'కోల్​కతా నైట్​రైడర్స్​ ఆడే మ్యాచ్​లు బోర్​ అబ్బా!'

author img

By

Published : Apr 30, 2021, 12:35 PM IST

all KKR matches are a bit boring to me, Says Virender Sehwag

ప్రస్తుత ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టు పేలవ ప్రదర్శన చేయడంపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్​ నిరాశ వ్యక్తం చేశాడు. కోల్​కతా జట్టు ఆడే మ్యాచ్​లో తనకు బోర్​ కొట్టిస్తున్నాయని తెలిపాడు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. శుక్రవారం అహ్మదాబాద్‌ వేదికగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కోల్‌కతా కథ మారలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన మోర్గాన్‌ సేనలో రసెల్ (45), శుభమన్‌ గిల్ (43) రాణించడం వల్ల 154 పరుగుల స్కోరును చేసింది. ఓపెనర్లు పృథ్వీషా (82), శిఖర్ ధావన్ (46) మెరుపు ఇన్నింగ్స్​తో దిల్లీ క్యాపిటల్స్‌ 21 బంతులు మిగిలుండగానే విజయతీరాలను చేరింది. దీంతో కోల్‌కతా ఈ సీజన్‌లో ఐదో ఓటమిని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలోనే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్రదర్శనపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడాడు.

"నేను దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. సినిమాలు చూసినప్పుడల్లా చూసినప్పుడు బోర్‌ కొట్టే సన్నివేశాలను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. ఈ ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా మ్యాచ్‌లు నాకు కొంచెం విసుగు తెప్పిస్తున్నాయి. వాటిని నేను వేగంగా ఫార్వర్డ్ చేసి చూడాలి. చేసిన తప్పులనే పునరావృతం చేస్తూ వారి ఆటతో అందరికీ విసుగు తెప్పిస్తున్నారు. ఛేదనలోనూ అవే తప్పులను చేస్తున్నారు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇవే తప్పులు దొర్లాయి. అదృష్టవశాత్తు కెప్టెన్ మోర్గాన్ 47 పరుగులతో రాణించడం వల్ల అందులో కోల్‌కతా విజయం సాధించింది. జట్టు యాజమాన్యం సరైన నిర్ణయాలు తీసుకోవడంలేదని నాకనిపిస్తోంది. కెప్టెన్‌ నిర్ణయాలకు మీరు మద్దతు ఇస్తున్నామని మీరు(యాజమాన్యం) చెబుతున్నారు. కానీ, ఫలితాలు మారాలంటే బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయడానికి ప్రయత్నించాలి."

- వీరేంద్ర సెహ్వాగ్​, దిగ్గజ క్రికెటర్​

కోల్​కతా నైట్​రైడర్స్​ బ్యాటింగ్​ ఆర్డర్​లో మార్పులు అవసరమని సెహ్వాగ్​ అభిప్రాయపడ్డాడు. "కోల్‌కతా బ్యాటింగ్ ఆర్డర్‌ విషయంలో నేనిప్పటికీ సంతోషంగా లేను. ఎందుకంటే నితీశ్‌ రాణా ఓపెనింగ్ చేస్తున్నాడు. అతడు ఓపెనింగ్ చేయనవసరం లేదు. శుభమన్ గిల్ దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 40 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. కానీ, ఎక్కువ బంతులు ఆడాడు. ఇది మంచిదే అయినా రన్‌రేట్‌ పడిపోకుండా ధాటిగా ఆడే ఆటగాడు అతనికి జతగా ఉండాలి" అని సెహ్వాగ్ ముగించాడు.

ఇదీ చూడండి.. ఐపీఎల్​ బయోబబుల్​ సురక్షితం: జంపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.