ETV Bharat / state

అయ్యన్న సహా తొమ్మిది మందిపై కేసు

author img

By

Published : Apr 18, 2022, 5:50 AM IST

Ayyanna Patrudu
Ayyanna Patrudu

మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సహా తొమ్మిది మంది తెలుగుదేశం పార్టీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నర్సీపట్నంలో మరిడి మహాలక్ష్మి పండగ పెద్ద జాగారం సందర్భంగా 15న అబీద్‌ కూడలిలో ఏర్పాటైన ఓ స్టేజ్‌ ప్రోగ్రాంలో రాత్రి 11.10గంటల సమయంలో అయ్యన్నపాత్రుడు, ఆయన తనయుడు రాజేష్‌, తదితరులు పోలీసు విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు.

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సహా తొమ్మిది మంది తెలుగుదేశం పార్టీ నాయకులపై అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. నర్సీపట్నంలో మరిడి మహాలక్ష్మి పండగ పెద్ద జాగారం సందర్భంగా 15న అబీద్‌ కూడలిలో ఏర్పాటైన ఓ స్టేజ్‌ ప్రోగ్రాంలో రాత్రి 11.10గంటల సమయంలో అయ్యన్నపాత్రుడు, ఆయన తనయుడు రాజేష్‌, తదితరులు పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దూషించారని పేర్కొంటూ సెక్షన్‌ 353, 294(ఎ, బి), 504, 505 (ఎ, బి), 506, రెడ్‌విత్‌ 34కింద కేసు నమోదు చేశారు. నాతవరం ఎస్సై డి.శేఖరం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నర్సీపట్నం ఎస్సై నారాయణరావు పేర్కొన్నారు.

పండగ పేరుతో రాజకీయం: ఎమ్మెల్యే గణేష్‌

మరిడి మహాలక్ష్మి పండగ పేరుతో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నించారని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ ఆదివారం ఆరోపించారు. స్థానిక విలేకరులకు పంపిన వీడియో ప్రకటనలో మాట్లాడుతూ.. పండగలో తెదేపా కండువాలు, జెండాలు ఉంచడమే ఇందుకు నిదర్శనమన్నారు. పండగ పేరిట చందాల రూపేణా రూ.3కోట్లు దండుకున్నారని ఆరోపించారు. పోలీసులు తలచుకుంటే అయ్యన్నను లోపల వేయడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పారు.

మిగిలింది ఎమ్మెల్యేకే ఇచ్చేస్తాం: అయ్యన్న

‘రూ.3 కోట్లు వసూలు చేశానని ఎమ్మెల్యే గణేష్‌ చెబుతున్నారు. ఎవరెంత ఇచ్చారో చెప్పండి. ఖర్చుల లెక్కలు మేం చెబుతాం. మిగిలితే ఆయనకే ఇచ్చేస్తాం. తగిలితే పెట్టుకుంటారా. ఈ ఏడాది జాతర నిర్వహణకు రూ.9లక్షలు చందాలుగా వచ్చాయి...’ అని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ‘నాలుగు దశాబ్దాలుగా జాతర చేస్తున్నా. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నామనడం అర్థం లేని మాట. ఎమ్మెల్యే వెంట తిరుగుతున్న తన సోదరుడు చింతకాయల సన్యాసిపాత్రుడు అమ్మవారికి చెందిన కొన్ని వస్తువులను పండగకి తెచ్చి అలంకరించలేదు. భక్తులు ఇచ్చినవి దగ్గర ఉంచుకోకూడదని ఆయనకు ఎమ్మెల్యే చెప్పొచ్చు కదా...’ అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బాధ పడలేకే జాతరలో పోలీసులు ఇబ్బంది పెట్టారని అయ్యన్న ఆరోపించారు. ఐ.టీడీపీ రాష్ట్ర ఇన్‌ఛార్జి విజయ్‌ మాట్లాడుతూ జాతరలో ఎక్కడైనా తెదేపా జెండాలు కనిపించాయా అని ప్రశ్నించారు. పసుపు రంగు వస్త్రాలు ధరించడం శుభసూచికమని భక్తుల నమ్మకమన్నారు.

ఇదీ చదవండి: 'నన్ను అరెస్టు చేసినా.. పండుగ ఆపవద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.