ETV Bharat / sports

8 నెలల్లో ఆరుగురు కెప్టెన్లు.. ద్రవిడ్​ ఏం అన్నాడంటే?

author img

By

Published : Jun 20, 2022, 6:56 AM IST

Teamindia Six captains in eight months: గత 8 నెలల్లో వివిధ ఫార్మాట్లలో టీమ్​ఇండియాకు ఆరుగురు కెప్టెన్లుగా వ్యవహరించడం.. ప్రణాళికతో జరిగింది కాదని ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పేర్కొన్నాడు. అయితే దీనివల్ల మరింత మంది నాయకులను తయారు చేసే అవకాశం లభించిందని అన్నాడు.

rahul dravid
రాహుల్ ద్రవిడ్​

Teamindia Six captains in eight months: గత 8 నెలల్లో వివిధ ఫార్మాట్లలో ఆరుగురు కెప్టెన్లు భారత జట్లను నడిపించడమన్నది ప్రణాళికతో జరిగింది కాదని ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు. జట్టులో మరింత మంది నాయకులను తయారు చేసేందుకు తమకు అవకాశాలు దక్కాయని చెప్పాడు. టీ20 ప్రపంచకప్‌ తర్వాత నిరుడు నవంబరులో ద్రవిడ్‌ భారత జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అంతకుముందు జులైలో శ్రీలంకలో పర్యటించిన జట్టుకు తాత్కాలికంగా కోచ్‌గా వ్యవహరించాడు. అప్పటి నుంచి వివిధ సిరీస్‌లకు ధావన్‌, కోహ్లీ, రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌, పంత్‌, హార్దిక్‌ పాండ్య (ఐర్లాండ్‌ పర్యటనకు కెప్టెన్‌) భారత జట్లకు నాయకులుగా ఉన్నారు. బయో బబుల్‌ విరామాలు, ఒకే సమయంలో రెండు సిరీస్‌లు జరగడం, గాయాలు.. ఎక్కువ మంది భారత జట్లకు సారథ్యం వహించడానికి కారణాలు.

"గత ఎనిమిది నెలల్లో మా జట్టులో ఆరుగురు కెప్టెన్లయ్యారు. ఇంతమందికి పగ్గాలు అప్పగించడమన్నది అనుకుని చేసింది కాదు. భారత్‌ చాలా మ్యాచ్‌లు ఆడుతుండడం ఇలా జరగడానికి కారణం. మరింత మంది నాయకులను తయారు చేసేందుకు మాకు అవకాశాలు లభించాయి" అని ద్రవిడ్‌ చెప్పాడు. మరింతగా మెరుగయ్యేందుకు ఎంతో కృషి చేస్తున్నామని అన్నాడు. టెస్టు క్రికెట్‌ పరంగా చూస్తే దక్షిణాఫ్రికా పర్యటన కాస్త నిరాశ కలిగించిందని చెప్పాడు. ఐపీఎల్‌ ద్వారా చాలా మంది ప్రతిభావంతులైన పేస్‌ బౌలర్లు వెలుగులోకి రావడం పట్ల ద్రవిడ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ఇది భారత క్రికెట్‌కు శుభసూచకమని చెప్పాడు.

ఇదీ చూడండి: వరుణుడి ఆటంకం.. ఐదో టీ20 రద్దు.. సిరీస్ డ్రా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.