్ విధించాలన్న సీఐడీ విజ్ఞప్తిని విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో 467 సెక్షన్‌ వర్తించదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

AYYANNA ARREST UPDATES
AYYANNA ARREST UPDATES

VISAKHA COURT ON AYYANAA : తెదేపా నేత అయ్యన్న పాత్రుడికి విశాఖ కోర్టులో ఊరట లభించింది. తెదేపా నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు, అతని కుమారుడు రాజేశ్​లను సీఐడీ పోలీసులు విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు.. అయ్యన్నపాత్రుడి రిమాండ్‌ను తిరస్కరించింది. ఈ కేసులో 467 సెక్షన్‌ వర్తించదని స్పష్టం చేసింది. 41ఏ నోటీసు ఇచ్చి ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోవచ్చని ఆదేశాలిచ్చింది.

సింహాచలం ఆసుపత్రిలో వైద్యపరీక్షలు : ఇంటి గోడ కూల్చివేత ఘటనలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారంటూ సీఐడీ పోలీసులు అరెస్ట్​ చేసిన తెదేపా నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు, అతని కుమారుడు రాజేశ్​లను విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికే అయ్యన్న తరఫు న్యాయవాదులకు సీఐడీ అధికారులు రిమాండ్‌ రిపోర్టు ఇచ్చారు. కోర్టులో హాజరుపరిచేముందు వారిద్దరిని సింహాచలం ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. సుమారు 20 నిమిషాల పాటు ప్రభుత్వ వైద్యాధికారి భాస్కరరావు పరీక్షలు చేశారు. అయ్యన్న ఒత్తిడికి లోనవుతున్నారని.. బీపీతో ఇబ్బంది పడుతున్నారని వైద్యులు వెల్లడించారు. మరోవైపు కోర్టు దగ్గరకు తెదేపా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. తమను కోర్టు ప్రాంగణంలోకి అనుమతించాలని డిమాండ్‌ చేశారు. కోర్టు ప్రాంగణం బయట రహదారిపై ధర్నా చేపట్టారు.

అసలేం జరిగిందంటే: తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు.., ఆయన చిన్న కుమారుడు చింతకాయల రాజేశ్ ను సీఐడీ పోలీసులు నర్సీపట్నంలో అరెస్టు చేశారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అయ్యన్న ఇంటిని.. పెద్ద సంఖ్యలో చుట్టుముట్టిన పోలీసులు.. ఇంటి వెనుకవైపున్న గోడ దూకి లోపలికి వెళ్లి తలుపులు బాదారు. ఇంటి గోడ కూల్చివేతకు సంబంధించిన వ్యవహారంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారనే ఆరోపణలపై ఆయనకు నోటీసులు ఇచ్చారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైందని తెలిపారు. ఐదు రోజుల నుంచి ఇక్కడే ఉన్నానని.. పగలు రావచ్చు కదా అని అయ్యన్న పోలీసులను ప్రశ్నించారు. పోలీసులు ఆయ్యన్నతో పాటు ఆయన చిన్న కుమారుడు చింతకాయల రాజేశ్​ను బలవంతంగా జీపులో ఎక్కించుకొని తీసుకెళ్లారు.

అయ్యన్నపాత్రుడి అరెస్ట్‌పై తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అయ్యన్న సతీమణి పద్మావతికి ఫోన్‌ చేసి పరామర్శించారు. పార్టీ అన్ని విధాల అదుకుంటుందని.. ధైర్యంగా ఉండాలని సూచించారు. అక్రమ అరెస్టుపై న్యాయపరంగా పోరాడుతామని హమీ ఇచ్చారు.

సీఐడీ అదనపు డీజీ ఆదేశాల మేరకు అయ్యన్నపాత్రుడు, ఆయన ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేసినట్లు సీఐడీ పోలీసులు FIRలో తెలిపారు. ఎఫ్ఐఆర్ కాపీని కోర్టుకు పంపినట్లు వెల్లడించారు. అయ్యన్న, ఆయన కుమారులు ఎన్వోసీని ఫోర్జరీ చేశారనే అభియోగంపై కేసు నమోదు చేశామని సీఐడీ DIG సునీల్ కుమార్ నాయక్ చెప్పారు.

అయ్యన్న పాత్రుడిపై ఇరిగేషన్ ఇంజినీర్ ఇచ్చిన నివేదిక మొత్తం ఫ్యాబ్రికేట్ చేసిందేనని .. న్యాయవాదులు అన్నారు. ఇంటిగోడ నిర్మాణానికి ఇరిగేషన్ శాఖ ఇచ్చిన NOC.. రిజిస్టర్ లో నమోదుకాలేదని తప్పించుకుంటున్నారని చెప్పారు. నాన్ బెయిలబుల్ నేరాలను మోపి కక్ష పూరితంగా ఇరికించారన్నది ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే అర్ధమవుతుందన్నారు. అయ్యన్న పై పొంతనలేని అభియోగాలు మోపిన అంశాన్ని న్యాయస్థానంలో ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు.

అయ్యన్న పాత్రుడి అరెస్టును నిరసిస్తూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్వచ్ఛంద బంద్ పాటించారు. పట్టణంలోని వ్యాపార, వాణిజ్య , విద్యా సంస్థలను మూసివేశారు. దుకాణాదారులు స్వచ్ఛదంగా షాప్ లను బంద్‌ చేశారు.

అయ్యన్నకు ఊరట.. రిమాండ్​ను తిరస్కరించిన కోర్టు

న్యాయమే గెలిచింది: మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుకి న్యాయస్థానం రిమాండ్ తిరస్కరించడాన్నితెలుగుదేశం అధినేత చంద్రబాబు స్వాగతించారు. న్యాయం గెలిచింది.. న్యాయమే గెలుస్తుంది అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. అయ్యన్నతో తాము ఉన్నామంటూ చంద్రబాబు ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్ పెట్టారు

చంద్రబాబు ట్వీట్
చంద్రబాబు ట్వీట్

ఇవీ చదవండి:

Last Updated : Nov 3, 2022, 9:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.