NZ vs SL: కేన్ మామ డబుల్.. సచిన్​ రికార్డ్​ ఈక్వల్​.. శ్రీలంకకు ట్రబుల్!

author img

By

Published : Mar 18, 2023, 11:32 AM IST

Updated : Mar 18, 2023, 11:45 AM IST

NZ vs SL
NZ vs SL ()

వెల్లింగ్టన్‌ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌ రెండో రోజు న్యూజిలాండ్‌ ఆటగాళ్లు కేన్‌ విలియమ్సన్‌ (215), హెన్రీ నికోల్స్‌ (200 నాటౌట్‌) ద్విశతకాలతో విరుచుకుపడ్డారు. ఫలితంగా కివీస్‌.. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ చేసి డిక్లేర్‌ చేసింది.

సొంతగడ్డపై శ్రీలంకతో జరుగుతున్న రెండు టెస్ట్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ తన జోరును కొనసాగిస్తోంది. తొలి టెస్ట్‌లో ఆఖరి బంతికి గెలిచిన కివీస్.. రెండో టెస్ట్‌లోనూ భారీ స్కోర్ నమోదు చేసింది. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (296 బంతుల్లో 23 ఫోర్లు, 2 సిక్స్‌లతో 215), హెన్రీ నికోల్స్ (240 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 200 నాటౌట్) డబుల్ సెంచరీలతో చెలరేగడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 580/4 స్కోర్ వద్ద డిక్లేర్ ఇచ్చింది. ఈ ఇద్దరికి తోడుగా ఓపెనర్ డెవాన్ కాన్వే (108 బంతుల్లో 13 ఫోర్లతో 78) హాఫ్ సెంచరీతో రాణించాడు. శ్రీలంక బౌలర్లలో కసున్ రజితా రెండు వికెట్లు తీయగా.. ధనుంజయ డిసిల్వా, ప్రబత్ జయసూర్య తలో వికెట్ పడగొట్టారు.

డబుల్ సెంచరీతో కేన్ మామ అరుదైన రికార్డును దక్కించుకున్నాడు. కెరీర్‌లో 6వ డబుల్ సెంచరీ నమోదు చేసిన కేన్.. అత్యధిక డబుల్ సెంచరీలు బాదిన జాబితాలో దిగ్గజాల సరసన నిలిచాడు. సచిన్ తెందూల్కర్​, వీరేంద్ర సెహ్వాగ్‌, మార్వన్ ఆటపట్టు, జావెద్ మియాందాద్‌, యూనిస్ ఖాన్‌, రికీ పాంటింగ్‌ల రికార్డును కేన్ మామ సమం చేశాడు. అత్యధిక డబుల్ సెంచరీల జాబితాలో డాన్ బ్రాడ్‌మన్ 12 డబుల్ సెంచరీలతో టాప్‌లో ఉన్నాడు. అతడు 52 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు.

వర్షం అంతరాయం కారణంగా తొలి రోజు 48 ఓవర్ల ఆటే సాధ్యమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మొదటి రోజు 2 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఈ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన న్యూజిలాండ్.. నిలకడగా బ్యాటింగ్ చేసింది. కేన్ విలియమ్సన్, నికోల్స్ లంక బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు. ముందుగా కేన్ మామ 106 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. నికోల్స్ 79 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. హాఫ్ సెంచరీ అనంతరం కాస్త ధాటిగా ఆడిన కేన్ మామ.. 171 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా.. న్యూజిలాండ్ 304/2 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

అనంతరం మరింత వేగంగా ఆడిన కేన్ మామ 231 బంతుల్లో 150 పరుగుల మార్క్ అందుకున్నాడు. మరోవైపు అతడికి అండగా నిలిచిన హెన్రీ నికోల్స్ ..173 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో కివీస్ 443/2 స్కోర్‌తో టీ బ్రేక్‌కు వెళ్లింది. మూడో సెషన్ ఆరంభంలోనే కేన్ మామ 285 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఆ కొద్దిసేపటికే అతను ఔటవ్వగా.. మూడో వికెట్‌కు నమోదైన 363 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం హెన్రీ నికోల్స్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకోవడం.. డారిల్ మిచెల్ ఔటవ్వడం.. 20 ఓవర్ల ఆటే మిగిలి ఉండటంతో న్యూజిలాండ్ డిక్లేర్ ఇచ్చింది.

Last Updated :Mar 18, 2023, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.