ETV Bharat / sports

'కెప్టెన్​గా ఎందుకున్నావ్ మరి?'.. రూట్​పై పాంటింగ్ ఫైర్

author img

By

Published : Dec 22, 2021, 10:13 AM IST

Ponting on Root: యాషెస్ సిరీస్​లో భాగంగా ఇంగ్లాండ్​తో జరిగిన రెండు టెస్టుల్లో ఘనవిజయం సాధించింది ఆస్ట్రేలియా. అడిలైడ్ వేదికగా జరిగిన డేనైట్ టెస్టు ఓటమి అనంతరం ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ జో రూట్ మాట్లాడుతూ బౌలర్లను తప్పుబట్టాడు. ఘోర పరాజయాలకు బౌలర్లే కారణమని నిందించాడు. ఈ విషయంపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్‌ స్పందిస్తూ రూట్‌ తీరుపై ఘాటుగా స్పందించాడు.

Ponting on Joe Root, Joe Root captaincy, పాటింగ్ రూట్, రూట్ కెప్టెన్సీ
Joe Root

Ponting on Root: ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ టెస్ట్ సిరీస్‌లో.. ఇంగ్లాండ్‌ ఇప్పటికే 0-2 తేడాతో వెనుకంజలో ఉంది. తొలి టెస్టులో 9 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ జట్టు పరాజయం పాలవగా.. రెండో టెస్టులో చివరి వరకు పోరాడినా ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. దీంతో అసహనానికి గురైన ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆసీస్‌ చేతిలో ఎదురైన ఘోర పరాజయాలకు బౌలర్లే కారణమని నిందించాడు. ఈ విషయంపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్‌.. రూట్‌ తీరుపై ఘాటుగా స్పందించాడు. జట్టు అవసరాలను బట్టి ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టాల్సిన బాధ్యత కెప్టెన్‌దేనని సూచించాడు. జట్టు విజయం కోసం పదునైన వ్యూహాలను రచించాలని పేర్కొన్నాడు.

"సీనియర్‌ బౌలర్లు అని కూడా చూడకుండా.. కెప్టెన్‌ జో రూట్ వారిని విమర్శించడం చాలా బాధగా అనిపించింది. ఆటగాళ్లు మెరుగ్గా రాణించలేనప్పుడు వారిని దారిలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత కెప్టెన్‌దే. అవసరమైతే బౌలర్లు సరైన లెంగ్త్‌లో బంతులేసేలా సూచనలు చేయాలి. ఎలా బౌలింగ్ చేస్తే వికెట్లు రాబట్టవచ్చో ఆలోచించాలి. జట్టు విజయం కోసం పదునైన వ్యూహాలు రచించాలి. కెప్టెన్‌ ప్రణాళికతో ఏకీభవించని ఆటగాళ్లను పక్కన పెట్టే హక్కు కూడా కెప్టెన్‌కుంది. వారి స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలి. కెప్టెన్సీ అంటే అదే. ఆ పని చేయలేనప్పుడు కెప్టెన్‌గా కొనసాగడంలో అర్థం లేదు."

-రికీ పాంటింగ్, ఆసీస్ మాజీ క్రికెటర్

"ఇంగ్లాండ్‌ పిచ్‌లపై బౌలింగ్‌ చేసినట్టు ఇక్కడ చేస్తే కుదరదు. పిచ్‌ను బట్టి బౌలింగ్‌లో వైవిధ్యం చూపించాలి. ఈ విషయం గురించి రూట్‌.. బౌలర్లతో చర్చించి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో. 2017-18లో యాషెస్‌ టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియా 0-4 తేడాతో గెలుచుకుంది. అప్పుడు చేసిన తప్పులనే ఇంగ్లాండ్‌ ఈ సిరీస్‌లో పునరావృతం చేస్తోంది. నాలుగేళ్ల క్రితం ఎలా బంతులేశారో ఇప్పుడు కూడా అలాగే వేస్తున్నారు. అదే ఇంగ్లాండ్‌ను దెబ్బ కొట్టింది. అయితే, ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే గాయం కారణంగా రూట్ ఫీల్డ్‌ నుంచి తప్పుకున్నాక.. నాలుగో రోజు నుంచి బెన్‌ స్టోక్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అప్పటి నుంచి బౌలర్లు కొంచెం మెరుగ్గా రాణించారు. కాగా, రెండో టెస్టు సందర్భంగా ఇంగ్లాండ్‌ జట్టులో కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెర వెనుక ఏం జరిగిందో తెలియదు. కానీ, స్వయానా ఇంగ్లాండ్ కోచ్‌.. జట్టు ఎంపికలో తప్పు జరిగిందని చెప్పడం విచిత్రం" అని పాంటింగ్ పేర్కొన్నాడు.

ఇవీ చూడండి: Vijay Hazare Trophy: సెమీస్​కు తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.