బ్రిజ్‌ భూషణ్‌పై లైంగిక ఆరోపణలు.. ఏడుగురు సభ్యులతో IOA కమిటీ..

author img

By

Published : Jan 20, 2023, 10:48 PM IST

Brij Bhushan IOA 7 Members Committee

డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌పై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు భారత ఒలిపింక్‌ సంఘం(ఐఓఏ) ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.

భారత రెజ్లింగ్‌ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై వస్తున్న లైంగిక ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌(ఐఓఏ) ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రముఖ బాక్సర్‌, రాజ్యసభ మాజీ సభ్యురాలు మేరీ కోమ్‌తోపాటు డోలా బెనర్జీ, అలక్‌నంద అశోక్‌, యోగేశ్వర్‌ దత్‌, సహదేవ్‌ యాదవ్‌ తదితరులు సభ్యులుగా ఉన్నారు. బ్రిజ్‌ భూషణ్‌ పై వస్తున్న ఆరోపణలపై ఈ బృంధం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనుంది. బ్రిజ్‌ భూషణ్‌ను డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్ష పదవి నుంచి తొలగించాంటూ ఆందోళనకు దిగిన రెజ్లర్ల బృందం ఐఓఏకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఓఏ కమిటీ నిర్ణయం తీసుకుంది.

నేను నోరు విప్పితే సునామీయే: బ్రిజ్‌ భూషణ్‌
భారత రెజ్లింగ్‌ సమాఖ్యకు వ్యతిరేకంగా రెజ్లర్లు ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ వ్యాఖ్యలు మరింత అలజడి రేపుతున్నాయి. నేను మాట్లాడటం మొదలు పెట్టానంటే.. సునామీ వస్తుంది. రెజ్లర్ల ప్రతి అంశాన్నీ బహిర్గతం చేయాలనుకుంటే భూమి కంపిస్తుంది అంటూ ఆయన వ్యాఖ్యానించడం మరిన్ని వివాదాలకు తావిస్తోంది. అంతేకాకుండా తాజా ఆందోళనలను బ్రిజ్‌ భూషణ్‌ షహీన్‌బాగ్ నిరసనలతో సరిపోల్చారు.

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌ భూషణ్‌ను డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షపదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ గత మూడు రోజులుగా భారత రెజ్లర్లు దిల్లీలో జంతర్​మంతర్​ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరికి దాదాపు 200 మంది మద్దతు తెలుపుతున్నారు. వీరంతా పార్లమెంట్‌ సమీపంలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనకు దిగారు. మా హక్కుల కోసం మేం పోరాడుతున్నాం. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిని బాయ్‌కాట్‌ చేస్తున్నాం అని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. దాదాపు 10-20 మంది మహిళా రెజ్లర్లపై బ్రిజ్‌ భూషణ్‌ లైంగిక చర్యలకు పాల్పడ్డారంటూ అగ్ర రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ ఆరోపించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సరైన సమయం చూసి అన్ని వివరాలను వెల్లడిస్తానని చెప్పింది.

మరోవైపు, తనపై వస్తున్న ఆరోపణలను బ్రిజ్‌ భూషణ్‌ ఖండించారు. ఎలాంటి విచారణను ఎదుర్కొనేందుకైనా సిద్ధమని తెలిపారు. ఏ తప్పూ చేయనప్పుడు డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్ష పదవికి ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. ఈ మేరకు ఇవాళ ఉదయం ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ కుట్ర వివరాలన్నీ బయటపెడతానని వెల్లడించారు. అయితే సమయం దాటినా ఆయన మీడియా ముందుకు రాలేదు. అయితే, మీడియా ముందుకు రావొద్దంటూ కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ సూచన మేరకు మీడియా సమావేశాన్ని వాయిదా వేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.