ETV Bharat / sports

IPL: ఐంపాక్ట్​ ప్లేయర్​ రూల్​లో మార్పులు​.. ఫ్రాంచైజీలకు షాకిచ్చిన బీసీసీఐ!

author img

By

Published : Dec 9, 2022, 1:26 PM IST

వచ్చే ఐపీఎల్​లో 'ఇంపాక్ట్‌ ప్లేయర్‌' రూల్‌ను అమలు చేసే విషయమై బీసీసీఐ కొన్ని మార్పులు చేసిందట. ఆ వివరాలు..

Impact player ipl 2023
IPL: ఐంపాక్ట్​ ప్లేయర్​ రూల్​లో మార్పులు​.. ఫ్రాంచైజీలకు షాకిచ్చిన బీసీసీఐ!

ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్‌కు విశేష ఆదరణ దక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీ20 ఫార్మాట్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు భారత క్రికెట్ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే 'సబ్​స్టిట్యూట్'​కు బదులుగా 'ఇంపాక్ట్‌ ప్లేయర్‌' రూల్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ నిబంధనను ప్రయోగాత్మకంగా సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 టోర్నీలో ప్రవేశపెట్టింది. దీంతో ప్లేయర్​ హృతిక్‌ షోకీన్‌ తొలి ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు.

ఇక వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనను తీసుకురానున్నట్లు కూడా ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నిబంధనల్లో కొన్ని మార్పులు చేసి.. ఐపీఎల్‌ ఫ్రాంచైజీలకు షాకిచ్చిందని తెలిసింది. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కేవలం ఇండియన్ ప్లేయర్స్​కే వర్తింపజేయనున్నదట. లీగ్‌లో పాల్గొనే విదేశీ ఆటగాళ్లకు ఈ రూల్ వర్తించదని చెప్పిందట. రూల్ విదేశీ ప్లేయర్లకు వర్తించకపోవడానికి గల కారణాలను కూడా జట్లకు స్పష్టంగా చెప్పిందని తెలిసింది.

నిబంధనల ప్రకారం ఒక ఫ్రాంచైజీ.. ఒక మ్యాచ్​లో నలుగురు ఫారెన్ ప్లేయర్లను మాత్రమే ఆడించేందుకు అనుమతి ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్ కాన్సెప్ట్​ను అమలుచేస్తే అప్పుడు ఐదుగురు ఫారెన్ ప్లేయర్లను ఆడించినట్టు అవుతుంది. అది నిబంధనలకు విరుద్ధం. అందుకే ఈ రూల్‌ను కేవలం భారత క్రికెటర్లకే వర్తిస్తుందని బీసీసీఐ ఫ్రాంచైజీలకు వివరించే ప్రయత్నం చేసిందట. ఒకవేళ ముగ్గురు విదేశీ ఆటగాళ్లను తీసుకుంటే అప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను వాడుకోవచ్చా..? అని ఫ్రాంచైజీలు ప్రశ్నించాయి. దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రస్తుతం సమాలోచనలు చేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఇక త్వరలో జరుగనున్న ఐపీఎల్ వేలం అనంతరం ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనపై పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది.

సబ్‌స్టిట్యూట్‌.. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ మధ్య తేడా..?

సాధారణంగా ఇప్పుడున్న సబ్‌స్టిట్యూట్ రూల్‌ ప్రకారం.. ఎవరైనా గాయపడితే మైదానంలోకి వచ్చే సబ్‌స్టిట్యూట్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేయలేడు. కేవలం ఫీల్డింగ్‌ మాత్రమే చేయగలడు. అయితే కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌కు మాత్రం బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసే వీలుంది. ఎవరైనా ఆటగాడి తలకు గాయమైతేనే కంకషన్‌ వస్తాడు. అయితే సదరు గాయపడిన వ్యక్తి బ్యాటర్‌ అయితే బ్యాటర్.. బౌలర్‌ అయితే బౌలర్‌ మాత్రమే కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా రావాల్సి ఉంటుంది.

అదే ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌లో అలా ఉండదు. అయితే మ్యాచ్‌కు టాస్‌ వేసే ముందు ప్రతి జట్టూ 11 మంది ఆటగాళ్లతోపాటు మరో నలుగురు సబ్‌స్టిట్యూట్ల పేర్లను ప్రకటించాలి. అందులో ఒకరిని మ్యాచ్‌ మధ్యలోనే తుది జట్టులోకి తీసుకొనే వెసులుబాటు ఉంటుంది. అలా వచ్చిన ఆటగాడు బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసే అవకాశం దక్కుతుంది. అయితే ప్రతి ఇన్నింగ్స్‌లో 14 ఓవర్‌ పూర్తయ్యేలోపు ఎప్పుడైనా సరే సదరు ఇంపాక్ట్‌ ప్లేయర్‌ను మార్చుకొనే అవకాశం ఉంది. ఆ నిర్ణయాన్ని తప్పనిసరిగా ఫీల్డ్‌ అంపైర్‌తో చెప్పాల్సిందే.

ఇదీ చూడండి: బంగ్లాతో మూడో వన్డే.. కుల్దీప్​కు చోటు.. కొత్త సారథి ఎవరంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.