ETV Bharat / sports

డయేరియా బారిన పడ్డ సచిన్​.. అండర్‌వేర్‌లో టిష్యూస్​ పెట్టుకొని మరీ మ్యాచ్​ ఆడి..!

author img

By

Published : Apr 8, 2023, 3:58 PM IST

అంతర్జాతీయ క్రికెట్​లోకి 16 ఏళ్లకే అరంగేట్రం చేసి అశేష అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు సచిన్​ తెందుల్కర్​. అయితే అతడు ఓ మ్యాచ్​లో అండర్​వేర్​లో టిష్యూ పేపర్లు పెట్టుకొని బ్యాటింగ్‌ చేశాడని మీకు తెలుసా? మరి ఆ మ్యాచ్​లో భారత్​ గెలిచిందా?

sachin
sachin

స‌చిన్ తెందుల్కర్​.. ఈ పేరు వింటేనే ఏదో తెలియ‌ని వైబ్రేష‌న్స్! అతడు బ్యాటింగ్‌కు దిగితే పూనకాలే! 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న మాస్టర్ బ్లాస్టర్ క్రికెట్‌కే వన్నెతెచ్చాడు. 16 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో అసాధ్యమైన డబుల్ సెంచరీని సుసాధ్యం చేశాడు. 100 సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. క్రికెటంతా ఒక చరిత్ర అయితే తానే ఓ చరిత్రగా మిగిలి 'భారత రత్నం'అయ్యాడు!

తన కెరీర్‌లో ఆరు వన్డే వరల్డ్‌ కప్‌లు ఆడిన మాస్టర్.. 2003 ప్రపంచకప్‌లో మాత్రం చెలరేగాడు. సౌతాఫ్రికా వేదికగా జరిగిన ఆ మెగా టోర్నీలో అతడి ఫామ్‌ అదుర్స్​. ఆ వరల్డ్‌కప్‌‌లో మొత్తం 11 మ్యాచ్‌లు ఆడిన సచిన్‌ రికార్డుస్థాయిలో 674 పరుగులు సాధించాడు. దాయాది జట్టు పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కండరాలు పట్టేసినా, ఆ నొప్పిని పక్కనపెట్టి 98 పరుగులు సాధించి చేసి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. చాలామందికి ఈ మ్యాచ్‌లో సచిన్‌ కండరాల నొప్పి గురించి మాత్రమే తెలుసు. కానీ తర్వాత జరిగిన శ్రీలంకతో సూపర్‌ సిక్స్‌ దశ మ్యాచ్‌లో తెందుల్కర్​ తీవ్ర ఆరోగ్య సమస్య ఎదుర్కొన్న విషయం ఎవరికీ తెలీదు.

ఆ సమస్యేంటో సచిన్​ స్వయంగా.. తన ఆటో బయోగ్రఫీ 'ప్లేయింగ్‌ ఇట్‌ మై వే'లో వెల్లడించాడు. 'నా కెరీర్‌లో తొలిసారి పాక్‌తో మ్యాచ్‌లో రన్నర్‌ సాయం తీసుకున్నా. కానీ ఆ మ్యాచ్‌ తర్వాత డయేరియా బారినపడ్డా. 500 కేజీల బరువు మోస్తున్న వ్యక్తి ఎలాగైతే నిలుచోలేడో ఆ విధంగా తయారైంది నా పరిస్థితి. పాక్‌తో పోరులో బాగా అలసిపోవడంతో తర్వాత శ్రీలంకతో మ్యాచ్‌కు కోలుకొనేందుకు అధిక మొత్తంలో ద్రవపదార్థాలు తీసుకున్నా. దీంతో నీళ్ల విరేచనాలు మొదలయ్యాయి. ఎనర్జీ డ్రింక్‌లో ఉప్పు కలుపుకుని తాగినా ప్రయోజనం కనిపించలేదు. అయినా లంకతో మ్యాచ్‌లో ఆడాలనే నిర్ణయించుకున్నా. టిష్యూ పేపర్లు పెట్టుకొని బ్యాటింగ్‌ చేశా. డ్రింక్స్‌ బ్రేక్‌ సందర్భంగా డ్రెస్సింగ్‌ రూమ్‌ వెళ్లేంత వరకూ అసౌకర్యంగానే అనిపించింది' అని సచిన్​ చెప్పుకొచ్చాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

జట్టును గెలిపించాలంటే కొన్ని సార్లు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొవాలని ఈ మ్యాచ్ ఘటనపై ఎదురైన ఓ ప్రశ్నకు సచిన్ సమాధానమిచ్చాడు. 'జట్టును ఆదుకోవాల్సిన సందర్భాల్లో ఒక్కోసారి అలాంటి సవాళ్లు ఎదురవుతాయి. ఆ పరిస్థితుల్లో మనం బ్యాటింగ్‌ చేయగలిగే పరిస్థితుల్లో ఉన్నామా లేదా అని ఆలోచించకుండా బరిలోకి దిగాల్సి ఉంటుంది. నేనూ అలానే చేశా' అని సచిన్‌ బదులిచ్చాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.