ETV Bharat / sports

'టెస్టుల్లోనూ సూర్య ఆడాలి... మూడు ఫార్మాట్లలో అతడు కీలకం'

author img

By

Published : Jan 3, 2023, 8:17 AM IST

క్రికెట్లో ఓ రేంజ్​లో దూసుకుపోతున్న సూర్యకుమార్‌ యాదవ్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్​లో అదరగొట్టాడు. దీంతో అతనికి టెస్టు క్రికెట్‌ కూడా ఆడే అవకాశం ఇవ్వాలని అని కోరుకుంటున్నాడు టీమ్​ఇండియా టీ20 కొత్త కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య.

surya kumar yadav in test series
surya kumar yadav

పరిమిత ఓవర్ల క్రికెట్లో అదరగొడుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌కు టెస్టు క్రికెట్‌ కూడా ఆడే అవకాశం ఇవ్వాలని అంటున్నాడు భారత టీ20 కొత్త కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య. మూడు ఫార్మాట్లలోనూ అతడు కీలకం కానున్నాడని చెప్పాడు. టెస్టు క్రికెట్‌ ఆడాలన్నది తన కలని ఇటీవల సూర్య చెప్పిన సంగతి తెలిసిందే. "నేను ఇంతకుముందు కూడా చెప్పాను. సూర్య ఆలస్యంగా అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చాడు. అతడు భారత జట్టులో ఉండాలని నేను 2020లోనే అనుకున్నా. కానీ దురదృష్టవశాత్తు అతడు లేడు. అయితే గతంలో అతడు పొందలేనిదాన్ని ఇప్పుడు దేవుడు ఇచ్చాడు. అతడు ఆలస్యంగా వచ్చాడు. కానీ ఇంతకుముందే అవకాశమొస్తే ఎలా ఆడేవాడో ఇప్పుడూ అలాగే ఆడుతున్నాడు" హార్దిక్‌ అన్నాడు. "సూర్య ముందు ముందు అన్ని ఫార్మాట్లలోనూ ముఖ్య ఆటగాడవుతాడు. టెస్టు క్రికెట్లో కూడా. అట స్వరూపాన్నే మార్చే సామర్థ్యం అతడికి ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడు ఎంత ముఖ్యమైన ఆటగాడో అందరికీ తెలుసు. మేనేజ్‌మెంట్‌ దృష్టిలో అతడు చాలా కీలక ఆటగాడు. సూర్య మరింత ఎదగాలని కోరుకుంటున్నాం" అని అన్నాడు.

మా లక్ష్యం అదే..: 2024 టీ20 ప్రపంచకప్‌ గెలవడమే తమ లక్ష్యమని హార్దిక్‌ అన్నాడు. కొత్త ఏడాది తీర్మానాల గురించి మాట్లాడుతూ.. "మేం టీ20 ప్రపంచకప్‌ గెలవాలనుకుంటున్నాం. అదే మా అతి పెద్ద తీర్మానం. అందుకోసం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాం. పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయి" అని శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ నేపథ్యంలో హార్దిక్‌ వ్యాఖ్యానించాడు. గత టీ20 ప్రపంచకప్‌లో రక్షణాత్మక వల్ల జట్టు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని అతడు అంగీకరించాడు.

హార్దిక్‌ ఎవరి పేరునూ ప్రస్తావించలేదు కానీ.. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ డిఫెన్సివ్‌ ఆటతో విమర్శలపాలైన సంగతి తెలిసిందే. "ప్రపంచకప్‌కు ముందు మేము ఎలాంటి తప్పులు చేయలేదు. దూకుడుగా ఆడాం. కానీ ప్రపంచకప్‌లో అంతా మేము అనుకున్నట్లు సాగలేదు" అని హార్దిక్‌ చెప్పాడు. ఆటగాళ్లకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని, వాళ్లు స్వేచ్ఛగా ఆడాలని అన్నాడు. "ఆటగాళ్లందరికీ నావైపు నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. ఈ విషయాన్ని వాళ్లు నమ్మేలా చేయాలి" అని చెప్పాడు.

పంత్‌ ప్రభావం: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పంత్‌ గైర్హాజరీ జాతీయ జట్టు సమతూకంపై ప్రభావం చూపుతుందని టీ20 కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య తెలిపాడు. పంత్‌ త్వరగా కోలుకోవాలని అతను ఆకాంక్షించాడు. "పంత్‌కు జరిగిన ప్రమాదం దురదృష్టకరం. ఇలాంటి వాటిని నియంత్రించడం ఎవరి చేతుల్లోనూ ఉండదు. అతను త్వరగా కోలుకోవాలని జట్టుగా కోరుకుంటున్నాం. అతని లోటు జట్టుపై ప్రభావం చూపుతుంది"అని అన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.