ETV Bharat / sports

WPL 2023 : రెండేళ్ల పాపను వదిలి.. సమరానికి సై అంటున్న తెలుగు క్రికెటర్

author img

By

Published : Feb 28, 2023, 8:30 AM IST

WPL 2023 : రెండేళ్ల కుమార్తెను విడిచిపెట్టి మహిళల ప్రీమియర్​ లీగ్​ సమరానికి సిద్ధమైంది తెలుగు తేజం స్నేహ దీప్తి. ఈ లీగ్​లో సత్తాచాటి మళ్లీ టీమ్​ఇండియాకు ఆడాలనే పట్టుదలతో సాధన చేస్తోంది. తాజాగా తన డబ్ల్యూపీఎల్​ టీమ్ పోస్టు చేసిన వీడియోలో భావోద్వేగానికి గురైంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను అమ్మాయిలకు ఆదర్శంగా నిలవాలనుకుంటున్నట్లు తెలిపింది. తాను చేయగా లేనిది.. మిగతా అమ్మాయిలు ఎందుకు చేయలేరని చెప్పుకొచ్చింది. ఇంకా ఏమందంటే..

wpl 2023 sneha deepthi
wpl 2023 sneha deepthi

WPL 2023 : తన రెండేళ్ల కూమార్తెను వదిలిపెట్టి మహిళల ప్రీమియర్​ లీగ్(డబ్ల్యూపీఎల్)​కు రెడీ అయింది తెలుగు తేజం స్నేహ దీప్తి. తనను వదలి భారంగా ముందుకెళ్తున్న అమ్మను బాగా ఆడమని తన రెండేళ్ల తనయ క్రివా చెప్పిందని దీప్తి తెలిపింది. ఇలాంటి సమయంలో తన కుమార్తెను విచిడిపెట్టి ఉండటం కష్టమేనని.. కానీ తప్పడం లేదని స్నేహ దీప్తి భావోద్వేగానికి గురైంది. క్రీవాను జాగ్రత్తగా చూసుకుంటానని తాను బయల్దేరే ముందు తన భర్త మాటిచ్చాడని దీప్తి చెప్పింది. కాగా, ఇటీవల జరిగిన డబ్ల్యూపీఎల్​ వేలంలో 26 ఏళ్ల స్నేహ దీప్తిని దిల్లీ క్యాపిటల్స్‌ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ మేరకు దిల్లీ క్యాపిటల్స్​ పోస్టు చేసిన ఓ వీడియోలో దీప్తి మాట్లాడింది. ''ఈ సమయంలో క్రివాకు దూరంగా ఉండడం చాలా కష్టం. కానీ నా భర్త మాటిచ్చాడు. 'నువ్వు వెళ్లు, నేను క్రివాను చూసుకుంటా' అని చెప్పాడు. హోటల్‌ చేరిన వెంటనే ఆయనకు ఫోన్‌ చేశా. అప్పుడు క్రివా నవ్వుతూ మాట్లాడింది. 'బాగా ఆడు' అని చెప్పింది'' అని స్నేహ దీప్తి తెలిపింది. 2021 ఫిబ్రవరిలో కుమార్తెకు జన్మనిచ్చిన దీప్తి.. తిరిగి సెప్టెంబర్‌లో డొమెస్టిక్ క్రికెట్‌ ఆడింది.

'' నేను ముంబయిలో దిల్లీ జట్టు ఉన్న హోటల్‌కు వచ్చే సమయంలో క్రివా ఏడ్చింది. అప్పుడు వెళ్లాలా? వద్దా? అనే సందేహం కలిగింది. క్రికెట్‌, కుటుంబం రెండూ నాకు ముఖ్యమే. కానీ కెరీర్‌ కూడా ఎంతో ముఖ్యమైంది. ఇంత దూరం వచ్చా. కాబట్టి ఇక వెనుకడుగు వేయొద్దని నిర్ణయించుకున్నా. టీమ్​తో చేరాలని నిర్ణయించుకున్నా. పూర్తిస్థాయిలో నా ఆటను ఆస్వాదించాలి. ఇది నాకో మంచి ఛాన్స్. లీగ్‌లో ఉత్తమ ప్రదర్శనతో విజయవంతమవ్వాలి. అమ్మాయిలకు ఆదర్శంగా నిలవాలనుకుంటున్నా. నేను సాధించగా లేనిది.. మిగతావాళ్లు ఎందుకు చేయలేరు? అనేలా స్ఫూర్తి నింపాలనుకుంటున్నా''

--స్నేహ దీప్తి, క్రికెటర్​

స్నేహ దీప్తి 16 ఏళ్లకే టీమ్ఇండియా తరఫున టీ20, వన్డేల్లో అరంగేట్రం. ఇప్పటివరకు దీప్తి కేవలం రెండు టీ20లు, ఓ వన్డే మాత్రమే ఆడింది. ప్రస్తుతం స్టార్​ ప్లేయర్​గా ఉన్న స్మృతి మంధాన కూడా దీప్తి అరంగేట్రం చేసిన సమయంలోనే బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌తోనే కెరీర్​ స్టార్ట్​ చేసింది. అవకాశాలు వచ్చి, అద్భుత ప్రదర్శనతో మంధాన జట్టులో కీలక బ్యాటర్‌గా ఎదిగింది. కానీ దీప్తికి అదృష్టం కలిసి రాక.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్​ తరఫున దేశవాళీ క్రికెట్లో కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు రెండేళ్ల చిన్నారికి అమ్మగా ఉన్న దీప్తికి.. మహిళల ప్రీమియర్​ లీగ్​ రూపంలో రెండో సారి అవకాశం వచ్చింది. ఈ లీగ్​లో సత్తాచాటి.. మళ్లీ టీమ్​ఇండియాకు ఎంపిక కావాలనే లక్ష్యంతో ఆమె సన్నద్ధమవుతోంది. శనివారం ప్రారంభమయ్యే డబ్ల్యూపీఎల్‌ ఆరంభ సీజన్‌ కోసం దిల్లీ క్యాపిటల్స్‌ శిబిరంలో చేరి సాధన మొదలెట్టింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.