'పెద్ద ఆటగాడు చాలా కాలంగా సెంచరీ చేయకపోవడం బాధాకరం'

author img

By

Published : Jun 23, 2022, 10:56 PM IST

Virat Kohli

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ఫామ్​పై లెజండరీ ప్లేయర్​ కపిల్‌ దేవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ లాంటి గొప్ప ఆటగాడు సెంచరీ లేకుండా చాలా కాలం గడపడం బాధగా ఉందన్నారు.

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ బాది రెండున్నరేళ్లు దాటింది. అతడు చివరిగా 2019 నవంబర్‌ 22న బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో శతకం బాదాడు. తర్వాత ఒక్కసారి కూడా మూడంకెల స్కోరును అందుకోలేదు. కోహ్లీ పేలవ ఫామ్‌పై భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ లాంటి గొప్ప ఆటగాడు సెంచరీ లేకుండా చాలా కాలం గడపడం బాధగా ఉందని కపిల్‌ దేవ్‌ అన్నారు. ఒక ఆటగాడి ప్రదర్శన సరైన స్థాయిలో లేకుంటే మాజీ ఆటగాడిగా దానిని ప్రశ్నించే హక్కు తనకు ఉందని ఆయన పేర్కొన్నారు.

'ఇంత పెద్ద ఆటగాడు చాలా కాలంగా సెంచరీ చేయకపోవడం బాధగా ఉంది. అతను మాకు హీరోలాంటివాడు. రాహుల్ ద్రవిడ్, సచిన్ టెందూల్కర్, సునీల్ గావస్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌లతో పోల్చగలిగే ఆటగాడిని మనం చూస్తామని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, ఇంత గొప్ప పేరు తెచ్చుకున్న కోహ్లీ.. సెంచరీ కోసం ఇన్నాళ్లు తీసుకోవడం చాలా బాధాకరం. అతను రెండేళ్లుగా సెంచరీ చేయకపోవడంతో అతని అభిమానులతోపాటు మేము నిరాశలో ఉన్నాం. నేను కోహ్లీ అంత క్రికెట్ ఆడలేదు. కొన్నిసార్లు మీరు తగినంత క్రికెట్ ఆడటం లేదు. కానీ, విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు పరుగులు చేయకపోతే, ఎక్కడో ఏదో తప్పు జరిగిందనుకుంటారు. అభిమానులు మీ ఆటతీరును మాత్రమే చూస్తారు. అది సరిగ్గా లేకుంటే వారు మౌనంగా ఉంటారని ఆశించవద్దు. అందుకే మీ బ్యాట్, ప్రదర్శన మాత్రమే మాట్లాడాలి' అని కపిల్ ముగించారు.

ఇదీ చదవండి: రేస్ మధ్యలో 'కోమా'లోకి స్విమ్మర్.. నీళ్లలో మునిగిపోయినా లక్కీగా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.