ETV Bharat / sports

ప్రపంచకప్‌లో టీమ్​ ఇండియా కొంప ముంచిన 'డాట్‌బాల్స్‌'!

author img

By

Published : Apr 7, 2022, 6:30 AM IST

women's world cup 2022: ఇటీవల జరిగిన మహిళల ప్రపంచకప్​లో టీమ్​ఇండియా లీగ్​ దశలోనే ఇంటిముఖం పట్టింది. కీలకమైన మ్యాచుల్లో అదృష్టం కలిసిరాలేదని అభిమానులు సర్దిచెప్పుకున్నా.. భారత మహిళల జట్టు ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటనేవి ఓసారి పరిశీలిద్దాం.

Womens Cricket
మహిళల క్రికెట్​ జట్టు

women's world cup 2022: మహిళల ప్రపంచకప్‌ విజేతగా ఆస్ట్రేలియా నిలవడం.. ఏడోసారి తన ఖాతాలో వేసుకోవడం.. గత ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ ఫైనల్‌లో ఓడిపోవడం.. మన టీమ్‌ఇండియా లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టడం చకచకా జరిగిపోయాయి. కీలకమైన మ్యాచుల్లో అదృష్టం కలిసిరాలేదని అభిమానులు సర్దుకుపోయారు. అయితే భారత మహిళల జట్టు ఓడిపోవడానికి కారణాలు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే.. టీమ్‌లో సరిదిద్దాల్సిన అంశాలు చాలానే ఉన్నాయనిపిస్తోంది. మరి అవేంటనేవి ఓ సారి చూద్దాం..

హర్మన్‌ బౌలింగ్‌ను ఉపయోగించుకోలేక: బ్యాటింగ్‌లో దూకుడు లేకపోవడం, సరైన రన్నింగ్, స్ట్రైక్‌ రొటేషన్‌ కొరవడటం వంటి ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్లేయర్లను కలిగి ఉన్నప్పటికీ లీగ్‌ స్టేజ్‌కే టీమ్‌ఇండియా పరిమితం కావడంపై విమర్శలు వచ్చాయి. కీలకమైన దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో 'నో బాల్' వల్ల మ్యాచ్‌ పోయిందని చెప్పినా.. టీమ్‌ఇండియా పరిస్థితికి అనేక కారణాలు ఉన్నాయనేది తాజా లెక్కలను చూస్తే తెలుస్తుంది. బ్యాటింగ్‌లో రాణించిన హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో బౌలింగ్‌లోనూ (2/42) అద్భుత ప్రదర్శన చేసింది. ఆ మ్యాచ్‌లో కీలక సమయంలో వికెట్లను తీసి టీమ్‌ఇండియాను రేసులో నిలిపింది. అయితే టోర్నీ ఆసాంతం హర్మన్‌ బౌలింగ్‌ ప్రతిభను సరిగా వినియోగించుకోవడంలో కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ విఫలమైంది. స్పిన్నర్లు స్నేహ్‌ రాణా, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్‌ ప్రదర్శన ఫర్వాలేదు.

Womens Cricket
హర్మన్‌ బౌలింగ్‌

పరుగులే రాలేదు: లీగ్‌ దశలో భారత్‌ ఆడిన ఏడు మ్యాచుల్లో సగంపైనే డాట్‌ బాల్స్‌ అంటే మన బ్యాటర్లు ఏ మేరకు ఆడారో అర్థం చేసుకోవచ్చు. అన్ని మ్యాచుల్లో కలిపి మొత్తం 1998 బంతులను ఎదుర్కొన్న భారత మహిళలు 1054 బంతులకు పరుగులు చేయకపోవడం గమనార్హం. అయితే వాటి లోటును పూరిస్తూ భారీ షాట్లు కొట్టారా..? అంటే అదీ లేదు. ఛాంపియన్‌ ఆసీస్‌ కూడా 959 బంతులను డాట్‌బాల్స్‌గా వదిలేసింది. అయితే పవర్‌ హిట్టింగ్‌ చేయడంతో లోటును భర్తీ చేయగలిగింది. " డాట్ బాల్‌ పర్సెంటేజీని తగ్గించాల్సిన అవసరం ఉంది. స్ట్రైక్‌ను రొటేట్‌ చేయాలి. ఇదే టీమ్ఇండియాకు సమస్యగా ఉన్నట్లుంది. క్విక్‌ సింగిల్‌ తీయడంలో విఫలమయ్యారు" అని భారత మాజీ ప్లేయర్‌ అంజుమ్‌ చోప్రా పేర్కొంది.

Womens Cricket
పరుగులు చేయటంలో ఇబ్బందులు పడిన అమ్మాయిలు

రన్‌ తీయడంలోనూ ఇబ్బందే: సీనియర్‌ బ్యాటర్లు సహా ప్రతి ఒక్కరూ రన్నింగ్‌ చేయడంలో ఇబ్బంది పడ్డారు. ఫీల్డింగ్‌లోనూ పెద్దగా చురుగ్గా లేరనిపించింది. వికెట్ల మధ్య పరుగులు తీసేందుకు కష్టపడలేదు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో కీలకమైన సమయంలో షెఫాలీ వర్మ రనౌట్‌ కావడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. "ఫిట్‌నెస్‌ మీద టీమ్‌ఇండియా దృష్టిసారించాలి. ఫీల్డింగ్‌లో గన్‌ లా దూసుకుపోవాలి. అప్పుడే మ్యాచ్‌లపై నియంత్రణ కలిగి ఉంటాం. ప్రతి ప్లేయర్‌ వ్యక్తిగతంగా ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవాలి" అని అంజుమ్‌ సూచించింది. సీనియర్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌, పేసర్‌ శిఖా పాండేకు ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కలేదు. అలానే షెఫాలీ వర్మను తీసుకున్నా కొన్ని మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితం చేయాల్సి వచ్చింది. టోర్నీకి ముందు కెప్టెన్‌ మిథాలీరాజ్‌ కూడా షెఫాలీని పొగడ్తలతో ముంచెత్తింది. ప్రపంచకప్‌లో కీలక బ్యాటర్‌గా మారుతుందని ఆకాంక్షించింది. కొన్ని ఓవర్లలోనే మ్యాచ్‌ను మలుపు తిప్పగలిగే సత్తా ఉందని ప్రశంసించింది. అయితే పాక్‌తో మ్యాచ్‌లో విఫలం కావడంతో వరుసగా మూడు మ్యాచుల్లో స్థానం కల్పించలేదు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేసింది.

Womens Cricket
షెఫాలీ వర్మ

కోచ్‌ కోసం కుర్చీలాట: గత ఐదేళ్లలో నలుగురు కోచ్‌లు మారారు. ప్రస్తుతం రమేశ్‌ పొవార్‌ రెండోసారి కోచ్‌గా కొనసాగుతున్నాడు. అంతకుముందు తుషార్‌ ఆరోథే, డబ్ల్యూ రామన్‌ పదవీ బాధ్యతలు చేపట్టారు. తుషార్ మార్గదర్శకంలోని భారత జట్టు 2017 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాను ఫైనల్‌కు చేరింది. అయితే కఠినమైన ప్రాక్టీస్‌ సెషన్ల నెపంతో తుషార్‌కు బదులు రమేశ్‌ పొవార్‌ను తీసుకొచ్చారు. అయితే కెప్టెన్‌ మిథాలీరాజ్‌, పొవార్‌ మధ్య విభేదాలు తలెత్తడంతో రామన్‌ను ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ఆదేశాల నేపథ్యంలో రామన్‌కు బదులు రమేశ్‌ పొవార్‌కే మరోసారి హెడ్‌కోచ్‌ బాధ్యతలు దక్కాయి. అయితే ఈసారి మాత్రం లీగ్‌ దశకే పరిమితమై ఇంటిముఖం పట్టడం గమనార్హం.

Ramesh pawar
రమేశ్​ పొవార్​

ఇంకానూ పాత పద్ధతిలోనే బ్యాటింగ్‌: ఒకప్పుడు వన్డే మ్యాచ్‌ అంటే తొలి 15 ఓవర్లు దూకుడుగా ఆడి.. మిడిల్‌ ఓవర్లలో నిలకడగా ఆడేవారు. ఆఖరి పది ఓవర్లు హిట్టింగ్‌ చేసి భారీ స్కోరు చేయడానికి ప్రయత్నించేవారు. అయితే వికెట్లు పడితే మాత్రం స్వల్ప స్కోర్లకే పరిమితం కావాల్సి వచ్చేది. దీనివల్ల బౌలర్లకు పట్టు దొరికే అవకాశాలు ఎక్కువ. అయితే ఇప్పుడు తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు దూకుడుగా ఆడటమే.. పొట్టి ఫార్మాట్ వచ్చాక హార్డ్‌హిట్టింగ్‌, పవర్‌ హిట్టింగ్‌ మరీ ఎక్కువైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా జట్లు ఇవే ప్రణాళికలతో చెలరేగాయి. బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో యువతకు ఎక్కువ అవకాశాలు ఇచ్చి వచ్చే ప్రపంచకప్‌ నాటికైనా జట్టును పటిష్ఠంగా తయారు చేయాల్సిన ఆవశ్యకత ఉంది.

Womens Cricket
మహిళల జట్టు

ఇదీ చూడండి: పొవార్ స్థానంలో లక్ష్మణ్!.. అమ్మాయిల రాత మారేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.