ETV Bharat / sports

T20 world cup 2021: కోహ్లీసేన బలాలు, బలహీనతలు

author img

By

Published : Oct 23, 2021, 6:45 AM IST

టీ20 ప్రపంచకప్​లో భారత్ భారీ అంచనాలతో (T20 world cup 2021) బరిలోకి దిగుతోంది. మేటి ఆటగాళ్లతో నైపుణ్యాలకు కొదవలేని జట్టుగా టీమ్​ఇండియా పేరుగాంచింది. అయితే.. కోహ్లీ సేనలో బలాలతో పాటు బలహీనతలూ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా?

T20 world cup 2021
టీ20 ప్రపంచకప్ 2021

2007లో తొలి టీ20 ప్రపంచకప్‌లో పెద్దగా అంచనాల్లేకుండా (T20 world cup 2021) బరిలోకి దిగి సంచలన ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచింది టీమ్‌ఇండియా. ఆ తర్వాత ప్రతి టోర్నీలోనూ (T20 world cup latest news) భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది కానీ.. కప్పు మాత్రం అందుకోవట్లేదు. ఎప్పట్లాగే ఈసారి కూడా ఫేవరెట్లలో భారత్‌ ఒకటి. అయితే కప్పు గెలవడానికి అవసరమైన బలాలు భారత్‌కున్నా.. కొన్ని బలహీనతలు కోహ్లీసేన అవకాశాలపై ప్రభావం చూపేలా ఉన్నాయి.

భారత్‌ ఎందుకు గెలుస్తుంది?

  • ప్రపంచకప్‌ బరిలో ఉన్న ఏ జట్టుకూ తీసిపోని బ్యాటింగ్‌ విభాగం భారత్‌కుంది. పైగా ప్రధాన బ్యాట్స్‌మెన్‌ మంచి ఫాంలో ఉన్నారు. కోహ్లి, రోహిత్‌, రాహుల్‌.. బ్యాటింగ్‌ అనుభవం, నైపుణ్యాల పరంగా ఈ ముగ్గురూ ఎవరికి వారే సాటి. వీరికి తోడు సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌, రిషబ్‌ పంత్‌లతో బ్యాటింగ్‌ చాలా బలంగా కనిపిస్తోంది. వీళ్లందరూ కూడా ప్రపంచకప్‌ ముంగిట ఫామ్‌ను చాటుకున్నవారే. అనుభవానికి తోడు దూకుడూ కలిగి ఉండటం భారత బ్యాటింగ్‌ ప్రత్యేకతను చాటేదే.
  • యూఏఈ పిచ్‌లకు నప్పే స్పిన్‌ బలం భారత్‌ సొంతం. అత్యంత అనుభవజ్ఞుడైన అశ్విన్‌కు తోడు రాహుల్‌ చాహర్‌, వరుణ్‌ చక్రవర్తి లాంటి యువ ప్రతిభావంతులతో స్పిన్‌ విభాగం దృఢంగా కనిపిస్తోంది. వీరికి తోడు జడేజా కూడా ఉన్నాడు.
  • మహ్మద్‌ షమి, జస్‌ప్రీత్‌ బుమ్రా లాంటి ప్రపంచ స్థాయి పేస్‌ బౌలర్లు టీమ్‌ఇండియాకు అండగా ఉన్నారు. వీళ్లిద్దరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఐపీఎల్‌లో సత్తా చాటారు. వార్మప్‌ మ్యాచ్‌లోనూ ఆకట్టుకున్నారు. మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా మారినపుడు, ఒత్తిడిలో గొప్పగా బౌలింగ్‌ చేయగల నైపుణ్యం వీరి సొంతం.
  • కోహ్లికిది టీ20 కెప్టెన్‌గా చివరి టోర్నీ. అతను బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా సర్వశక్తులూ ఒడ్డుతాడనడంలో సందేహం లేదు. సహచరులు కూడా కప్పుతో అతడికి ఘనంగా వీడ్కోలు పలకడం కోసం గట్టిగా ప్రయత్నించే అవకాశముంది.
  • కెప్టెన్‌గా గొప్ప పేరున్న ధోని రిటైర్మెంట్‌ తర్వాత మార్గదర్శకుడి పాత్రలో టీమ్‌ఇండియాలోకి తిరిగొస్తున్నాడు. జట్టు కూర్పుతో పాటు మ్యాచ్‌ ప్రణాళికల్లో ధోని కీలక పాత్ర పోషించనున్నాడు. అతడి వ్యూహాలు జట్టుకు కలిలిసొస్తాయనడంలో సందేహం లేదు. మ్యాచ్‌లో కీలక సమయాల్లో డగౌట్‌ నుంచి కూడా ధోని తోడ్పాటు అందించడానికి అవకాశముంది.
  • వరుసగా రెండు ఐపీఎల్‌లు యూఏఈలో జరగడంతో ఇక్కడి పిచ్‌లపై భారత ఆటగాళ్లందరికీ చక్కటి అవగాహన ఏర్పడింది. వాతావరణం, వికెట్లపై పట్టు చిక్కింది. మిగతా జట్ల ఆటగాళ్లు కూడా ఐపీఎల్‌లో పాల్గొన్నప్పటికీ.. భారత జట్టులోని ప్రతి ఆటగాడూ ఇక్కడ బోలెడన్ని మ్యాచ్‌లాడటం కలిసొచ్చే అంశం.

ఎందుకు గెలవదు?

  • టీ20 క్రికెట్లో ఆల్‌రౌండర్ల పాత్ర కీలకం. జట్టులో సమతూకం తెచ్చేది, బలాన్ని పెంచేది వాళ్లే. ఆ బలం భారత్‌కు ఆశించిన స్థాయిలో లేదు. ముఖ్యంగా నిఖార్సయిన పేస్‌ ఆల్‌రౌండర్‌ లేకపోవడం భారత్‌కు ప్రతికూలతే. ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ లాంటి జట్లలో ఇద్దరు ముగ్గురు పేస్‌ ఆల్‌రౌండర్లున్నారు. కానీ భారత్‌లో హార్దిక్‌ పాండ్య పేరుకే పేస్‌ ఆల్‌రౌండర్‌. అతను బౌలింగే చేయట్లేదు. ప్రస్తుత జట్టులో జడేజా ఒక్కడే పూర్తి స్థాయి ఆల్‌రౌండర్‌. అయితే అతను బౌలింగ్‌లో అంతగా రాణించట్లేదు.
  • కోహ్లి ఒకప్పుడు జట్టుకు అతి పెద్ద బలంగా ఉండేవాడు. ఈ మధ్య తన స్థాయికి తగ్గట్లు ఆడట్లేదు. ఇప్పటికీ అతడి నైపుణ్యాలను తక్కువ చేసి చూడలేం కానీ.. మునుపటిలా ఆడలేకపోతుండటం కలవరపరుస్తోంది. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరఫున కెప్టెన్‌గా చివరి ప్రయత్నంలోనూ కప్పు అందుకోలేకపోయిన విరాట్‌.. ఇక్కడ ఏమాత్రం ఒత్తిడిని అధిగమించి జట్టును విజేతగా నిలుపుతాడన్నది సందేహంగా మారింది. విరాట్‌కు కప్పుతో వీడ్కోలు పలకాలనే ప్రయత్నంలో ఆటగాళ్లు ఒత్తిడికి లోనయ్యేందుకూ ఆస్కారముంది.
  • పేస్‌ విభాగంలో బుమ్రా, షమిల వరకు తిరుగులేదు కానీ.. వారికి సహకారం అందించే బలమైన మూడో పేసర్‌ లేకపోవడం లోటే. భువనేశ్వర్‌ తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు. శార్దూల్‌ ఠాకూర్‌ ఫాంలో ఉన్నా.. అతను ధారాళంగా పరుగులిచ్చేస్తాడు. ఒక మ్యాచ్‌లో గొప్పగా రాణించి.. ఇంకో మ్యాచ్‌లో తేలిపోతుంటాడు.
  • స్పిన్నర్లు ముగ్గురూ ఫామ్‌లో ఉన్నారు కానీ.. ఐపీఎల్‌లో గొప్పగా రాణించిన వరుణ్‌ చక్రవర్తికి ఫిట్‌నెస్‌ సమస్యలున్నాయి. మోకాలి గాయం అతణ్ని వేధిస్తూ ఉంది. అతను ఎప్పుడు మైదానానికి దూరమవుతాడో తెలియని పరిస్థితి నెలకొంది. ఐపీఎల్‌లో అదరగొట్టిన లెగ్‌స్పిన్నర్‌ చాహల్‌ జట్టులో లేకపోవడం ప్రతికూలతే.
  • మిడిలార్డర్లో ఒకప్పటి ధోని తరహాలో ఫినిషర్‌ పాత్రను సమర్థంగా పోషించే ఆటగాడు లేకపోవడం భారత్‌కు ప్రతికూలతే. హార్దిక్‌ పాండ్య, రిషబ్‌ పంత్‌ ఈ పాత్ర పోషించగలరన్న అంచనాలున్నప్పటికీ.. వీళ్లిద్దరూ అవసరమైనపుడు సహనంతో ఆడే ఓపిక ఉండదు. ఒత్తిడిని ఎంతమేర తట్టుకుంటారన్నది ప్రశ్నార్థకమే. బౌలర్లు బ్యాటుతో ఏమేర ఆదుకుంటారన్నది సందేహమే.

ముప్పు ఆ మూడింటితోనే..

టీమ్‌ఇండియా బలంగానే కనిపిస్తున్నా.. ప్రపంచకప్‌లో మనవాళ్లకు గట్టి పోటీనిచ్చే, కప్పు గెలిచే సామర్థ్యం ఉన్న జట్లు కొన్ని ఉన్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇంగ్లాండ్‌ గురించే. 2015 వన్డే ప్రపంచకప్‌లో ఘోర వైఫల్యం తర్వాత ఈ జట్టు ఆటే మారిపోయింది. టెస్టు జట్టుగా ఉన్న ముద్రను పోగొట్టుకుంటూ.. దూకుడైన ఆటతో వన్డేలు, టీ20ల్లో మేటి జట్టుగా ఎదిగింది. ఈ క్రమంలోనే 2019 వన్డే ప్రపంచకప్‌ను గెలిచింది. బట్లర్‌, రాయ్‌, మలన్‌, బెయిర్‌స్టో లాంటి విధ్వంసకారులు.. మొయిన్‌ అలీ, లివింగ్‌స్టోన్‌, సామ్‌ కరన్‌ లాంటి ఆల్‌రౌండర్లతో ఆ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. అవసరమైతే జోర్డాన్‌, వోక్స్‌, విల్లీ లాంటి బౌలర్లూ బ్యాటుతో సాయపడతారు. సమతూకంతో, ఎంతో ప్రమాదకరంగా కనిపిస్తున్న ఇంగ్లాండ్‌.. భారత్‌కు ఎదురైతే పరిస్థితేంటో చూడాలి. మరోవైపు టీ20ల్లో వెస్టిండీస్‌ ఎంత ప్రమాదకరమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. టీ20 ప్రపంచకప్‌ను రెండుసార్లు గెలిచిన ఏకైక జట్టు అదే. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల్లో విపరీతంగా మ్యాచ్‌లాడి ఈ ఫార్మాట్లో రాటుదేలిపోయారు విండీస్‌ వీరులు. లూయిస్‌, సిమన్స్‌, ఫ్లెచర్‌, పొలార్డ్‌, గేల్‌, రసెల్‌ లాంటి విధ్వంసక బ్యాట్స్‌మెన్‌ ఆ జట్టు సొంతం. ఆల్‌రౌండర్లకూ లోటు లేదు. లోతైన బ్యాటింగ్‌ విండీస్‌ మరో బలం. ఏ స్థితిలోనైనా ఫలితాలను మార్చేసే ఆటగాళ్లు కరీబియన్‌ జట్టులో ఉన్నారు. ఇక కప్పు వేటలో అండర్‌ డాగ్‌గా బరిలో ఉన్నది న్యూజిలాండ్‌ జట్టు. వన్డే, టీ20 ప్రపంచకప్‌ రెండింట్లోనూ కివీస్‌ను ఎప్పుడూ ఫేవరెట్‌గా పరిగణించరు కానీ.. ఎంతో నిలకడగా ఆడే జట్టది. వార్మప్‌ మ్యాచ్‌లు రెండింట్లోనూ ఓడిపోయినా, ఇటీవలి ఫామ్‌ ఏమంత బాగా లేకున్నా కివీస్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కివీస్‌కు ఎప్పుడూ ఆల్‌రౌండర్ల అండ ఉంటుంది. ఈసారి నీషమ్‌, మిచెల్‌, శాంట్నర్‌, ఉన్నారు. వీరికి తోడు బ్యాటింగ్‌లో విలియమ్సన్‌, గప్తిల్‌, కాన్వాయ్‌, ఫిలిప్స్‌.. బౌలింగ్‌లో బౌల్ట్‌, సౌథీ, జేమీసన్‌, ఫెర్గూసన్‌, ఇష్‌ సోధి లాంటి నాణ్యమైన ఆటగాళ్లతో కివీస్‌ బలంగా కనిపిస్తోంది. సెమీస్‌కు భారత్‌తో పాటుగా పై మూడు జట్లే వచ్చే అవకాశముంది. వీటిని దాటితేనే భారత్‌కు కప్పు దక్కే ఛాన్సుంది. పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా జట్ల అవకాశాలనూ కొట్టిపారేయలేం కానీ.. వాటి నుంచి భారత్‌కు ముప్పు తక్కువే.

వీళ్లు కీలకం: కోహ్లి, రోహిత్‌, రాహుల్‌, బుమ్రా, షమి, జడేజా.
భారత జట్టు: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌, రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌, రిషబ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్య, జడేజా, అశ్విన్‌, వరుణ్‌ చక్రవర్తి, రాహుల్‌ చాహర్‌, షమి, బుమ్రా, భువనేశ్వర్‌, శార్దూల్‌ ఠాకూర్‌.
స్టాండ్‌బైలు: శ్రేయస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌, దీపక్‌ చాహర్‌.

ఇదీ చదవండి:T20 worldcup: సూపర్​-12లో మొదటి విజయం ఎవరిదో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.